• తాజా వార్తలు

సెల్‌ఫోన్లూ అత్య‌వ‌స‌ర వ‌స్తువులే అంటున్న నిపుణులు.. ఎందుకో తెలుసా?

క‌రోనా వైర‌స్‌ను కంట్రోల్ చేయ‌డానికి లాక్‌డౌన్ తీసుకొచ్చిన సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ మూడుసార్లు దాన్ని పొడిగించింది. మూడో విడ‌త లాక్‌డౌన్ మే 17 వ‌రకు ఉంది. అయితే చివ‌రి విడ‌త‌లో మాత్రం గ్రీన్‌, ఆరంజ్ జోన్ల‌లో నిత్యావ‌స‌రాల‌తోపాటు సెల్‌ఫోన్లు, బ‌ట్ట‌లు లాంటివ‌న్నీ ఈకామ‌ర్స్  సంస్థ‌ల‌కు ఆర్డ‌ర్ ఇచ్చి తెప్పించుకోవ‌చ్చ‌ని చెప్పింది. అయితే రెడ్‌జోన్ల‌లో మాత్రం ఇప్ప‌టికీ నిత్యావ‌స‌రాల‌కు మాత్ర‌మే అనుమ‌తి ఉంది. ఈ ప‌రిస్థితుల్లో సెల్‌ఫోన్‌ను కూడా అత్య‌వ‌స‌రంగానే ప‌రిగ‌ణించాల‌ని మార్కెట్ నిపుణులు అంటున్నారు.

ఫోనే స‌ర్వ‌స్వం
ఇప్పుడు సెల్‌ఫోన్ లేక‌పోతే జీవితం గ‌డ‌వ‌దేమో అన్నంతగా అది మ‌న జీవితంతో పెన‌వేసుకుపోయింది.  క‌మ్యూనికేష‌న్‌, వ్యాపారం, వినోదం, ఉద్యోగం ఇలా అన్నింటికీ సెల్‌ఫోన్ ఉండ‌టం త‌ప్ప‌నిస‌రి అవ‌స‌రంగా మారింది. అందుకే నిత్యావ‌స‌రాలైన ప‌ప్పు ఉప్పులు, మందులు, చిన్న‌పిల్ల‌ల వ‌స్తువుల‌తోపాటు ఆ లిస్ట్‌లో సెల్‌ఫోన్స్‌ను కూడా చేర్చాల‌ని డిమాండ్ వినిపిస్తోంది.

ఇష్ట‌మైన‌వారికి ద‌గ్గ‌ర‌గా
  ప్ర‌జ‌లు త‌మ‌కు ఇష్ట‌మైన‌వారు ఎంత దూరంలో ఉన్నా వారితో ట‌చ్‌లో ఉండ‌టానికి ఫోన్‌నే న‌మ్ముకుంటున్నారు. ఫోన్ కాల్స్‌, మెసేజ్‌లు, వాట్సాప్‌లు, చాటింగ్‌లు, సోష‌ల్ మీడియాలు ఇలా అన్నింటితో ఎక్క‌డో ఉన్న త‌మ వారితో క‌నెక్ట్ అవ‌గ‌లుగుతున్నారు. ఫోన్ లేక‌పోతే ఇవ‌న్నీ సాధ్యం కావు. అందుకే  ఫోన్‌ను కూడా అత్య‌వ‌స‌రాల జాబితాలో చేర్చాలి అంటున్నారు కౌంట‌ర్ పాయింట్ సంస్థ‌లో రీసెర్చి అనలిస్ట్ అయిన నీల్ షా. 

ఫ్లిప్‌కార్ట్‌ల్లో అత్య‌ధికంగా సెర్చ్ చేసేది 
ఫ్లిప్‌కార్ట్ త‌న లేటెస్ట్ రిపోర్ట్‌లో చెప్పిన వివ‌రాల ప్ర‌కారం త‌మ ఫ్లాట్‌ఫామ్ మీద యూజ‌ర్లు ఎక్కువ‌గా సెర్చ్ చేసే వ‌స్తువు సెల్‌ఫోనేన‌ట‌.  15 నుంచి 20వేల లోపు ధ‌ర ఉండే మిడ్ ప్రీమియం సెగ్మెంట్ ఫోన్ల గురించి ఎక్కువ వెతుకుతార‌ని, అందువ‌ల్ల ఆ ధ‌ర లోపు ఫోన్ల‌ను నిత్యాస‌వ‌రాల జాబితాలో చేర్చాల‌ని షా అంటున్నారు. 

స్నాప్ డీల్‌లో 
మ‌రో ఈకామ‌ర్స్ సంస్థ స్నాప్ డీల్ కూడా త‌మ యూజ‌ర్లు సెర్చ్ చేసి, కొనే టాప్ 5 ప్రొడక్ట్స్‌లో స్మార్ట్‌ఫోన్లు కూడా ఉన్నాయ‌ని చెప్పింది. అమెజాన్ కూడా ఇదే అభిప్రాయం తెలిపింది.  

న‌గ‌రాల‌న్నీ రెడ్‌జోన్‌లోనే  
హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు, ముంబ‌యి, ఢిల్లీ, క‌ల‌క‌త్తా, ఇలా అన్ని ప్ర‌ధాన న‌గ‌రాలు ప్ర‌స్తుతం రెడ్ జో్న్‌లోనే ఉన్నాయి. త‌మ క‌స్ట‌మ‌ర్లు అత్య‌ధిక సంఖ్య‌లో ఉన్న ఈన‌గ‌రాల్లో రెడ్ జోన్ పేరుతో స్మార్ట్‌ఫోన్లు అమ్ముకోవ‌డానికి అవ‌కాశం లేకుండా పోతోంద‌ని, దీనికి అవ‌కాశం ఇవ్వాల‌ని స్మార్ట్‌ఫోన్ త‌యారీ కంపెనీలు కూడా ప్ర‌భుత్వాన్ని కోరాయి.  

జన రంజకమైన వార్తలు