టెక్నాలజీ ప్రపంచంలో వారం వారం జరిగే విశేషాలను సంక్షిప్తంగా ఈ వారం టెక్ రౌండప్ పేరుతో మీకు అందిస్తోన్న కంప్యూటర్ విజ్ఞానం ఈ వారం విశేషాలను మీ ముందుకు తెచ్చింది. ఆ విశేషాలేంటో చూడండి.
సుప్రీం ట్రాన్స్ కాన్సెప్ట్స్‌ను కొనుగోలు చేసిన జిప్‌గో
షటిల్, రైడ్ షేరింగ్ సర్వీస్‌లు అందించే జిప్‌గో (ZipGo) పుణెలో ఉన్న షటిల్ బస్ ఆపరేటర్ సుప్రీం ట్రాన్స్ కాన్సెప్ట్స్ (STC)ను పూర్తిగా కొనేసింది. ఈ కొనుగోలుతో జిప్‌గో ముంబయి - పుణెల మధ్య షటిల్ సర్వీసులు, ఎలక్ట్రికల్ బస్సులు నడపబోతోంది. సుప్రీం ట్రాన్స్ కాన్సెప్ట్స్ వ్యవస్థాపకుడైన ప్రశాంత్ మోహితె STC సీఈవో కొనసాగుతారు. అంతేకాదు జిప్‌గో వైస్ ప్రెసిడెంట్‌గానూ వ్యవహరిస్తారు.
హెచ్‌టీ మీడియా లాభంలో 37 కోట్లు తగ్గుదల
హెచ్‌టీ మీడియా ఆదాయంలో సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో భారీగా పడిపోయింది. గత సంవత్సరం ఇదే సమయానికి హెచ్‌టీ మీడియా 78 కోట్లు ఆదాయం సంపాదించగా ఈసారి 12 కోట్లకు పరిమితమైంది.
ఈరోస్ నౌకు కోటి మంది సబ్‌స్క్రైబర్లు
ఈరోస్ ఇంటర్నేషనల్ కంపెనీకి చెందిన ఈరోస్ నౌ (Eros Now) ఓ ల్యాండ్ మార్క్ దాటింది. దీని సబ్‌స్క్రైబర్ల సంఖ్య 10 మిలియన్లు (కోటికి) చేరింది. అలాగే రిజిస్టర్డ్ యూజర్ల సంఖ్య 11 కోట్లు దాటింది. ఇండియాతోపాటు 135 దేశాల్లో ఈరోస్ నౌ అందుబాటులో ఉంది.
జస్ట్ డయల్లో మొబైల్ వెబ్, యాప్‌తో భారీగా ట్రాఫిక్
ఆన్‌లైన్ క్లాసిఫైడ్స్ అండ్ బుకింగ్ కంపెనీ జస్ట్ డయల్ సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి 48.4 కోట్ల రూపాయల నికర లాభం సంపాదించింది. గతేడాది ఇదే సమయంలో వచ్చిన లాభంతో పోల్చితే ఇది 29% ఎక్కువ. .జస్ట్ డయల్ యూనిక్ విజిటర్ల సంఖ్య ఈ త్రైమాసికంలో 13 కోట్లు దాటింది. అయితే ఇందులో 10 కోట్ల మందికిపైగా జస్ట్ డయల్‌ను మొబైల్ వెబ్, యాప్ ద్వారానే యాక్సెస్ చేశారు. డెస్క్‌టాప్, వాయిస్ కాల్స్ ద్వారా సైట్‌కి వచ్చే ట్రాఫిక్ తగ్గింది.
ఇండియాలో 857 పోర్న్ సైట్లు బంద్
టెలికం డిపార్ట్‌మెంట్ ఇండియాలో పోర్న్ సైట్లు బంద్ చేయడంపై సీరియస్‌గా దృష్టి పెట్టింది. 2015లో ఈ సైట్లను బ్యాన్ చేసినా ఇంకాఅందరికీ అందుబాటులో ఉన్నాయని, ఈ సైట్ల వల్ల చిన్నపిల్లలపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయని, పిల్లలకు కూడా బూతు సినిమాలు అందుబాటులో ఉంటున్నాయని ఉత్తరాఖండ్ హైకోర్టు ఆగ్రహం ప్రకటించింది. వెంటనే 857 పోర్న్ సైట్లు బ్యాన్ చేయాలని ఆదేశించింది. దీంతో టెలికం శాఖ వెంటనే నిషేధం విధించింది.
టాటా టెలిసర్వీసెస్‌కు తగ్గిన నష్టాలు
పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన టాటా టెలిసర్వీసెస్‌కు కాస్త రిలీఫ్. గతేడాది సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంతో పోల్చితే ఈ ఏడాది అదే సమయానికి నష్టాలు 15% తగ్గాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో 454 కోట్ల రూపాయలు నష్టం రాగా ఈసారి అది 383 కోట్లకు తగ్గిందని కంపెనీ ప్రకటించింది.
33% పెరిగిన ఫేస్‌బుక్ రెవెన్యూ
ఫేస్‌బుక్ సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికానికి 13.727 బిలియన్ డాలర్ల రెవెన్యూ సంపాదించింది. ఇది గతేడాదితో పోల్చితే 33 శాతం ఎక్కువ. ఇందులో యాడ్స్ ద్వారా 13.5 బిలియన్ డాలర్స్, పేమెంట్స్ , ఇతర ఫీజుల ద్వారా మిగిలిన మొత్తం సంపాదించినట్లు ఫేస్‌బుక్ ప్రకటించింది.
చిన్న వ్యాపారుల కోసం జీ ఆన్‌లైన్ యాడ్ ఫ్లాట్‌ఫాం
జీ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ (ZEEL) చిన్న రిటైల్ వ్యాపారుల కోసం ఆన్‌లైన్ యాడ్ ఫ్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించింది. Zeemitra.com పేరుతో తీసుకొచ్చిన ఈ ఫ్లాట్‌ఫాం ద్వారా జీటీవీ, జీ సినిమా, జీ న్యూస్‌ల్లో యాడ్స్ ఇవ్వచ్చు.
లాభనష్టాల్లేని ఇన్ఫో యాడ్స్
నౌకరీ.కామ్, జీవన్‌సాతీ.కామ్, 99 ఎకర్స్.కామ్ వంటి ఇంటర్నెట్ పోర్టల్స్‌ను నడుపుతున్న ఇన్ఫో ఎడ్జ్ గత త్రైమాసికానికి పెద్దగా వృద్ధి లేదని ప్రకటించింది. గతేడాది సెప్టెంబర్ నెలాఖరు నాటికి రెండో త్రైమాసికంలో 79 కోట్లు ఆదాయం వస్తే ఈసారి అదే సమయానికి 78.5 కోట్ల రూపాయలు సాధించింది.
రైలు ప్రయాణికులకు జీ5 కంటెంట్
రైల్ యాత్రీ ద్వారా రైలు టికెట్లు కొని ప్రయాణించేవారికి జీ 5 కంటెంట్ పొందే అవకాశం రానుంది. వారం రోజుల ప్యాక్‌ను అందుబాటులోకి తేబోతున్నారు. రైల్ టికెట్లు కొనేటప్పుడే జీ 5 కంటెంట్ కావాలా అనే ఆప్షన్‌ను తీసుకోవచ్చు. అయితే ఈవారం రోజుల ప్యాక్ ధర ఎంత ఉంటుందనేది ఇంకా తెలియలేదు.