దేశంలో ఇప్పటికీ కొన్ని కోట్ల మంది 2జీ నెట్‌వర్క్ వాడుతున్నారని మొన్నా మధ్య అంబానీ అన్నారు. వీరిని కూడా 4జీలోకి తీసుకురావల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. దానికి తగ్గట్లుగా కస్టమర్లను ఆకర్షించేందుకు తక్కువ ధరకే 4జీ హ్యాండ్‌సెట్లు రెడీ చేయడానికి జియో.. మొబైల్ ఫోన్ తయారుచేసే కంపెనీలతో జట్టుకడుతోంది. రియల్ మీ, ఇతర కంపెనీలతో కలిసి 4జీ, ఇతర గాడ్జెట్స్ తయారు చేస్తున్నట్లు జియో సీనియర్ అధికారీ ఒకరు తెలిపారు. తక్కువ ధరకు 4జీ ఫోన్లను తీసుకురావడంతో పాటు రానున్న రోజుల్లో అందుబాటులోకి వచ్చే 5జీ నెట్ వర్క్ అనుగుణంగా ఫోన్ల తయారీకి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
జియో ప్లాన్ ఏంటి?
4జీ మొబైల్స్ ని కంపెనీలతో కలిసి తక్కువ ధరకు తీసుకొస్తే వాటిని కొనడానికి ఎక్కువమంది ముందుకొస్తారని జియో అంచనా. అప్పుడు ఆటోమేటిగ్గా ఆ కస్టమర్లు జియోనే తీసుకునేలా బండిల్డ్ ఆఫర్లు పెడుతుంది. 2జీలో ఉన్న కొన్ని కోట్ల మందిలో 10 నుంచి 20 శాతం జియోకు వచ్చినా జియో కస్టమర్ బేస్ 2,3 కోట్లు పెరిగే అవకాశాలున్నాయి. అందుకే జియో ఈ ప్లాన్ చేస్తోంది.
వినియోగదారులకూ లాభమే
ఇప్పుడు మార్కెట్లో 4జీ ఫోన్లు 5వేల ప్రారంభధర నుంచి అందుబాటులో ఉన్నాయి. అంతకంటే తక్కువకు గనుక జియో హ్యాండ్‌సట్లు తీసుకురాగలిగితే వాటికి కచ్చితంగా క్రేజ్ వస్తుంది. ముఖ్యంగా ఆన్‌లైన్ క్లాస్‌ల వంటి అవసరాల కోసం ప్రతి వారూ 4జీ ఫోన్లు కొనాల్సిన అవసరం ఉన్న పరిస్థితుల్లో జియో 5వేల కంటే తక్కువ ధరకు 4జీ హ్యాండ్‌సెట్లు తీసుకువస్తే వాటిని కొనడానికి యూజర్లు సిద్ధపడతారు. అదే జరిగితే అటు కస్టమర్లకు, ఇటు జియోకు ఇద్దరికీ లాభమేనన్నమాట.