• తాజా వార్తలు

ప్రివ్యూ - రియ‌ల్‌మీ టీవీ ఇండియ‌న్స్‌కే ప్ర‌త్యేకం అంటున్న కంపెనీ.. ఏమిటంత స్పెష‌ల్‌?

చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియ‌ల్‌మీ కూడా షియోమి బాట‌లోనే వెళుతుంది. ఇప్ప‌టికే వేర‌బుల్స్‌లో అడుగుపెట్టింది.  షియోమి ఎంఐ స్మార్ట్ టీవీలు తెచ్చిన‌ట్లే ఇప్పుడు రియ‌ల్‌మీ కూడా  ఇండియ‌న్ టీవీ మార్కెట్‌లోకి రాబోతోంది.  చాలాకాలంగా రియ‌ల్‌మీ టీవీ వ‌స్తుంద‌ని ప్రచారం జ‌రుగుతున్నా మార్కెట్లోకి అయితే  రాలేదు.  ఈ ప‌రిస్థితుల్లో తాజాగా రియల్ మీ టీవీలు ప్యాక్ అవుతున్న ఫొటో ఒకటి ఇప్పుడు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తోంది. దీనిపై రియ‌ల్‌మీ ఇండియా హెడ్ మాధ‌వ్ సేథ్ క్లారిటీ ఇచ్చారు.  రెండు నెల‌లుగా మేం రియ‌ల్ మీ టీవీపై సోష‌ల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌పై క్యాంప‌యిన్ చేశాం. నెటిజ‌న్స్ ఫీడ్ బ్యాక్ తీసుకున్నాం.  మా తొలి స్మార్ట్‌టీవీ  భార‌తీయ వినియోగ‌దారుల కోస‌మే ప్ర‌త్యేకంగా క‌స్ట‌మైజ్ చేస్తున్నామ‌ని సేథ్ ప్ర‌క‌టించారు. 

ఇంత‌కీ ఈ టీవీలో ఫీచ‌ర్లు ఏంటి?
రియ‌ల్‌మీ టీవీ గురించి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి స‌మాచార‌మూ అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. అయితే ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న లీక్స్ ప్ర‌కారం 

* 43 ఇంచెస్ సైజ్‌లోనే మొద‌ట ఈ రియ‌ల్‌మీ టీవీ అందుబాటులోకి వ‌స్తుంద‌ని తెలుస్తోంది.

* ఫుల్ హెచ్‌డీ, అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్ వేరియంట్లలో రియ‌ల్‌మీ టీవీ మార్కెట్లోకి రావ‌చ్చు.  బడ్జెట్ యూజ‌ర్ల‌ను దృష్టిలో పెట్టుకుని ఫుల్ హెచ్‌డీ టీవీని కాస్త త‌క్కువ ధ‌ర‌లోనే రిలీజ్ చేస్తార‌ని టెక్ నిపుణుల అంచ‌నా. అయితే అల్ట్రాహెచ్‌డీ టీవీ మాత్రం ధ‌ర కాస్త ఎక్కువ‌గానే ఉండ‌బోతోంది.  మొత్తంగా చూస్తే ఎంఐ టీవీల ప్రైస్ రేంజ్‌లోనే రియ‌ల్‌మీ టీవీలు కూడా అందుబాటులో ఉండొచ్చ‌ని మార్కెట్ అంచనా వేస్తుంది. 

* వేర్‌హౌస్‌లో ప్యాక్ చేస్తున్న రియ‌ల్‌మీ టీవీ బాక్స్ పైన  నెట్ ఫ్లిక్స్ లోగో కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ టీవీ నెట్ ఫ్లిక్స్ కు సపోర్ట్ చేస్తుంది లేదా నెట్ ఫ్లిక్స్ యాప్ ఇందులో ఇన్ బిల్ట్ గా రానుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. 

* రియ‌ల్‌మీ టీవీ  ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది.  అంతేకాదు గూగుల్  వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉంటుంద‌ని స‌మాచారం. అంటే వాయిస్ క‌మాండ్స్‌తోనే టీవీని ఆప‌రేట్ చేసుకోవ‌చ్చ‌న్న‌మాట‌.

మే 25న లాంచింగ్‌
ఇది ఇలా ఉండ‌గా రియ‌ల్‌మీ టీవీని  ఈ నెల 25న లాంచ్ చేయ‌బోతున్నారు.  ఈ రిలీజ్ ఈవెంట్‌ను యూట్యూబ్‌, ఫేస్‌బుక్, ట్విట‌ర్‌ల్లో చూడొచ్చ‌ని రియ‌ల్‌మీ ప్ర‌క‌టించింది. రియ‌ల్‌మీ టీవీతోపాటు రియ‌ల్‌మీ స్మార్ట్ వాచ్‌ను కూడా అదే ఈవెంట్‌లో రిలీజ్ చేస్తున్నామ‌ని చెప్పింది.

జన రంజకమైన వార్తలు