వాట్సాప్ వినియోగదారుల డేటాను తన మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో పంచుకుంటామని, ఇందుకు అనుగుణంగా తయారుచేసిన తాజా ప్రైవసీ పాలసీని వినియోగదారులంతా అంగీకరించాల్సిందేనని జనవరి 4న వాట్సాప్ ఓ ప్రకటన ఇచ్చింది. ఫిబ్రవరి 8లోగా కొత్త ప్రైవసీ పాలసీని యూజర్లు యాక్సెప్ట్ చేయాలని, లేకపోతే తర్వాత వారు వాట్సాప్ వాడుకోవడం కుదరదని తేల్చేసింది.దీనిమీద ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ యూజర్లను గగ్గోలు పెట్టిస్తుంది. వాట్సాప్ చేసిన ఈ తొందరపాటు పని కొత్తగా మరో యాప్ పంట పండించింది. అదే సిగ్నల్ యాప్. ఇంతకీ వాట్సాప్ తప్పు సిగ్నల్ పంట ఎలా పండించిందో విశ్లేషణ.
ఎలాన్ మస్క్ ప్రకటనతో ఫేమస్
వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీని అంగీకరించవద్దని, అవసరమైతే వాట్సాప్‌ను వదిలేసి సిగ్నల్ యాప్‌ను వాడుకోండని ప్రపంచ కుబేరుడు,టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించడంతో అందరి దృష్టీ ఒక్కసారిగా సిగ్నల్‌పై పడింది. తాజాగా పేటీఎం అధినేత విజయ్ శేఖర్ శర్మ కూడా సిగ్నల్ గురించి చెప్పడంతో ఎక్కువ మంది ఇప్పుడు ప్లే స్టోర్‌లో సిగ్నల్ యాప్ గురించి వెతుకుతున్నారు.
కోటి డౌన్‌లోడ్స్
సిగ్నల్ అనేది ఒక ఎన్జీవో నడిపిస్తున్న యాప్ . గూగుల్ ప్లే స్టోర్‌లో ఇప్పటికే కోటి మందికి పైగా సిగ్నల్ |యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నారు. రేటింగ్ కూడా 4.5 ఇచ్చారు. యాపిల్ ఐ స్టోర్‌లోనూ దీనికి బీభత్సమైన క్రేజ్ వచ్చేసింది. ఇండియలో యాపిల్ ఐ స్టోర్‌లో ప్రస్తుతం సిగ్నల్ యాప్ నెంబర్‌వన్ పొజిషన్‌లో ఉంది. ట్విటర్ సీఈవో జాక్ డోర్సే వంటి ప్రముఖులు సైతం సిగ్నల్‌ను ప్రమోట్ చేస్తున్నారు. మొత్తంగా చూస్తే వాట్సాప్ చేసిన తొందరపాటు చర్య సిగ్నల్ పంట పండించినట్లే కనిపిస్తోంది.