మనం ఎక్కడున్నామో.. ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకోవడానికి శతాబ్దాలుగా మ్యాపులమీద ఆధారపడుతూనే ఉన్నాం. అయితే, ఈ ఆధునిక యుగంలో మరింత కచ్చితంగా దారిచూపగలవిగా రూపొందిన డిజిటల్ మ్యాపులు కూడా ఆధారపడదగినవి కాదని ఇప్పుడనిపిస్తోంది. ఇటీవల అమెరికాలోని న్యూయార్క్ నగరంలో చోటుచేసుకున్న ఉదంతమే ఇందుకు నిదర్శనం. ఇటీవలే “స్నాప్‌చాట్” (SNAPCHAT)వినియోగదారులు ఆ యాప్‌లోని అంతర్జాతీయ మ్యాప్‌లో న్యూయార్క్ నగరం పేరును జాతి వివక్ష ప్రదర్శించే “జ్యూట్రోపోలిస్”గా మార్చేసినట్లు కనిపించడం చూసి కంగుతిన్నారు. అలాగే వాషింగ్టన్ DCలోని సెనేట్ ఆఫీస్ భవనాన్ని ఆగస్టు 25న మరణించిన సెనేటర్ జాన్ మెక్ కెయిన్ పేరిట గూగుల్ మ్యాప్స్ చూపించింది. అంతేకాకుండా ప్లంబర్లు, హోటళ్లకు సంబంధించి అనేక నకిలీ బిజినెస్ లిస్టింగ్స్‌ను గూగుల్ మ్యాప్స్ చూపుతున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు.
వాస్తవానికి గూగుల్, యాపిల్‌సహా పెద్దగా పేరులేని కంపెనీలు కూడా నిత్యవాస్తవ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూనే ఉంటాయి. ఇందుకోసం అవి ఉపగ్రహ వ్యవస్థ నుంచి మన చేతిలోని ఫోన్‌దాకా రకరకాల ఆధునిక ఉపకరణాలను వినియోగిస్తాయి. అయితే, వీటికితోడు సామాన్యులు సమకూర్చే సమాచారం మరో ముఖ్యమైన ఉపకరణంగా ఉంటోంది. నేటి మ్యాప్‌లను వికీపీడియా తరహాలో గందరగోళానికి గురిచేస్తున్నది ఈ ఉపకరణమే! ‘జనవిజ్ఞానం’ చాలా సందర్భాల్లో సవ్యంగానే పనిచేసినా, కొన్ని సందర్భాల్లో మనిషిలోని తుంటరితనం మంచి విషయాలను మరుగుపరచి అవాస్తవాలను ముందుంచుతూంటుంది. స్నాప్‌చాట్ వినియోగదారులు న్యూయార్క్ నగరం పేరును “జ్యూట్రోపోలిస్”గా చూడటం ఇలాంటిదే. ఇదే కాకుండా నగరంలోని ముఖ్య ప్రదేశాల పేర్లను కూడా కొందరు విద్వేషపూరిత పదజాలంతో మార్చేశారు. ఆయా మ్యాపింగ్ యాప్‌లకు నిజాయితీగా సమాచారం ఇచ్చేవారు దీన్ని కనుగొని, రెండు గంటల్లోపే సరిదిద్దినా మార్గనిర్దేశం కోసం అప్పటికే ఆ మ్యాప్‌లు చూసినవారు నివ్వెరపోయి ఉంటారనడంలో సందేహం లేదు.
గూగుల్ ఇలాంటి ఉపద్రవాలను చాలా ఏళ్లుగా ఎదుర్కొంటూనే ఉంది. ఈ ఏడాది ఆగస్టు 29న ‘రసెల్ సెనేట్ ఆఫీస్’ భవనానికి “మెక్‌కెయిన్ సెనేట్ ఆఫీస్ బిల్డింగ్”గా పేరు పెట్టనున్నట్లు గుర్తుతెలియని వ్యక్తులు సమాచారం పెట్టారు. ఫలితంగా సెనేటర్లలోనే ఇదొక చర్చనీయాంశమైంది. చివరకు ఈ అంశం మీడియా దృష్టికి వెళ్లి గూగుల్‌ను తప్పుబడుతూ వార్తలు కూడా వెలువడగా గూగుల్ ఆ పొరపాటును సరిదిద్దడంతోపాటు వివరణ కూడా ఇవ్వాల్సి వచ్చింది. చిన్నచిన్న వ్యాపారాలు, వృత్తిపనులు చేసుకునేవారి సౌలభ్యం కోసం బిజినెస్ లిస్టింగ్‌ను తమ మ్యాప్స్‌లో గూగుల్ సులభతరం చేసింది. ఈ వెసులుబాటు ఆసరాగా తుంటరులు తమ దుశ్చేష్టలకు మ్యాప్స్‌ను వాడుకుంటున్నారు. కాబట్టి వాస్తవ బిజినెస్ లిస్టింగ్స్ చేసేవారు వీటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ సరిదిద్దే ప్రయత్నం చేయడమే కాకుండా ఆ సమాచారాన్ని గూగుల్ వంటి మ్యాపింగ్ యాప్ నిర్వాహకుల దృష్టికి తెస్తూండాలి. లేకపోతే ఈ సమస్యకు పరిష్కారం ఇప్పట్లో సాధ్యం కాదన్నది వాస్తవం!