• తాజా వార్తలు

రివ్యూ - అత్యుత్తమ రేటింగ్స్ తో ఎంట్రీ ఇస్తున్న 'రియల్ మి 3 ప్రో' ఫోన్ : షియామికి ఝలక్!

గత ఫిబ్రవరిలో విడుదలైన 'రెడ్‌మి నోట్ 7 ప్రో' భారత మొబైల్ మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. బడ్జెట్ మొబైల్స్ సెగ్మెంట్‌లో ఆ ఫోన్ ను దాదాపుగా 'గేమ్ ఛేంజర్' అని చెప్పొచ్చు. 14 వేల రూపాయలకే స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసర్, 48 మెగాపిక్సెల్ సోనీ కెమేరా వంటి అద్భుతమైన స్పెసిఫికేషన్స్ ఇస్తున్న ఈ ఫోన్ ను మార్కెట్ నిపుణులు బెస్ట్ 'వేల్యూ ఫర్ మనీ' గ్యాడ్జెట్ గా అభివర్ణించారు. ఒక్క ఎన్ఎఫ్‌సి(నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్) తప్పితే మిడ్‌రేంజ్, ప్రీమియమ్ సెగ్మెంట్ ఫోన్లలో ఉండే ఫీచర్లు దాదాపుగా అన్నీ ఉన్నాయనే చెప్పాలి. ఇప్పటికే భారత్‌లో మొబైల్ ఫోన్ అమ్మకాలలో నంబర్ 1 స్థానానికి చేరుకున్న షియామి(రెడ్‌మి సంస్థకు మాతృసంస్థ)ని రెడ్‌మి నోట్ 7 ప్రో మరింత పైకి తీసుకెళుతుందని అందరూ భావించారు. అయితే షియామికి వణుకు పుట్టించే విధంగా, 'రెడ్‌మి నోట్ 7 ప్రో'ను తలదన్నే ఫోన్‌ను రియల్ మి సంస్థ మూడురోజుల క్రితం విడుదల చేసింది.
 
సోమవారం భారత మార్కెట్ లో విడుదలైన 'రియల్ మి 3 ప్రో' ఇన్‌స్టంట్‌గా సక్సెస్ అయిపోయింది. మొబైల్ ఫోన్ నిపుణులందరూ దాదాపుగా ముక్తకంఠంతో దానికి జేజేలు పలుకుతున్నారు. దానికి కారణం ఒక్కటే. ఇటీవల మార్కెట్‌ను కుదిపేస్తున్న రెడ్‌మి నోట్ 7 ప్రో కంటే మిన్నగా రియల్ మి 3 ప్రో లో ఉన్న స్పెసిఫికేషన్స్.రెడ్‌మిలో ఉన్న స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసర్‌కు దీటుగా నిలిచే స్నాప్ డ్రాగన్ 710 ప్రాసెసర్‌ను దీనిలో ఉపయోగించారు. వాస్తవానికి ఈ 710 ప్రాసెసర్‌ను బడ్జెట్ రేంజికి పైన ఉండే మిడ్ రేంజ్ ఫోన్లలో వాడతారు. ప్రస్తుతం నోకియా 8.1లో దీనిని వాడుతున్నారు. ఈ రెండింటిని పోల్చాలంటే, 675 సీపీయూ పరంగా మంచి పనితీరు చూపుతుంది... 710 జీపీయూ పరంగా మంచి పనితీరును కనబరుస్తుంది(సీపీయూ, జీపీయూలు మొబైల్ ఫోన్‌లలో కీలకమైన భాగాలు). ఇక కెమేరా చూసుకుంటే రెడ్‌మిలో 48 మెగాపిక్సెల్ కెమేరా ఉండగా, రియల్ మిలో 16+5 మెగా పిక్సెల్ కెమేరా ఇచ్చారు.అయినాకూడా రియల్ మి కెమేరా దాదాపుగా రెడ్‌మికి దీటుగా ఫలితాలను ఇచ్చింది. ఇక బాడీ చూస్తే, రెడ్‌మిలో ముందు, వెనక గొరిల్లా గ్లాస్ 5 ఇస్తే రియల్ మి లో ముందు గొరిల్లా గ్లాస్ 5 ఇచ్చి వెనకవైపు పాలీ కార్బనేట్ మెటీరియల్‌ను వాడారు. అయినాకూడా రియల్ మి వెనకభాగం(బాడీ) మెరుగ్గానే ఉంది. డిజైన్ కూడా ఆకర్షణీయంగా రూపొందించారు. బ్యాటరీ విషయానికొస్తేమాత్రం రెడ్ మి కంటే రియల్ మి చాలా ముందు ఉందని చెప్పాలి. రెడ్ మిలో ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఉన్నప్పటికీ, మామూలు ఛార్జర్ మాత్రమే ఇచ్చారు. ఫాస్ట్ ఛార్జర్ కావాలంటే మరో రు.2,000 పెట్టి కొనుక్కోవాలి. ఇటు రియల్ మిలో 'వూక్' అనే ఫాస్ట్ ఛార్జర్ ఉచితంగా ఇచ్చారు. ఈ ఛార్జర్ తో కేవలం 30 నిమిషాలలోనే 50 శాతం ఛార్జింగ్ అవుతుంది. మరోవైపు, రెడ్ మిలో 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా, రియల్ మిలో 4,045 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. మొత్తంమీద బ్యాటరీ పరంగా చూస్తే రియల్ మికి ఎక్కువ పాయింట్లు లభిస్తాయి. ఇక రియల్ మిలో ఫేస్ అన్ లాక్, ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా చాలా వేగంగా పనిచేయటం మరో విశేషం. ఇంకా, స్లో మోషన్ వీడియోల చిత్రీకరణ, నెట్ ఫ్లిక్స్ చూడటానికి వైడ్ వైన్ ఎల్1 సపోర్ట్ వంటి సౌకర్యాలుకూడా కల్పించారు. వీటన్నింటికీ మిన్నగా, హై ఎండ్ ఫోన్లలో మాత్రమే ఆడటానికి వీలయ్యే ఫోర్ట్‌నైట్ గేమ్ సౌకర్యం రియల్ మిలో ఉండటం మరో విశేషం. ఓఎస్ విషయానికొస్తే రెండింటిలోనూ 'ఆండ్రాయిడ్ 9 పై' ఉంది. రెడ్ మిలో 9పై ఆధారంగా రూపొందించిన ఎంఐ యూఐ ఉండగా, రియల్ మిలో 9పై ఆధారంగా రూపొందిన కలర్ ఓఎస్ ఉంటుంది. కలర్ ఓఎస్ పై ఇప్పటివరకు ఎన్నో విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే రియల్ మి 3 ప్రో లో మాత్రం ఆధునికీకరించిన కలర్ ఓఎస్ ను 6.0గా ఇచ్చారు. ఇది గతంలోకంటే ఎంతో మెరుగ్గా పనిచేయటం ఊరటనిచ్చే విషయంగా చెప్పుకోవాలి. అటు రెడ్ మి ఓఎస్ పై ఉన్న తీవ్ర విమర్శ చాలామందికి తెలిసిందే... చిరాకు పుట్టించే యాడ్స్. అలాంటి సమస్య లేకపోవటం రియల్ మికి ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు.అయితే రెడ్ మిలో ఉన్న యూఎస్‌బీ సీ పోర్ట్, ఐఆర్ బ్లాస్టర్ వంటి సౌకర్యాలు లేకపోవటం రియల్ మికి మైనస్ పాయింట్లుగా చెప్పుకోవాలి. పని తీరు, డిస్ ప్లే వంటి విషయాలలో మాత్రం రెండూ దాదాపుగా సమానంగానే ఉన్నాయని చెప్పాలి. ఇక రెడ్ మి ఫోన్లను కేవలం ఫ్లాష్ సేల్స్ లో మాత్రమే అమ్మటాన్ని కూడా దానికి ఒక మైనస్ పాయింట్ గా చెబుతున్నారు. రియల్ మి ఫోన్లను అలాకాకుండా డైరెక్ట్‌గా ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచుతున్నారు. రియల్ మి 3 ప్రో ఈ నెల 29 నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా ఆన్ లైన్ లో అందుబాటులోకి రానుంది.
 
ఏది ఏమైనా మొబైల్ ఫోన్ మార్కెట్‌లో శాంసంగ్ వంటి దిగ్గజాన్ని పక్కకు తోసి నంబర్ వన్ స్థానానికి ఎదిగిన షియామికి, ఒక సంవత్సరంకూడా నిండని రియల్ మి పెద్ద షాకే ఇచ్చిందని చెప్పుకోవాలి. కేవలం షియామిని దెబ్బతీయటంకోసమే ఆవిర్భవించిన రియల్ మి, తన లక్ష్యానికి చేరువవుతున్నట్లుగానే కనిపిస్తోంది. అవును, షియామిని దెబ్బకొట్టటమే లక్ష్యంగా 2018 మే నెలలో రియల్ మి ప్రారంభమైంది. వాస్తవానికి ఇది అల్లా టప్పా సంస్థ ఏమీ కాదు. చైనా మొబైల్ మార్కెట్ లో మరో దిగ్గజంలాంటి ఒప్పో ఎలక్ట్రానిక్స్ దీని మాతృసంస్థ. ఒప్పోతో పాటు వన్ ప్లస్, వివా అనే బ్రాండ్లుకూడా ఈ సంస్థకు చెందినవే. బడ్జెట్ ఫోన్ సెగ్మెంట్‌లో...  తక్కువ మార్జిన్ - చౌకధరలు - ప్రచారంపై ఖర్చు పెట్టకపోవటం(డిజిటల్ మార్కెటింగ్ విధానంలో సోషల్ మీడియా ద్వారానే ప్రచారం చేస్తుంది) అనే ఫార్ములా ద్వారా మార్కెట్ ను చేజిక్కించుకున్న షియామి సంస్థను అదే సూత్రంతో పడగొట్టాలనే లక్ష్యంతోనే ఒప్పో సంస్థ రియల్ మిని ప్రారంభించింది. ఈ పదకొండు నెలల కాలంలోనే బడ్జెట్ సెగ్మెంట్ లో వివిధ రేంజిలలో 8 ఫోన్లను విడుదలచేసి షియామికి గట్టి పోటీ ఇస్తోంది. మొత్తంమీద చూస్తే ఇలా మొబైల్ మార్కెట్‌‍లో బడ్జెట్ సెగ్మెంట్ ప్రస్తుతం బయ్యర్స్‌కు అనుకూలంగా ఉండటం ఒక మంచి పరిణామంగా చెప్పొచ్చు. ఇలా సెల్లర్స్ మధ్య పోటీ నెలకొనటం వలన అంతిమంగా లాభపడేది వినియోగదారుడే కదా!
శ్రవణ్ బాబు, సీనియర్ జర్నలిస్ట్, 99482 93346

జన రంజకమైన వార్తలు