జియో ఫోన్. మొబైల్ నెట్‌వర్క్ కంపెనీ రిలయన్స్ జియో తన యూజర్ల కోసం తయారుచేసిన ఫీచర్ ఫోన్. ఫేస్‌బుక్, వాట్సాప్ లాంటివి వాడుకునే అవకాశం కూడా ఈ ఫీచర్ ఫోన్ స్మార్ట్‌ఫోన్ల యుగంలోనూ ఓ ఊపు ఊపింది. ఇది నాలుగేళ్ల కిందటి ముచ్చట. ఇప్పుడు జియో ఆ 2జీ యూజర్లను 4జీ వైపు మళ్లించడానికి, తన కస్టమర్ బేస్‌ను తగ్గకుండా చూసుకోవడానికి జియో ఫోన్ నెక్స్ట్‌ను తీసుకురాబోతోంది. ఇంతకీ ఈ బేసిక్ మోడల్ స్మార్ట్ ఫోన్ విజయవంతం అవుతుందా? లేదా?
జియోఫోన్ సూపర్ సక్సెస్
జియోఫోన్‌ను జియో 2017లో రిలీజ్ చేసింది. అప్పటికి స్మార్ట్‌ఫోన్లు ఇండియాలో బాగానే చొచ్చుకొచ్చాయి. అలాంటి పరిస్థితుల్లో ఫీచర్ ఫోన్ దింపడం ఓ రకంగా జూదమే. కానీ జియో చేసి చూపించింది. ఫీచర్ ఫోన్లోనే వాట్సాప్, ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియా యాప్స్, జియో సొంత యాప్స్ పెట్టి మార్కెట్లోకి రిలీజ్ చేసింది. కేవలం మూడు రోజుల్లోనే 60 లక్షల ఫోన్లు బుక్ అవ్వడం ఈ ఫోన్ సక్సెస్‌కు నిదర్శనం. ఇప్పటి వరకు 10 కోట్ల జియోఫోన్లు అమ్మి రికార్డు సృష్టించింది.
జియోఫోన్ నెక్స్ట్ అలాగే హిట్టవుద్దా?
2జీ ఫోన్లకే పరిమితమైన కోట్లమందిని నమ్ముకుని జియోఫోన్‌ను తీసుకొచ్చి సక్సెస్ సాధించిన ముకేశ్ అంబానీ కంపెనీ ఇప్పుడు మళ్లీ అలాంటి జూదానికే సిద్ధమైంది. ఇప్పటికీ చాలామంది 2జీ యూజర్లు 4జీ వైపు మళ్లడానికి ఇష్టపడని నేపథ్యంలో
వారినే టార్గెట్‌గా ఈ ఫోన్ రిలీజ్ చేస్తోంది. సెప్టెంబర్ 10న జియోఫోన్ నెక్స్ట్ పేరుతో బేసిక్ మోడల్ ఆండ్రాయిడ్ ఫోన్ లాంచ్ చేయబోతోంది.
ధర తగ్గితేనే
కరోనా పేరుతో పిల్లలంతా ఆన్‌లైన్ క్లాసులకే పరిమితమయ్యారు. ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే రెండు ఫోన్లు తప్పనిసరి అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాలా కంపెనీలు 5,6 వేల రూపాయల బడ్జెట్లోనూ బేసిక్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు తెచ్చాయి. అంత ధర కూడా భరించలేని వారు దేశంలో కోట్లమంది ఉన్నారు. అందుకే గూగుల్‌తో జట్టు కట్టి జియోఫోన్ నెక్స్ట్ ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకొచ్చిన జియో దాని ధరను మూడు, నాలుగు వేల రూపాయల ధరలో పెడితే సూపర్ సక్సెస్ ఖాయం.