హాట్ కేకుల్లా అమ్ముడుపోయే ఫోన్ల తయారీ సంస్థ షియోమీ(రెడ్ మీ) ఇంతవరకు ఆన్ లైన్లోనే ఎక్కువగా తన ఉత్పత్తులను సేల్స్ కు పెడుతోంది. ఫ్లిప్ కార్డ్ వంటి ఈకామర్స్ సైట్లతో పాటు తన సొంత ఆన్ లైన్ స్టోర్లోనూ అమ్మకానికి ఉంచేది. అయితే... మరో వారం రోజుల్లో షియోమీ ఇండియాలో తన తొలి ఆఫ్ లైన్ స్టోర్ ను ప్రారంభించబోతోంది.
'ఎంఐ హోమ్ స్టోర్' పేరుతో ఈ నెల 20వ తేదీన ఈ స్టోర్ బెంగుళూరులో ప్రారంభం కానుంది. బెంగుళూరులోని వైట్ ఫీల్డ్ ఫీనిక్స్ మార్కెట్ సిటీ మాల్‌లో ఎంఐ స్టోర్ ప్రారంభమవుతున్నది. ఇందులో షియోమీకి చెందిన స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, పవర్ బ్యాంక్స్, హెడ్ ఫోన్స్, ఎకో ప్రోడక్ట్స్‌ను వినియోగదారులు ఎక్స్‌పీరియెన్స్ చేయొచ్చు. నచ్చితేనే కొనుగోలు చేయవచ్చు.
కాగా బెంగుళూరులో ప్రారంభించబోతున్న తన స్టోర్ ఫొటోలను రెడ్ మీ ట్విట్టర్లో షేర్ చేసింది. దాని ప్రకారం స్టోర్ అదిరిపోయే లుక్ తో కనిపిస్తోంది. స్టోర్‌లో గోడలకు పెద్ద పెద్ద స్క్రీన్‌లను ఏర్పాటు చేసి అందులో డివైస్‌ల ఫీచర్లను తెలియజేసే క్లిప్లింగ్స్ వేస్తున్నారు. బెంగళూరు తరువాత దేశ వ్యాప్తంగా ఇలాంటి 100 ఎంఐ హోమ్ స్టోర్‌లను ప్రారంభించాలన్నది షియోమీ ప్లాన్. ఇప్పటివరకు చైనా, హాంగ్‌కాంగ్, తైవాన్, సింగపూర్‌లలోనే షియోమీ స్టోర్లు ఉన్నాయి, ఇప్పుడు ఇండియాలోనూ స్టార్ కానున్నాయి.