• తాజా వార్తలు

ఈ వారం టెక్ రౌండ‌ప్‌

4జీ డౌన్‌లోడ్‌లో ఎయిర్‌టెల్ టాప్ ప్లేస్‌లో నిలిచింది. డేటా ప్రైవ‌సీ మీద శ్రీ కృష్ణ కమిటీ రిపోర్ట్ ఏం చెప్పింద‌నే అంశంలో ఉత్కంఠ కొన‌సాగుతోంది. గూగుల్‌కు ఈయూ కాంపిటీష‌న్ క‌మిష‌న్ ఏకంగా 35వేల కోట్ల రూపాయ‌ల జ‌రిమానా విధించింది. ఇలాంటి టెక్నాల‌జీ విశేషాల‌న్నింటితో ఈ వారం టెక్ రౌండ‌ప్ మీ కోసం..  

4జీ డౌన్‌లోడ్‌లో ఎయిర్‌టెల్ టాప్‌
4జీ నెట్‌వ‌ర్క్ డౌన్‌లోడ్ స్పీడ్‌లో ఎయిర్‌టెల్ టాప్ ప్లేస్‌లో ఉంద‌ని ఓపెన్ సిగ్న‌ల్ రిపోర్ట్ ప్ర‌క‌టించింది. ఇండియాలో ప్ర‌తి రాష్ట్రంలో 4జీ అందుబాటులో ఉన్న నెట్‌వ‌ర్క్‌లో మాత్రం జియోదే పైచేయి. మిగిలిన టెల్కోలేవీ వీటి ద‌రిదాపుల్లోకి రాలేదు. 

సాక్రెడ్ గేమ్స్ కేసు పిల్ ఎలా అవుతుంది?
సాక్రెడ్ గేమ్స్‌పై న్యాయ‌వాది నిఖిల్ బ‌ల్లా వేసిన కేస్ ప్ర‌జా ప్ర‌యోన వ్యాజ్యం కింద‌కి వ‌స్తుందా లేదా అని ఢిల్లీ హైకోర్టు పిటిష‌న‌ర్‌ను  ప్ర‌శ్నించింది. నెట్‌ఫ్లిక్స్‌లో వ‌స్తున్న సాక్రెడ్ గేమ్స్‌లో మాజీ ప్ర‌ధాని రాజీవ్‌గాంధీని అవ‌మానించేలా ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన నిఖిల్ బల్లా అనే న్యాయ‌వాది ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యం (పిల్‌) వేశారు.  ఇది ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యంగా ఎలా స‌మ‌ర్థించుకుంటారో చెప్పాల‌ని అడిగింది. 

టెక్నాల‌జీ ప్రైవ‌సీపై రిపోర్ట్ ఎలా ఉంటుంది?
టెక్నాల‌జీ ప్రైవ‌సీ మీద  శ్రీ కృష్ణ క‌మిటీ రిపోర్ట్ ఎలా ఉండ‌బోతుంద‌నేది ఇప్పుడు టెక్నాల‌జీ స‌ర్కిల్స్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ క‌మిటీ ఇచ్చే రిపోర్ట్ ప్ర‌కారం చ‌ట్టం చేస్తారా?  లేక సిఫార్సుల‌కే ప‌రిమిత‌మ‌వుతారా అనేది తేలాల్సి ఉంది. ఫైనాన్షియ‌ల్ ట్రాన్సాక్ష‌న్ డేటా లోక‌లైజేష‌న్ ఎంత వ‌ర‌కు సాధ్య‌మవుతుంద‌న్నదానిపై క‌మిటీ సందిగ్ధం వ్య‌క్తం చేస్తోంది. 

శ్రీ కృష్ణ క‌మిటీ రిపోర్ట్ బ‌య‌ట‌పెట్ట‌లేమ‌న్న ఐటీ శాఖ‌
డేటా ప్రొటెక్ష‌న్‌పై శ్రీ కృష్ణ క‌మిటీ ఇచ్చిన రిపోర్ట్‌ను బ‌య‌ట‌పెట్ట‌డానికి ఐటీ శాఖ నిరాక‌రించింది. ఈ క‌మిటీ రిపోర్ట్ ఇవ్వాల‌ని మీడియానామా అనే వెబ్‌సైట్ స‌మాచార హ‌క్కు చ‌ట్టం కింద అప్ల‌యి చేయ‌గా ఆ వివ‌రాలు బ‌య‌ట‌పెట్ట‌లేమని ఐటీ శాఖ స్ప‌ష్టంగా చెప్పేసింది. ఈ వివ‌రాలు ర‌హ‌స్య‌మైన‌వ‌ని, బ‌హిరంగంగా ప్ర‌జ‌ల‌కు తెలియ‌ప‌ర‌చ‌డానికి వీలుప‌డ‌ద‌ని స‌మాధానం చెప్పింది.

గూగుల్‌కు 35వేల కోట్ల జ‌రిమానా 
టెక్నాల‌జీ దిగ్గ‌జం గూగుల్‌కు ఏకంగా 35వేల కోట్ల రూపాయ‌ల జ‌రిమానా విధిస్తూ యూరోపియ‌న్ యూనియ‌న్‌కు చెందిన కాంపిటిషన్‌ కమిషన్ తీర్పు చెప్ప‌డం  ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది.  తన ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (ఓఎస్‌) కున్న మార్కెట్‌ వాటాను ఉపయోగించుకుని పోటీ చట్టాలకు వ్యతిరేకంగా గూగుల్‌ లబ్ధి పొందింద‌న్న ఆరోప‌ణ‌ల మీద ఈయూ విచార‌ణ జ‌రిపి ఈ జ‌రిమానా విధించింది.  గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌, సెర్చ్‌ ఇంజిన్‌లను ప్రీ-ఇన్‌స్టాల్ చేస్తే కొన్ని గూగుల్ యాప్స్‌ను ఉచితంగా ఇస్తామ‌ని చెప్పి శాంసంగ్‌, హువావే వంటి ప్రధాన మొబైల్‌ తయారీ కంపెనీలన్నిటినీ గూగుల్‌ ఒప్పించింది. అలాగే  గూగుల్‌ సెర్చ్‌ను డిఫాల్ట్‌గానూ పెట్టేలా చూసుకుంది. ఇలా ఐరోపాలోని వివిధ దేశాల్లో విక్ర‌యించే ఆండ్రాయిడ్ ఫోన్ల‌న్నింటిలోనూ దాదాపుగా ఇలాగే చేసింద‌ని ఈయూ ఆరోపించింది. అంతేకాదు ఇత‌ర ఓఎస్‌లు వేటినీ స్మార్ట్‌ఫోన్లు వాడ‌కుండా ఫోన్ త‌యారీ కంపెనీల‌కు ఆర్థిక ప్రోత్సాహ‌కాల పేరిట లంచాలిస్తుందని కూడా ఆరోప‌ణ‌లున్నాయి. 

భారీగా ప‌డిపోయిన హెచ్‌టీ మీడియా ఆదాయం
హెచ్‌టీ మీడియా నిక‌రాదాయం జూన్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో భారీగా ప‌డిపోయింది. ఈ మూడు నెల‌ల కాలానికి 5.7 కోట్ల రూపాయ‌ల ఆదాయం వ‌చ్చింద‌ని హెచ్‌టీ మీడియా ప్ర‌క‌టించింది. గ‌తేడాది ఇదే స‌మయంలో 41.5 కోట్ల రూపాయ‌ల ఆదాయం వ‌చ్చింది. అంటే ఇప్పుడు ఏకంగా 86 శాతం ఆదాయం కోల్పోయింది.

పిఫా ప్ర‌పంచ‌క‌ప్‌ను 7 కోట్ల మంది లైవ్‌లో చూశారు
ఇండియా ఫుట్‌బాల్ ప్ర‌పంచ‌క‌ప్‌కు అర్హ‌త సాధించ‌క‌పోయినా ఇండియాలో మాత్రం దాన్ని వీక్ష‌కులు భారీగా చూశారు. సోనీ లైవ్‌లో వ‌ర‌ల్డ్‌క‌ప్ లైవ్‌ను ఏకంగా 7 కోట్ల మంది చూశార‌ని, ఇండియా బ‌య‌ట జ‌రిగిన టోర్నీలను ఇండియాలో ఇంత ఎక్కువ మంది చూడ‌డం ఇదే రికార్డ‌ని ఎక‌నామిక్ టైమ్స్ చెప్పింది.

15% వాటాను అమ్మ‌డానికి ఎయిర్‌టెల్ రెడీ
ఇండియాలో నెంబ‌ర్‌వ‌న్ మొబైల్  కంపెనీ భార‌తీ ఎయిర్‌టెల్ త‌న నెట్‌వ‌ర్క్‌లో 15% వాటాను అమ్మ‌డానికి సిద్ధ‌మైంది. యూఎస్ ప్రైవేట్ కంపెనీ వార్‌బ‌ర్గ్ పిన్స‌స్‌తో ఈ విష‌యం మీద సంప్ర‌దింపులు జ‌రుపుతుంది. 1.5 బిలియ‌న్ డాల‌ర్లు (10,311 కోట్ల రూపాయ‌ల‌కు) ఈ 15% వాటా అమ్మ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్లు ఎక‌నామిక్ టైమ్స్ రిపోర్ట్ చెప్పింది.

వాట్సాప్ మెసేజ్ ఫార్వార్డింగ్‌పై నిబంధ‌న‌లు
వదంతులు, తప్పుడు వార్తలు, హింసను ప్రోత్సహించే సమాచార వ్యాప్తికి వాట్సాప్‌ వేదికవుతోందంటూ ఆరోపణలు, ఆందోళనలు వెల్లువెత్తుతుండ‌డంతో వాట్సాప్ టీమ్ స్పందించింది. త్వ‌ర‌లో ఇండియాలో జ‌ర‌గ‌బోయే సాధారణ ఎన్నికల నాటికి గంపగుత్తగా పంపే సందేశాలపై నిఘా ఉంచుతామని చెప్పింది. ‘వెరిఫికాడో’ రకం వాట్సాప్‌ మోడల్‌ను భారత్‌లోనూ అందుబాటులోకి తెస్తామ‌ని హామీ ఇచ్చింది.  వదంతుల నియంత్రణలో భాగంగా- శుక్రవారం నుంచి మెసేజ్‌లు ఫార్వ‌ర్డ్ చేయ‌డానికి ప‌రిమితి విధించింది. ఇక‌పై ఒక మెసేజ్‌ను ఒక‌సారి  ఐదు నెంబ‌ర్ల‌కు మాత్ర‌మే ఫార్వ‌ర్డ్ చేయ‌గ‌ల‌ద‌రు. ఒక మెసేజ్‌ను ఒకేసారి ఎక్కువమందికి పంపించేందుకు వీలు కల్పించే ‘క్విక్‌ ఫార్వర్డ్‌’ బ‌ట‌న్‌ను కూడా తొల‌గిస్తున్న‌ట్లు వాట్సాప్‌ ప్రకటించింది. 
 

జన రంజకమైన వార్తలు