ప్రపంచంలోనే అతి పెద్ద కంప్యూటర్ ఏది? అంటే మొదటి తరం కంప్యూటర్ల పేర్లన్నీ గుర్తు చేసుకుంటున్నారా! మరి ప్రపంచంలోనే అతి చిన్న కంప్యూటర్ ఏది? ఎవరు కనిపెట్టారో తెలుసా? ఓస్ ఇంతేనా.. 1 మిల్లీమీటరు మందం గల అత్యంత చిన్న కంప్యూటర్‌ను ఐబీఎం రూపొందించింది కదా! అని సమాధానమిచ్చేయకండి. ఎందుకంటే ఇప్పుడు దాని కంటే అత్యంత తక్కువ మందం గల కంప్యూటర్‌ను మిచిగాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తయారుచేశారు. దీని పరిమాణం ఎంతో తెలుసా.. 0.33 మిల్లీ మీటర్లు! అంటే బియ్యపు గింజ కన్నా అతి తక్కువ అన్నమాట. ఈ కంప్యూటర్ పేరు మిచిగాన్ మైక్రో మోట్( M3). చిన్నగా ఉన్నా ఇది కంప్యూటర్‌లానే పనిచేస్తుందట. ఈ ఎం3 గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు..
చిన్నదే అయినా ప్రయోజనాలు బోలెడు
దీనిని సర్వేలైన్ అంటే నిఘా పరికరంగానూ ఉపయోగించుకోవచ్చు. ఆడియో పరికరాల్లో, వీడియో చిత్రీకరించేందుకు కెమెరాలోనూ వాడుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా ఆడియో, వీడియో సాంకేతికత అమర్చారు. ఈ చిన్న కంప్యూటర్‌లో ప్రాసెసర్, ర్యామ్, ట్రాన్స్‌మిటర్లు, రిసీవర్లు కూడా ఉన్నాయి. ఇందులో ఉన్న సమాచారం ఒకవేళ పోయినా బాధపడాల్సిన పనేలేదు. ఎందుకంటే సులువుగా ఈ సమాచారాన్నంతా తిరిగి తీసుకోవచ్చు. ఇందులో ప్రత్యేకమైన కాంతి విద్యుద్ఘటాలు అమర్చారు. ఇవి కాంతిని విద్యుశ్చక్తిగా మారుస్తాయి. వీటి ద్వారా ఈ కంప్యూటర్ పనిచేస్తుంది. ఇంకో విషయమేంటంటే.. ఈ కంప్యూటర్‌లో నేరుగా సమాచారాన్ని నిక్షిప్తం చేయలేం. మొదట సమాచారమంతా సిగ్నల్ రూపంలో బేస్ స్టేషన్‌కి వెళుతుంది. ఇక్కడి నుంచి మాత్రమే కంప్యూటర్‌కు చేరుతుంది. కేవలం కాంతి ద్వారానే సమాచారాన్ని పంపించగలం.. తీసుకోగలం.
వైద్య రంగంలోనూ..
ఇది కేవలం టెక్నాలజీ రంగంలోనేగాక వైద్య రంగంలోనూ మరింత మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంది. ముఖ్యంగా కంటి వ్యాధులను సులువుగా గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. గ్లకోమాతో బాధపడుతున్న వారిలో కంటిపై పడే ఒత్తిడిని గమనించేందుకు వీలవుతుంది. ఇక కేన్సర్ గుర్తించడంలోనూ ఉపయోగపడనుంది. కేన్సర్ కణితిలోని మార్పులను ఎప్పటికప్పుడు గమనించడంతో పాటు, కేన్సర్ కణజాలాన్ని, శరీర కణజాలంతో పరిశీలించి మార్పులను వైద్యులకు తెలిపే సెన్సర్‌గానూ వినియోగించవచ్చు. శరీరంలోని అతి చిన్న భాగాల్లోని ఉష్టోగ్రతలను కూడా తెలుసుకోవచ్చు.