షియోమీ ఇటీవల విభిన్న ధరల శ్రేణిలో మూడు రెడ్మి 6 ఫోన్లను విడుదల చేసింది. వీటిలో అద్భుతమైన ఫీచర్లు, పటిష్ఠమైన హార్డ్‌వేర్ ఉన్నాయన్నది నిస్సందేహంగా వాస్తవం. ఇక Redmi 6, Redmi 6A ధర రూ.6వేల లోపే ఉండటం అందర్నీ ఆకట్టుకునే అంశమే. కానీ, Redmi 6 Pro విషయంలో కొనుగోలుదారులు ఆకర్షితులు కావడం లేదు. ఇందులోనూ అత్యాధునిక ఫీచర్లున్నప్పటికీ హార్డ్‌వేర్ నాణ్యత దృష్ట్యా ఈ స్మార్ట్ ఫోన్లో ఆవిష్కరణాత్మకత లోపించిందని భావిస్తున్నారు. అందుకే షియోమీ అభిమానులు Redmi 6 Pro విషయంలో అసంతృప్తికి లోనవుతున్నారు.
షియోమీ కంపెనీకి క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 625 అంటే చాలా ఇష్టం. దీన్ని ఇప్పటిదాకా దాదాపు డజను ఫోన్లలో మళ్లీమళ్లీ వాడింది. కానీ, కాలక్రమాన మార్కెట్లో పోటీ ముమ్మరమైన దృష్ట్యా ఈసారి మాత్రం షియోమీకి ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. భారతదేశంలో తొలిసారి అగ్రశ్రేణి హార్డ్‌వేర్‌తో, అద్భుత ఫీచర్లతో, సరసమైన ధరలో స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెట్టడంద్వారా షియోమీ ఒక ప్రమాణాన్ని నెలకొల్పింది. ఈ రకంగా చూస్తే రూ.12,999 ధర శ్రేణిలోగల ఇతర స్మార్ట్ ఫోన్లతో పోల్చినపుడు 4జీబీ వెర్షన్గల Redmi 6 Pro అద్భుతమైనదనే చెప్పాల్సి ఉంటుంది.
ఈ ఫోన్‌ను షియోమీ మరింత మెరుగ్గా రూపొందించి ఉండవచ్చన్నది నిజమేగానీ... దీనికి కూడా క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 625నే వాడాలని నిర్ణయించుకుంది. ఇది అంతర్జాతీయ యూనిట్‌కు సంబంధించిన Mi A2 Lite వెర్షన్‌కు పునఃనామకరణం చేసిన చిప్సెట్. రెండేళ్ల నాటి క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 625 ఇతర స్మార్ట్ ఫోన్లతో పోలిస్తే ఇప్పటికే అత్యధికంగా వాడబడిన చిప్సెట్. ఇందులో కొన్ని అసాధారణ సామర్థ్యాలున్న మాట నిజమే అయినా, ఇతర సంస్థలు ఇదే ధరలో అందిస్తున్న స్మార్ట్ ఫోన్ల చిప్సెట్తో పోలిస్తే ఇది వయసు ముదిరినదిగా కనిపిస్తోంది. స్మార్ట్ ఫోన్లకు మరింత సామర్థ్యం, శక్తి ఉండాలని వినియోగదారులు ఆకాంక్షిస్తున్న ఈ 2018లో రూ.13వేల ధరతో స్నాప్‌డ్రాగన్ 625ను ఎంచుకునేందుకు వారు సిద్ధంగా లేరు.
రెడ్మి 6 ప్రో పోటీ: మెరుగైన ప్రత్యామ్నాయాలు
షియోమీకన్నా తక్కువ ధరలో ఆసుస్ కంపెనీ స్నాప్‌డ్రాగన్ 636 చిప్సెట్తో Zenfone Max Pro M1ను అందిస్తోంది. అలాగే మరికాస్త ఎక్కువ ధరలో ఖర్చుకు తగిన విలువగల అగ్రశ్రేణి ఫోన్లు కూడా లభిస్తున్నాయి. ఇక షియోమీకి సొంతమైన Mi A2 కూడా స్నాప్‌డ్రాగన్ 660 చిప్సెట్తో వస్తోంది. Honor Play ప్రతిష్ఠాత్మక కిరిన్ 970 చిప్సెట్తో రూ.20 వేలకన్నా తక్కువ ధరకే అందుబాటులో ఉంది. అంతెందుకు... Poco F1తో షియోమీ స్వయంగా తనదైన ప్రమాణాన్ని నెలకొల్పింది. ఈ కంపెనీ ఇంతకుముందు Redmi Note 4, Xiaomi Mi A1, Redmi Note 5, Redmi Y2లలో స్నాప్‌డ్రాగన్ 625ను వాడగా ఇప్పుడు Redmi 6 Proలోనూ ఉపయోగించింది. ఇలా చూస్తే ఇంకా ఎప్పటిదాకా దీనితోనే కాలం గడుపుతుందన్న సందేహం అభిమానులలో తలెత్తుతోంది. ఇప్పటికే Redmi Note 5, Redmi Y2 ఫోన్లు ఇదే ప్రాసెసర్, ధరలలో లభ్యమవుతున్న నేపథ్యంలో అదే మూలాలున్న, అంతకన్నా ఎక్కువ ధరగల Redmi 6 Proను జనం ఎందుకు ఎంచుకుంటారన్నది ఇక్కడ ప్రశ్న. మొత్తంమీద స్నాప్‌డ్రాగన్ 625 ఆల్‌రౌండ్ సామర్థ్యంగలదే అయినప్పటికీ 2018 చివరన ఇలాంటి స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయడం మాత్రం సరికాదన్న భావన వినిపిస్తోంది.