• తాజా వార్తలు

ఈ  వారం టెక్ రౌండ‌ప్‌

టెక్నాల‌జీ రంగంలో వారం వారం జ‌రిగే సంఘ‌ట‌న‌ల స‌మాహారం ఈ వారం టెక్ రౌండ‌ప్‌.. ఈ వారం రౌండ‌ప్‌లో ఇండియాలో టెక్నాల‌జీ ఆధారంగా జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌ల వివ‌రాలు సంక్షిప్తంగా మీకోసం..

రాజ‌స్తాన్, యూపీల్లో ఇంట‌ర్నెట్ ష‌ట్‌డౌన్‌
అయోధ్య తీర్పును పుర‌స్క‌రించుకుని ఎలాంటి అల్ల‌ర్లు చోటు చేసుకోకుండా ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా రాజ‌స్తాన్‌, యూపీల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇంట‌ర్నెట్ స‌ర్వీసుల‌ను ష‌ట్‌డౌన్ చేశారు. ఆయా ప్రాంతాల్లోని అధికారుల ఆదేశాల‌ను అనుస‌రించి యూపీలోని ఆగ్రా, మీర‌ట్‌తోపాటు రాజ‌స్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇంట‌ర్నెట్ ష‌ట్‌డౌన్ చేశారు. అయితే బ్యాంకింగ్ వంటి సెక్టార్ల‌కు సంబంధించిన లావాదేవీల‌కు మాత్రం నెట్‌ను అందుబాటులో ఉంచారు. 

పెగాస‌స్ మాల్వేర్‌పై విచార‌ణ‌కు ఛ‌త్తీస్‌గ‌డ్ క‌మిటీ
ఛ‌త్తీస్‌గ‌డ్ పోలీసుల  సాఫ్ట్‌వేర్‌లో పెగాస‌స్  మాల్వేర్ చొప్పించ‌బ‌డింద‌న్న విషయంపై విచారణ జరిపేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది. ఇజ్రాయిల్ స్పైవేర్ గ్రూప్ ఎంఎస్‌వో ఈ వైరస్‌ను రెండు మూడు సంవత్సరాల కిందట ప్రవేశపెట్టినట్లు ఆ రాష్ట్ర పోలీసులు అనుమానిస్తున్నారు. 

లక్షల మంది అమెరికన్ల హెల్త్ డేటా గూగుల్ చేతిలో 
గూగుల్ ఆపరేషన్ నైటింగేల్ పేరుతో లక్షల మంది అమెరికన్ల హెల్త్ డేటాను రహస్యంగా సేకరించింది. కేథలిక్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ నడుపుతున్న ఎస్ఎన్ష‌న్ చైన్ హాస్పిటల్స్ నుంచి ఈ డేటాను పట్టేసింది. ఈ డేటాలో పేషెంట్ పేరు, ఊరు, డ‌యాగ్న‌స్టిక్ టెస్ట్‌ల ఫ‌లితాలు, డాక్ట‌ర్ ప్రిస్క్రిప్ష‌న్‌, బిల్ వంటి వివ‌రాల‌న్నీ ఉన్నాయి. ఈ విష‌యాన్ని వాల్‌స్ట్రీట్ జర్న‌ల్‌, న్యూయార్క్ టైమ్స్ ప‌త్రిక‌లు బ‌య‌ట‌పెట్టాయి. 

వాట్సాప్ మాల్వేర్‌పై సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ న‌జ‌ర్‌
ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీపై నియమించిన పార్ల‌మెంట‌రీ స్టాండింగ్ క‌మిటీ వాట్సాప్ ద్వారా వ‌స్తుందంటున్న పెగాస‌స్ మాల్వేర్ అంశంపై దృష్టి పెట్టింది. న‌వంబ‌ర్ 20న జ‌రిగే క‌మిటీ మీటింగ్‌లో దీనిపై చ‌ర్చించ‌డానికి ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ మంత్రిత్వ శాఖ ప్ర‌తినిధుల‌ను ఆహ్వానించారు. అలాగే కూడంకుళం న్యూక్లియ‌ర్ ప‌వ‌ర్ రియాక్ట‌ర్‌కు సంబంధించిన స‌మాచారం హ్యాక్ అయింద‌న్న అనుమానాల నేప‌థ్యంలో అటామిక్ ఎన‌ర్జీ మినిస్ట్రీ ప్ర‌తినిధుల‌ను కూడా ఈ మీటింగ్‌కు పిలిచి చ‌ర్చించ‌బోతున్నారు.  

ఈకామ‌ర్స్ వినియోగ‌దారుల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ‌కు కొత్త రూల్స్ 
ఈకామ‌ర్స్‌లో వినియోగ‌దారుల హ‌క్కుల ప‌రిర‌క్షించేందుకు కొత్త రూల్ పాల‌సీకి సంబంధించి ప్ర‌భుత్వం ఈ నెల 11న ఓ ముసాయిదా విడుద‌ల చేసింది. ప్రొడ‌క్ట్‌లు,స‌ర్వీసుల‌కు సంబంధించిన అంశాల‌పై ఫేక్ రివ్యూల‌ను అరిక‌ట్ట‌డం,  వినియోగ‌దారుల హ‌క్క‌లను కాపాడ‌టం, అమ్మేవారు మోసాల‌కు పాల్ప‌డ‌కుండా ఏం చ‌ర్య‌లు తీసుకోవాలో దీనిలో పొందుప‌రిచారు. వీటిపై ఏమైనా అభ్యంత‌రాలుంటే ఈ కామ‌ర్స్ కంపెనీలు   డిసెంబ‌ర్ 2లోగా చెప్పుకోవ‌చ్చు. 

ఆర్‌కామ్ ఆస్తులు కొన‌డానికి 6 కంపెనీల ఆస‌క్తి 
పీక‌ల్లోతు న‌ష్టాల్లో మునిగిపోయిన రిల‌య‌న్స్ క‌మ్యూనికేష‌న్స్ లిమిటెడ్‌, దాని అనుబంధ సంస్థ‌ల ఆస్తుల‌ను వేలంలో కొనేందుకు 6 కంపెనీలు బిడ్లు వేశాయి. వీటిలో భార‌తీ ఎయిర్‌టెల్‌, భార‌తీ ఇన్ఫ్రాటెల్ కూడా ఉన్నాయి. అయితే జియో ఈ వేలంలో బిడ్ వేసేందుకు  మ‌రింత స‌మ‌యం కావాల‌ని కోర‌డంతో న‌వంబ‌ర్ 25 వ‌ర‌కు గడువు పొడిగించిన‌ట్లు బిజినెస్ స్టాండ‌ర్డ్ పత్రిక క‌థ‌నం ప్ర‌చురించింది. 

 ఎయిర్‌టెల్ న‌ష్టం 23,045 కోట్లు 
ఆర్థిక సంవత్స‌రం స‌గం గ‌డిచేస‌రికి (సెప్టెంబ‌ర్ నెలాఖ‌రుకు) ఎయిర్‌టెల్ ఏకంగా 23,045 కోట్ల రూపాయ‌ల న‌ష్టాన్ని మూట‌గట్టుకుంది.  అడ్జ‌స్టెడ్ గ్రాస్ రెవ‌న్యూ (ఏజీఆర్‌) బ‌కాయిలు చెల్లించాల‌న్న సుప్రీం కోర్టు తీర్పుతో ఆర్థికంగా తాము మ‌రింత ఇబ్బందుల్లో ప‌డ్డామ‌ని ఎయిర్‌టెల్ ప్ర‌క‌టించింది. 

పర్స‌న‌ల్ డేటా ప్రొటెక్ష‌న్ బిల్లు పార్ల‌మెంట్‌కు
ప‌ర్స‌న‌ల్ డేటా ప్రొటెక్ష‌న్‌కు సంబంధించిన‌ బిల్లు పార్ల‌మెంటు ముందుకు రాబోతుంది. న‌వంబ‌ర్ 18న ప్రారంభం కాబోయే పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాల్లో ఈ బిల్లును స‌భ‌లో ప్ర‌వేశ‌పెడ‌తారు.  


 

జన రంజకమైన వార్తలు