టెక్నాలజీ ప్రపంచంలో విశేషాలను వారం వారం మీ ముందుకు తెస్తున్న కంప్యూటర్ విజ్ఞానం ఈ వారం విశేషాలతో మీ మందుకు వచ్చేసింది. ఎయిర్‌టెల్ నుంచి వాట్సాప్ దాకా, శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ నుంచి టెలికం శాఖ దాకా ఈ వారం చోటుచేసుకున్న ముఖ్యమైన ఘట్టాలు మీకోసం..
ఏజీఆర్ బకాయిలు తీర్చడానికి వొడాఫోన్ ఐడియా జనరస్ పేమెంట్ ఆప్షన్
సెప్టెంబర్ నెలాఖరుకు ముగిసిన రెండో త్రైమాసికానికి 50,897 కోట్ల రూపాయల నష్టాలున్నాయన్నప్రకటించిన వొడాఫోన్ ఐడియా ఆ మర్నాడే తమ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ (ఏజీఆర్) బకాయిలు తీర్చడానికి జనరస్ పేమెంట్ ఆప్షన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం ఇందుకు అంగీకరిస్తే ఇది తమకు చాలా సహాయకారి అవుతుందని సంస్థ ఎండీ అండ్ సీఈవో రవీందర్ టక్కర్ చెప్పారు.
ఏజీఆర్ బకాయిలు తీర్చడానికి 21వేల కోట్ల రూపాయలు సమీకరిస్తామంటున్న ఎయిర్‌టెల్
మరోవైపు తమ ఏజీఆర్ బకాయిలు తీర్చడానికి 21వేల కోట్లరూపాయలు సమీకరించాలని ఎయిర్‌టెల్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం నగదు రాక తగ్గినందున త్వరలోనే ఈ బాకీ తీర్చడం తమకు కష్టమవుతుందని ఎయిర్‌టెల్ పేర్కొంది. అందుకోసమే 21వేల కోట్ల రూపాయలను వివిధ మార్గాల ద్వారా సమీకరించుకుంటామని ఎయిర్‌టెల్ చెప్పినట్లు బిజినెస్ స్టాండర్డ్ ప్రకటించింది.
అంతా బాగుంటే జమ్మూకాశ్మీర్‌లో ఇంటర్నెట్ పునరుద్ధరణ
జమ్మూకాశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించినప్పటి నుంచి దాదాపు 100 రోజులుగా అక్కడ ఇంటర్నెట్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. జాతీయ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని సెంట్రల్ చెబుతోంది. తాజాగా హోం మంత్రి అమిత్‌షా మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్‌లో స్థానిక యంత్రాంగం పరిస్థితులన్నీ చక్కబడినట్లే అని చెబితే అక్కడ ఇంటర్నెట్ సర్వీసులను పునరుద్ధరించే అవకాశాల్ని పరిశీలిస్తామని ప్రకటించారు.
ఛాయోస్ అవుట్‌లెట్లలో ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం ఏర్పాటుపై సందేహాలు
ఇండియాలో పాపులర్ టీ స్టోర్ చైన్ అయిన ఛాయోస్ తన అవుట్‌లెట్లలో పేమెంట్స్‌కోసం ఓటీపీ బదులు ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్‌ను కొత్తగా ప్రవేశపెట్టింది. అయితే ఆ ఇంటర్‌ఫేస్‌లో ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ లేకపోవడం, ఆ ఆప్షన్‌ను కావాలంటే తొలగించుకునే ఆప్షన్ లేకపోవడం.. కస్టమర్ల డేటా పక్కదోవ పట్టేందుకు అవకాశాలు ఇస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి.
టెలికం రంగంలో ఆర్థిక అవస్థలు తొలగించడానికి ముందుకొచ్చిన కేంద్రం
ఓ వైపు నష్టాలు, మరోవైపు ఏజీఆర్ బకాయిలు చెల్లించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న టెలికం రంగాన్ని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇందుకోసం ఉద్దేశించిన ప్రతిపాదనలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని ప్రకారం టెలికం కంపెనీలు రాబోయే రెండేళ్ల స్పెక్ట్రం ఛార్జీలను ఒకటి లేదా రెండు వాయిదాల్లో చెల్లించడానికి అంగీకరించింది.
కొత్తగా 95 లక్షల డెబిట్ కార్డులు, 8 లక్షల క్రెడిట్ కార్డులు
డిజిటల్ ట్రాన్సాక్షన్‌ను ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా బ్యాంకులు చర్యలను వేగవంతం చేశాయి. దీనిలో భాగంగా సెప్టెంబర్ నెలలో కొత్తగా దాదాపు 95 లక్షల డెబిట్ కార్డులను, 8లక్షల 20 వేల క్రెడిట్ కార్డులను ఇష్యూ చేశాయి. దీంతో దేశంలో డెబిట్ కార్డుల సంఖ్య 84 కోట్ల 35 లక్షలకు చేరింది. అదేవిధంగా క్రెడిట్ కార్డుల సంఖ్య 5 కోట్ల 26 లక్షలు దాటింది.
ఎంపీ4 ఫైల్ ద్వారా వాట్సాప్‌లో మాల్వేర్
పెగాసస్ మాల్వేర్‌తో ఇప్పటికే తలపట్టుకుంటున్న వాట్సాప్ యాజమాన్యానికి మరో చిక్కొచ్చి పడింది. ప్రత్యేకంగా తయారుచేసిన ఎంపీ4 ఫైల్ ద్వారా కూడా వాట్సాప్‌లో మాల్వేర్ వ్యాప్తి చెందే ప్రమాదముందని వాట్సాప్ మాతృసంస్థ ఫేస్‌బుక్ ప్రకటించింది. యూజర్లు తెలియని సోర్స్‌ల నుంచి వచ్చే ఎంపీ4 ఫైల్స్‌ను ఓపెన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని యూజర్లకు సూచించింది.
121 మంది భారతీయలను టార్గెట్ చేసిన పెగాసస్ మాల్వేర్
వాట్సాప్‌లో మాల్వేర్‌ను పంపే పెగాసస్ వైరస్ ఇప్పటివరకు ఇండియాలో121 మంది యూజర్లను టార్గెట్ చేసిందని వాట్సాప్ ప్రకటించింది. ఈ విషయాన్ని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని పార్లమెంట్‌లో ప్రకటించింది. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు మినిస్ట్రీ ఈమేరకు సమాధానం ఇచ్చింది.
2020 డిసెంబర్ నుంచి ఆపరేషన్స్ ప్రారంభించనున్న నాట్‌గ్రిడ్
ఇంటిలిజెన్స్ ప్రోగ్రాం నాట్‌గ్రిడ్ 2020 డిసెంబర్ 31 నుంచి కార్యకలాపాలు ప్రారంభించబోతోంది. కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి పార్లమెంట్‌లో ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ విషయం చెప్పారు. మార్చి నెలాఖరుకల్లా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెట్ చేసుకుని డిసెంబర్ నెలాఖరు నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తామన్నారు.
మూడేళ్లలో సోషల్ మీడియాలో 8 వేల యూఆర్ఎల్స్ బ్లాక్ చేసిన ప్రభుత్వం
2016 నుంచి 2019 వరకు సోషల్ మీడియాలోని 8,250 యూఆర్ఎల్స్‌ను బ్లాక్ చేసినట్లు సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది. 2016లో 633 బ్లాక్ చేస్తే 2017లో 1385, 2018లో 2,799.. ఈ ఏడాది ఇప్పటివరకు 3,433 యూఆర్ఎల్స్‌ను నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో బ్లాక్ చేశామని ఐటీ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ లోక్‌సభలో ప్రకటించారు.