• తాజా వార్తలు

త్వరలో రానున్న జియో ఆల్వేస్ కనెక్టెడ్ 4 జి లాప్ టాప్ మరొక విద్వంసక ఆవిష్కరణ కానుందా !

భారత టెలికాం రంగాన్ని గురించి చెప్పుకోవాలి అంటే జియో కి ముందు , జియో తర్వాత అని చెప్పుకోవాలేమో! అంతగా ఇండియన్ టెలికాం సెక్టార్ యొక్క ముఖ చిత్రాన్ని జియో మార్చి వేసింది. జియో యొక్క సంచలన రంగప్రవేశం తర్వాత భారత టెలికాం రంగంలో వచ్చిన మార్పుల గురించి చెప్పుకోవాలి అంటే ఒకపుస్తకం రాయాలేమో! ఒక్క ముక్కలో చెప్పాలంటే భారత టెలికాం రంగంలో ఒక విద్వంసక ఆవిష్కరణ గా రిలయన్స్ జియో ను చెప్పుకోవచ్చు. కేవలం మొబైల్ రంగానికే పరిమితo కాకుండా జియో లాప్ టాప్ ల రంగం లోనికి కూడా అడుగు పెట్టనుంది. ఎప్పుడూ కనెక్ట్ అయి ఉండే లాప్ టాప్ లు ( always connected laptops ) లను జియో తీసుకురానుంది. దీనియొక్క పూర్తి విశేషాలను ఈ ఆర్టికల్ లో చూద్దాం

always connected laptops అంటే ఏమిటి ?

పేరుకు తగ్గట్లే ఈ లాప్ టాప్ లు నిరంతరం ఇంటర్ నెట్ కు కనెక్ట్ అయి ఉంటాయి. మామూలుగా మన లాప్ టాప్ ఇంటర్ నెట్ కనెక్ట్ అవ్వాలి అంటే ఏదైనా హాట్ స్పాట్ ద్వారా గానీ, మోడెమ్ ద్వారా గానీ  కనెక్ట్ చేయాలి. వీటిలో అలాకాదు. ఈ లాప్ టాప్ లో ఎప్పుడూ ఒక 4 జి సిమ్ ఇన్ బిల్ట్ గా ఉంటుంది. అదే రిలయన్స్ జియో 4 జి సిమ్. అవును రిలయన్స్ జియో సిమ్ ఇన్ బిల్ట్ గా ఉన్న ఈ లాప్ టాప్ లు ఎప్పుడూ ఇంటర్ నెట్ కు కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట.

ఈ లాప్ టాప్ లకు సంబందించిన ఇతర వివరాలేవి?

అమెరికా చెందిన చిప్ మేకర్ అయిన క్వాల్ కాం తో కలిసి సంయుక్తంగా రిలయన్స్ జియో ఈ లాప్ టాప్ లను అందుబాటులోని తీసుకురానుంది. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం పై నడిచే ఈ లాప్ టాప్ లు ఇన్ బిల్ట్ సెల్యూలర్ కనెక్షన్స్ తో ఇండియన్ మార్కెట్ లోనికి రానున్నాయి. వీటిలో రిలయన్స్ జియో 4 జి సిమ్ ఇన్ బిల్ట్ గా ఉండనుంది. దీనికి సంబంధించి జియో యాజమాన్యం తో మాట్లాడడం జరిగిందనీ అతి త్వరలోనే భారత మార్కెట్ లోనికి ఈ క్వాల్ కాం లాప్ టాప్ లను అందుబాటులోనికి తీసుకురానున్నామని క్వాల్ కాం టెక్నాలజీస్ యొక్క సీనియర్ డైరెక్టర్ మిగుల్ న్యూన్స్ ఒక ప్రకటనలో తెలిపారు.

జియో లాప్ టాప్ విద్వంసక ఆవిష్కరణ కానుందా?

మనం ముందు చెప్పుకున్నట్లు భారతతెలేకం మార్కెట్ లో జియో ఖచ్చితంగా ఒక విద్వంసక ఆవిష్కరణే! భారత స్మార్ట్ ఫోన్ రంగాన్ని ఒక ఊపు ఊపిన తర్వాత జియో ఫీచర్ ఫోన్ మార్కెట్ లోనికి ప్రవేశించింది.జియో ఫీచర్ ఫోన్ అమ్మకాలలో కూడా సంచలనాలు సృష్టిస్తూ అప్పటివరకూ ఉన్న ఫీచర్ ఫోన్ మార్కెట్ ను తన సంపూర్ణ ఆధిపత్యంలోనికి తెచ్చుకుంది. ఇండియాలో ఫీచర్ ఫోన్ వాడే విధానాన్నే మార్చే ప్రక్రియ కు జియో శ్రీకారం చుట్టింది. అది కూడా ఉచితం అనే ఆఫర్ తో. ఒక్కసారి రిలయన్స్ జియో మరియు ఫీచర్ ఫోన్ ఈ రెండింటి యొక్క ఆగమనాన్నీ, గమనాన్నీ పరిశీలిస్తే వీటి వలన భారత టెలికాం రంగం లో భారీ మార్పులు మనం గమనించవచ్చు. ఒంటరిగా ఇంత విద్వంసాన్ని కలుగజేసిన జియో ఇప్పుడు ప్రముఖ చిప్ సెట్ మేకర్ లతో కలిసివస్తుంది. ఇక ఈ విద్వంసం ఏ స్థాయి లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇండియా లోని యూజర్  లు లాప్ టాప్ వాడే విధానాన్నే ఇది మార్చనుందని టెక్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎలాగైతే ఇండియన్ టెలికాం ఆపరేటర్ లు డేటా మరియు కాలింగ్ విషయం లో జియో ను అనుసరించాయో అదేవిధంగా ఈ always connected laptaps విషయం లోనూ జియో ను అనుసరించే అవకాశాలు లేకపోలేదు. ఏది ఏమైనా అంతిమంగా లాభపడేది మాత్రం వినియోగదారుడే అని మాత్రం చెప్పవచ్చు.

ఇక ఈ లాప్ టాప్ తయారీదారు అయిన క్వాల్ కాం విషయానికొస్తే ఇది ఇప్పటికే 4 జి ఫీచర్ ఫోన్ విషయం లో జియో తో కలిసి పనిచేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా HP, ఆసుస్ మరియు లెనోవా లాంటి లాప్ టాప్ లను క్వాల్ కాం పవర్ చేస్తుంది. ఈ కనెక్టెడ్ లాప్ టాప్ లకు సుమారు 14 కంపెనీలు తమ సపోర్ట్ ను ప్రకటించినట్లు క్వాల్  కాం చెబుతుంది. క్వాల్ కాం మరియు మైక్రో సాఫ్ట్ కలిసి పనిచేయనున్నట్లు గత సంవత్సరమే ప్రకటించాయి. SD 835  తో పవర్ చేయబడి ఉండే ఈ డివైస్ లు LTE కనెక్టివిటీ తో పాటు 20 గంటల బ్యాటరీ బ్యాక్ అప్ ను కూడా కలిగి ఉండనున్నాయి. ఇందులో మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే మన లాప్ టాప్ లను పబ్లిక్ వైఫై లో కనెక్ట్ చేసినపుడు మన సెక్యూరిటీ కి ఏమంత గ్యారంటీ ఉండదు. అదే ఈ కనెక్టెడ్ లాప్ టాప్ ల వలన పబ్లిక్ వైఫై తో పోలిస్తే మరింత మెరుగైన సెక్యూరిటీ ఉంటుంది. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా జియో యొక్క ఈ ఆల్వేస్ కనెక్టెడ్ లాప్ టాప్ లు ఖచ్చితంగా ఒక విద్వంసక ఆవిష్కరణ కానున్నాయని మాత్రం చెప్పవచ్చు.

ముఖ్య గమనిక : మారుతున్న టెక్ పరిణామాలను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తూ ఎప్పటికప్పుడు వాటిని పాఠకులకు చేరవేసే మన కంప్యూటర్ విజ్ఞానం ఈ జియో లాప్ టాప్ ల గురించి ఒక సంవత్సరం క్రితమే మన పాఠకులకు సవివర విశేషాలు అందించడం జరిగింది.ఆ వివరాలను కూడా ఈ http://computervignanam.net/article/Mobiles--Tablets/reliance-jio-4g-laptop/1073.cv  ద్వారా మా పాఠకులు మరొక్కసారి చూడగలరు.

జన రంజకమైన వార్తలు