ఫిన్‌టెక్.. ఫైనాన్షియల్ కమ్ టెక్నాలజీ స్టార్టప్ పేటీఎం తెలుసా? అంత పెద్ద పదాలు ఎందుకులేగానీ గల్లీలో దుకాణం నుంచి మెగా మార్ట్‌ల వరకూ ఎక్కడపడితే అక్కడ కనిపించే పేటీఎం తెలుసుగా. డిజిటల్ వాలెట్‌గా ఇండియాలో ఎక్కువ మంది వాడుతున్నది బహుశా దీన్నే కావచ్చు. ఇంత పాపులరయింది కాబట్టి మంచి లాభాల్లోనే ఉంటుంది కంపెనీ అనుకుంటున్నారు. అంతలేదు.. ఈ ఏడాది కూడా రూ.2,833 కోట్ల నష్టం మూట గట్టుకుంది. పేటీఎమ్ గత ఫైనాన్షియల్ ఇయర్‌లో రూ.2,833 కోట్ల నష్టం తెచ్చుకుంది. దీంతో వరుసగా ఏడో సంవత్సరమూ నష్టాలే వచ్చాయి.
ఒకప్పుడు నంబర్ వన్
డిజిటల్ వాలెట్లు అంటే ఇండియాలో తెలిసిందే పేటీఎం వల్లే. డీమానిటైజేషన్ అదేనండీ 2016లో పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు జనం చేతిలో డబ్బులు లేక టీకొట్టులోనూ, కూరగాయల దగ్గర కూడా పేటీఎం వాడేవారు. అలా అందరికీ డిజిటల్ వాలెట్‌ను దగ్గర చేసింది. డీమానిటైజేషన్ తర్వాత పేటీఎం డౌన్‌లోడ్లు అంతకు ముందుతో పోల్చితే ఏకంగా 5వేల రెట్లు పెరగడం పేటీఎం క్రేజ్‌కు ఓ ఉదాహరణ.
నష్టాలు ఎందుకొస్తున్నాయంటే?
* యూనిఫైడ్ పేమెంట్ (యూపీఐ) విభాగంలో ఈ-వ్యాలెట్ వ్యాపారానికి పేటీఎం తీవ్రమైన పోటీని ఎదుర్కొంటోంది. పేటీఎంలో వాలెట్‌లోకి మనీ యాడ్ చేయడం కొంత క్లిష్టంగా ఉండేది. దాంతో చాలామంది నేరుగా బ్యాంక్ అకౌంట్‌లో నుంచి డబ్బులు పంపగలిగే, బిల్లు పే చేయగలిగే యూపీఐ ఆధారిత యాప్స్ మీద దృష్టి పెట్టారు. గూగుల్‌పే, ఫోన్ పే అలా క్లిక్కయ్యాయి.
* గూగుల్ పే, భారత్ పే,అమెజాన్ పే, ఫోన్ పే పేటీఎంను ఊపిరి తీసుకోనివ్వడం లేదు.
* క్యాష్‌బ్యాక్‌లు, డిస్కౌంట్ కూపన్ల వల్ల కోట్ల రూపాయల నష్టం వస్తోంది.
* నిర్వహణ ఖర్చులు కూడా బాగా పెరిగాయి.
ప్లస్‌పాయింట్లు వదిలేసుకుంటోంది
* మిగతా యూపీఐలు, వాలెట్లన్నీ మన ఖాతాలో డబ్బులుంటేనే పని చేస్తాయి. కానీ పేటీఎంకు క్రెడిట్ కార్డ్ నుంచి కూడా మనీ లోడ్ చేసుకోవచ్చు. ఇది వరకు ఇది ఫ్రీ సర్వీస్ కాబట్టి క్రెడిట్‌కార్డున్న వాళ్లు పేటీఎంలోకి మనీ వేసుకుని వాడేవారు. కానీ ఇప్పుడు 2% ట్రాన్సాక్షన్ ఛార్జీ తీసుకోవడంతో ఎక్కువమంది పేటీఎంను పెద్దగా పట్టించుకోవడం లేదు.
* మరోవైపు క్యాష్‌బ్యాక్‌లు తగ్గిపోవడం, డిస్కౌంట్ కూపన్లు రోజువారీ అవసరాలకు పెద్దగా పనికిరానివి ఇవ్వడం పేటీఎం కస్టమర్లను నిరుత్సాహపరుస్తోంది.
* ఇది వరకు ఒక ట్రాన్సాక్షన్ చేస్తే ఏదో క్యాష్‌బ్యాక్ లేదా గిఫ్ట్ కూపన్ వచ్చేది. ఇప్పుడు 7 లేదా 10 ట్రాన్సాక్షన్లు చేస్తే ఒక కూపన్
లేదా 10, 20 రూపాయల క్యాష్ బ్యాక్ మాత్రమే వస్తుండటం పేటీఎం కస్టమర్లకు చిరాకు తెప్పిస్తోంది. అప్ టూ 1000 రూపాయల క్యాష్ బ్యాక్ అని 10, 20 రూపాయల క్యాష్బ్యాక్ ఇవ్వడం దారుణం అంటున్నారు.
2022 నాటికి లాభాల్లోకి వెళ్లాలని లక్ష్యం
వచ్చే ఏడాది(2021-22) నాటికి నష్టాలను వీడి లాభాల్లోకి ప్రవేశించాలని పేటీఎం మాతృసంస్థ వన్97 లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఫైనాన్షియల్ సర్వీసుల వ్యాపారం ప్రారంభించింది. పేటీఎం లోన్స్, ఇన్సూరెన్స్, వెల్త్ మేనేజ్‌మెంట్, కామర్స్ తదితర విభాగాలలోకి కార్యకలాపాలను విస్తరించింది.
వర్కవుట్ అవుతుందా?
క్రితం ఏడాదితో పోలిస్తే నష్టాలు 28 శాతం తగ్గడం కాస్త రిలీఫ్. ఖర్చులు కూడా ఓ 20% వరకు తగ్గించుకుంది. ఇన్‌కమ్ కూడా కిందటి సంవత్సరంతో పోలిస్తే 1% పెరిగింది. మొత్తంగా రూ. 3,350 కోట్ల ఆదాయాన్ని పొందింది.