ఒకప్పుడు టీవీ చూడడం అంటే అదో గొప్ప సరదా! ప్రతి ఇళ్లు సీరియల్స్‌తో మారుమోగిపోయేవి. ఉదయం నుంచి రాత్రి వరకు నాన్‌స్టాప్‌గా టీవీ చూసేవాళ్లు ఉండేవాళ్లు. క్రికెట్ మ్యాచ్‌లు వచ్చినప్పుడైతే ఇంట్లో చిన్నపాటి మల్ల యుద్ధాలు కూడా జరిగేవి. ఐతే అదంత ఒకప్పటి సంగతి. ఎప్పుడైతే మన మొబైల్స్ స్మార్ట్ అయిపోయాయో అప్పుడే టీవీలకు మనం దూరం అయిపోయాం. ఎక్కువశాతం మంది టీవీలను వదిలిపెట్టి మొబైల్స్ మీద పడ్డారు. 24 గంటలు మొబైల్స్ మీదే తమ దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఇప్పుడు కూడా టీవీలు చూసేవాళ్ల సంఖ్య తక్కువేం కాదు. కానీ `గతంతో పోలిస్తే ఈ సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఎంతగా తగ్గిపోయిందంటే ఇప్పుడు టీవీ మీద మనం ఖర్చు చేసే సమయం కంటే మొబైల్ మీద పెట్టే సమయం 7 రెట్లు ఎక్కువట. ఈ విషయం ఇటీవల పరిశోధనల్లో తేలింది.
వారానికి 28 గంటలు
మనం టెక్నాలజీకి ఎలా అలవాటుపడిపోయం అన్నదానికి స్మార్ట్‌ఫోన్ల వాడకమే పెద్ద ఉదాహరణ. వారానికి 28 గంటలు స్మార్ట్‌ఫోన్లను ఉపయోగించడంపైనే జనం దృష్టి పెడుతున్నారట. టెలివిజన్ చూడడం కోసం కేవలం వారానికి నాలుగు గంటల సమయమే వెచ్చిస్తున్నారట. పదేళ్ల క్రితంతో పోలిస్తే ఇది చాలా పెద్ద మార్పు. ఎందుకంటే ఒకప్పుడు జనం టీవీలను వదిలేవాళ్లే కాదు. కానీ టీవీలో చానెల్స్ ఎక్కువ అయిపోవడం, ఆసక్తికర కార్యక్రమాలు తగ్గిపోవడంతో వ్యూవర్స్ నెమ్మదిగా ఇంటర్నెట్ ఉన్న మొబైల్స్ దిశగా మళ్లారని పరిశోదనలో వెల్లడైంది. మొబైల్స్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే 45 శాతం అంటే 12 గంటలు వెచ్చిస్తున్నారట. అంటే టీవీతో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ.
పేపర్లు 2 గంటలు మాత్రమే
ప్రింట్ మీడియాకు రోజు రోజుకి ఆదరణ తగ్గిపోతుందన్న దానికి నిదర్శనమిదే. ప్రతి రోజూ పేపర్లు చూడడానికి వెచ్చించే సమయం బాగా తగ్గిపోతుందట. వారానికి కేవలం రెండు గంటలు మాత్రమే ప్రింట్ మీడియాపై సమయాన్ని కేటాయిస్తున్నారు జనం. మొబైల్‌లో కూడా న్యూస్ చూడటానికి వారు మరీ ఎక్కువ సమయాన్ని కేటాయించట్లేదట. న్యూస్ యాప్‌ల ద్వారా కేవలం ఒక గంట కేటాయిస్తే అదే గొప్పని పరిశోధనలో వెల్లడైంది. అయితే షాపింగ్ సైట్లను చూడటానికి మాత్రం జనం టైమ్ చూసుకోవట్లేదు. ఎంత సమయమైనా వీటి కోసం మొబైల్స్‌లో ఖర్చు చేస్తున్నారు. హాట్‌స్టార్ ద్వారా వీడియోలు చూడటానికి కూడా వ్యూవర్లు ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇక యూట్యూబ్ వీడియోలు చూడటానికి వెచ్చించే సమయం చాలా చాలా ఎక్కువ.
పెద్ద సంఘటనలు జరిగినప్పుడే..
ఏమైనా పెద్ద సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే జనం టీవీలు చూడటానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు తప్ప మామూలు సందర్భాల్లో టీవీల పట్ల పెద్దగా ఆసక్తి చూపట్లేదట. సీరియల్స్ చూసేవాళ్ల సంఖ్య బాగానే ఉన్నా వీరి వాళ్ల ఆ కాస్త సమయమైనా టీవీలు చూస్తున్నారని లేకపోతే టీవీ రేటింగ్స్ మరీ పడిపోయే అవకాశాలు ఉండేవని ఈ సర్వే సారాంశం. అంతేకాదు డెస్క్‌టాప్‌తో పోలిస్తే మొబైల్స్‌లోఇంటర్నెట్ చూస్తున్న వారరి శాతం 80 శాతం ఉందని తేలింది. వీరిలో 35 ఏళ్లలోపు వారే ఎక్కువగా ఉన్నారని తెలిసింది.