ఒకప్పుడు సెల్ ఫోన్ ఛార్జర్లు బోల్డన్ని రకాలు,సన్న పిన్నువి, లావు పిన్నువి, అడ్డంగా ఉండేవి ఇలా రకరకాలు. ఫీచర్ ఫోన్లు కాబట్టి ఒకసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే సాధారణ యూజర్‌కు రెండు, మూడు రోజులు ఈజీగా వచ్చేది. కాబట్టి ఛార్జింగ్ ఇంటి దగ్గర పెట్టుకుంటే మళ్లీ ఇంటికెళ్లాక పెట్టుకోగలిగేవారు. తర్వాత స్మార్ట్ఫోన్లు రావడంతో బ్యాటరీ ఐదారు గంటల కంటే ఎక్కువ వచ్చేది కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఛార్జరయినా వాడుకునేందుకు వీలుగా దాదాపు అన్ని ఫోన్లకు ఒకేలాంటి ఛార్జింగ్ పోర్ట్‌లు ఇవ్వడం ప్రారంభించాయి కంపెనీలు. దీంతో ఛార్జర్ కూడా యూనివర్సల్ అయిపోయింది. ఆ తర్వాత దశ ఇప్పుడు వైర్లెస్ ఛార్జింగ్. యాపిల్, శాంసంగ్ లాంటి పెద్ద కంపెనీలు ఇప్పటికే ఈ వైర్లెస్ ఛార్జింగ్‌ను తీసుకొచ్చాయి. దీనిలో ఛార్జర్‌ను ఫోన్లో ఉన్న ఛార్జింగ్ పోర్ట్‌కు కనెక్ట్ చేయక్కర్లేదు. జస్ట్ ఛార్జింగ్ డాక్ మీద పెడితే చాలు ఫోన్ ఛార్జ్ అయిపోతుంది. ఈ వైర్లెస్ ఛార్జర్లలో ఉన్న మంచీ చెడూ ఏమిటో చూద్దాం.
వైర్లెస్ ఛార్జర్ ఎలా పనిచేస్తుంది?
ఇది మాగ్నటిక్ ఇండక్షన్ మీద పని చేస్తుంది. ఎలక్ట్రికల్ కరెంట్‌ను ఉపయోగించుకుని ఒక మ్యాగ్నటిక్ ఫీల్డ్ (అయస్కాంత క్షేత్రాన్ని) జనరేట్ చేస్తుంది. దీంతో వోల్టేజ్ క్రియేట్ అవుతుంది. ఈ వోల్టేజ్ ద్వారా ఫోన్లో ఉన్న ఛార్జింగ్ పోర్ట్‌కు వైర్ కనెక్ట్ చేయకుండానే ఫోన్ ఛార్జ్ అవుతుంది. ఇప్పుడు వస్తున్న హైఎండ్ ఫోన్లలో చాలాభాగం గ్లాస్ మెటీరియల్ ఉండటంతో వైర్లెస్ ఛార్జింగ్ బాగా వర్కవుట్ అవుతుంది.
చాలామందికి నచ్చిన ఫీచర్
గత సంవత్సరం చేసిన ఒక సర్వేలో మొబైల్ పరంగా మీకు బాగా నచ్చిన ఫీచర్ ఏమిటని సర్వే చేస్తే ఎక్కువ మంది వైర్‌లైస్ ఛార్జింగ్ అని చెప్పారు. అయితే ఇది యాపిల్, శాంసంగ్ లాంటి పెద్ద కంపెనీలు అదీ హైఎండ్ ఫోన్లకు మాత్రమే వాడుతుండడంతో కేవలం 29 % మంది మాత్రమే ఈ వైర్ లెస్ ఛార్జర్‌ను వాడామని చెప్పారు.
ప్లస్ పాయింట్స్
* బెడ్రూమ్లో లేదా హాల్లో ఫోన్ ఛార్జింగ్ పెడితే కాల్, మెసేజ్ వచ్చిన ప్రతిసారి వైర్ నుంచి తీసి మాట్లాడక్కర్లేదు. జస్ట్ టేబుల్ మీద నుంచి ఫోన్ తీసినట్లు ఛార్జింగ్ డాక్ మీద నుంచి తీసి మాట్లాడుకోవచ్చు. ఫోన్ వాడేశాక మళ్లీ అలాగే ఛార్జింగ్ డాక్ మీద పెట్టేయవచ్చు.
* వైర్ ఛార్జింగ్ అయితే నిద్రలో ఉండగా కాల్ వస్తే కళ్లు నులుముకుని ఛార్జర్ నుంచి డిస్కనెక్ట్ చేసి అప్పుడు మాట్లాడాలి. ఈలోగా అందరికీ డిస్ట్రబెన్స్. వైర్లెస్ ఛార్జర్ అయితే వెంటనే లిఫ్ట్ చేయొచ్చు.
* ఛార్జింగ్ పెట్టిన ఫోన్ తీసుకురమ్మని పిల్లల్ని తీసుకురమ్మంటే భయం. ఛార్జర్ నుంచి ఫోన్ గట్టిగా లాగేస్తే ఛార్జర్ పిన్ను, ఫోన్లో ఉన్న పోర్ట్ రెండూ దెబ్బతింటాయి. వైర్లెస్ ఛార్జింగ్‌తో అలాంటి బాధే లేదు.
* బెడ్ రూమ్‌లో, ఇంట్లో ఎక్కడైనా హాయిగా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఛార్జింగ్ డాక్ హాల్లో లేదా లివింగ్ రూమ్‌లో పెడితే గెస్ట్‌లు లేదా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వాళ్లది కూడా వైర్లెస్ ఛార్జింగ్‌కి అవకాశం ఉన్న ఫోన్ అయితే ఈజీగా, కన్వినెంట్‌గా ఛార్జ్ చేసుకోవచ్చు.
* లేటెస్ట్గా వచ్చే కార్లలో వైర్లెస్ ఛార్జింగ్‌కు తగిన ఏర్పాట్లు ఉంటున్నాయి.
మైనస్ పాయింట్లు
* వైర్ ఛార్జింగ్‌తో కంపేర్ చేస్తే వైర్లెస్ ఛార్జింగ్ 15% తక్కువ స్పీడ్‌తో ఎక్కుతుంది. కాబట్టి ఆఫీస్‌లో దీని యూజ్ తక్కువే.
* ఛార్జింగ్ డాక్‌లు ఫ్లాట్‌గా ఉంటాయి కాబట్టి బస్సుల్లాంటి వాహనాల్లో వెళ్లేటప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవడం కష్టం.