ప్రపంచం ఎప్పుడూ చూడని ఉపద్రవం కరోనా వైరస్. కాలంతో పరుగుపెడుతూ టార్గెట్లు చేధిస్తూ యమా బిజీగా ఉండే జనాలంతా ఇప్పుడు బతికుంటే బలుసాకు తినొచ్చు నాయనా.. అని గమ్ముగా ఇంట్లో కూర్చుంటున్నారు. వర్క్ ఫ్రం హోం ఉన్నవాళ్లు పని చేసుకుంటున్నా అత్యధిక మంది జనాభాకు మాత్రం ఏ పనీ లేదు. సహజంగానే ఈ ప్రభావం ఇంటర్నెట్ వినియోగాన్ని అపరిమితంగా పెంచేసింది. దానికి తోడు స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉండటంతో జనాలు దానికే అంకితమైపోతున్నారు. ఇందులో చిన్నా పెద్దా ముసలీ ముతకా తేడా కూడా ఏమీ లేదు. ఒకటీ రెండూ ఫోన్లున్న ఇళ్లల్లో అయితే ఫోన్ నాకు కావాలంటే నాకు కావాలంటూ చిన్న సైజు యుద్ధాలే జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అసలు ఈ కరోనా కష్టకాలంలో భారతీయులు తమ స్మార్ట్‌ఫోన్లను ఎలా వాడుతున్నారో ఓ లుక్కే్ద్దాం. నీల్సన్/ బార్క్ పరిశీలన ప్రకారం లాక్‌డౌన్ వేళ ఇండియాలో స్మార్ట్ ఫోన్ యూసేజ్ ఎలా ఉందంటే..
గంటన్నర ఎక్కువే
లాక్‌డౌన్ ప్రకటించిన తొలి వారంలోనే స్మార్ట్ ఫోన్ యూసేజ్ విపరీతంగా పెరిగింది. సాధారణంగా వారానికి 23.5 గంటలు స్మార్ట్‌ఫోన్ వాడే 35 నుంచి 44 ఏళ్ల ఏజ్ గ్రూప్‌వారు ఆ వారంలో 25 గంటలు యూజ్ చేశారు. అంటే యావరేజ్ స్మార్ట్ ఫోన్ యూజరే వారానికి గంటన్నర ఎక్కువ సేపు ఫోన్‌కు అతుక్కుపోయారన్నమాట. ఇక రోజూ 7,8 గంటలు ఫోన్ మీదే బతికేసే జీవులు ఇప్పుడు అంతకంటే ఎక్కువసేపే దాంతో గడుపుతున్నాయట.
చిన్న పట్టణాల్లోనే పెరిగింది
సాధారణంగా మెట్రో సిటీస్‌లో స్మార్ట్‌ఫోన్ వినియోగం బాగా ఎక్కువ. ఎందుకంటే ఆన్‌లైన్ షాపింగ్‌లు, క్యాబ్ బుకింగ్‌లు, ఫుడ్ ఆర్డర్లు ఇలా అన్నింటికీ స్మార్ట్ ఫోనే వాళ్లకు పెద్ద హెల్పింగ్ హ్యాండ్. అయితే విచిత్రంగా ఈ లాక్‌డౌన్ టైమ్‌లో స్మార్ట్ ఫోన్ వినియోగం మెట్రో నగరాల (6%) కంటే చిన్న పట్టణాల్లో ఎక్కువగా (8%) పెరిగింది.
ఆడాళ్లా మజాకా
ఇంకో విశేషమేమిటంటే కుర్రాళ్లు, అంకుల్స్ కంటే అమ్మాయిలు, మహిళలే స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారట. పురుషుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం లాక్‌డౌన్ టైమ్‌లో 6% పెరిగితే మహిళల్లో 7 శాతం పెరిగింది.
న్యూస్, సోషల్ నెట్‌వర్క్ వ్యూస్
ఇంట్లో ఖాళీగా కూర్చుంటున్న జనం న్యూస్‌తోపాటు సోషల్ మీడియాను పిచ్చగా ఫాలో అవుతున్నారని తేలింది. సాధారణ యూజర్లు కూడా వారానికి 242 నిముషాలు అంటే నాలుగు గంటలకు పైనే సోషల్ మీడియా చూస్తున్నారట. ఇది లాక్‌డౌన్ ముందుతో పోల్చితే 25% ఎక్కువ. ఇక న్యూస్ చూసేవాళ్ల సంఖ్య 17% పెరిగింది.
* అన్నింటికంటే ముఖ్యంగా వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ (వీడియో కాల్స్) మీద ఎక్కువ సమయం పెడుతున్నారట. వారానికి 277 నిముషాలు దీనిమీదే గడుపుతున్నారు. లాక్‌డౌన్‌కు ముందు కంటే ఇది 23% ఎక్కువ.
ఏ గంటలో ఏం చూస్తున్నారో తెలుసా?
సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల మధ్య ఎక్కువ మంది సోషల్ మీడియా చూస్తారు. ఇప్పుడు కూడా అదే టైమ్‌లో చూస్తున్నారు. కాకుంటే ఆ నాలుగు గంటల్లోనే సోషల్ మీడియా మీద ఎక్కువ టైమ్ పెడుతున్నారట. గేమింగ్ రాత్రి 8 నుంచి 10 గంటల మధ్యే ఎక్కువగా జరుగుతోంది.
ఆటలు వెనకబడ్డాయి
అయితే ఆన్‌లైన్ ఆటలు వీటన్నింటికంటే వెనకబడ్డాయి. ఏదో యూత్ మాత్రమే దీన్ని వాడుతుండటంతో పెద్దగా పెరుగుదలేమీ లేదు. పబ్‌జీ, కాల్ ఆఫ్ డ్యూటీ లాంటి పాపులర్ గేమ్స్ మీద గడిపే సమయం 12 శాతం పెరిగతే సబ్‌వే సర్ఫర్స్, టెంపుల్ రన్‌లాంటి పాత గేమ్స్ మీద ఆడే సమయం 38 శాతం పెరిగిందట.
ఆన్‌లైన్ గేమ్స్ హవా
లూడో, కేరమ్స్ లాంటి బోర్డ్ గేమ్స్‌నూ సెల్‌లో ఆడేస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఆడే వెసులుబాటు ఉండటంతో ఎక్కడెక్కడో ఉన్నవాళ్లు ఒకే గేమ్ ఆడేయగలుగుతున్నారు. ప్రశ్న, జవాబులు, క్విజ్‌లకు సంబంధించిన యాప్స్, సైట్ల మీద కూడా జనం బాగానే ఆసక్తి చూపుతున్నారట.
ఫుడ్ అండ్ ట్రావెల్ , ఆన్‌లైన్ షాపింగ్
ప్రయాణాలు బంద్. ట్రాన్స్‌పోర్టేషన్ ఆగిపోయింది. దీంతో ట్రావెల్ యాప్స్ చూసేవారి సంఖ్య 32 శాతం పడిపోయింది. ఆన్‌లైన్ షాపింగ్ సైట్లు ఆర్డర్లు తీసుకోవడం మానేశాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఈ-కామర్స్ జెయింట్స్ బట్టలు, ఎలక్ట్రానిక్స్ లాంటివి అమ్మడం ఆపేసి గ్రాసరీల మీద దృష్టి పెట్టాయి. అవి కూడా ఇప్పుడు ఆర్డర్ పెడితే వారానికో పది రోజులకో వస్తున్నాయి. మింత్రా లాంటి ఓన్లీ ఫ్యాషన్ సైట్లు నో ఆర్డర్ ప్లీజ్ అని బోర్డులు పెట్టేశాయి. ఫుడ్ ఆర్డర్ల యాప్స్‌దీ అదే పరిస్థితి. జొమాటో, స్విగ్గీ ఇప్పుడు కొద్దిగా డెలివరీలు మొదలుపెట్టి మళ్లీ లైన్లోకి వస్తున్నాయి. అయితే బయటి ఫుడ్ తినడానికి జనం ఇష్టపడడం లేదు.