ఆండ్రాయిడ్ ఒకపక్క కొత్త వెర్షన్స్ రూపొందిస్తూనే.. మరోపక్క తన రూపాన్ని కూడా మార్చుకుంటూ వస్తోంది. కొత్త స్మార్ట్ ఫోన్లు విడుదలవుతున్న కొద్దీ.. ఆండ్రాయిడ్ గో, ఆండ్రాయిడ్ వన్, స్టాక్ ఆండ్రాయిడ్ అనే పేర్లు తరచూ వినిపిస్తున్నా యి. మరి ఈ మూడింట్లోనూ ఉన్న ప్రధానమైన తేడా ఏంటి? ఆండ్రాయిడ్‌లోనే ఇన్నిపేర్లు ఏమిటి? అనే సందేహాలు రాకమానవు. ఆండ్రాయిడ్ నౌగట్, ఓరియో, కొత్తగా విడుదలైన పి మధ్య ఎంత తేడా ఉందో.. ఆండ్రాయిడ్ గో, వన్, స్టాక్ ఆండ్రాయిడ్ మధ్య కూడా అంతే తేడా ఉంది. ఇప్పుడు అదేంటో తెలుసుకుందాం!
Stock Android
ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్(ఏవోఎస్‌పీ)లో భాగంగా ఇతర సంస్థలకు(వన్ ప్లస్, శాంసంగ్, షియామీ) ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ సోర్స్ కోడ్‌ను గూగుల్ అందజేస్తుంది. ఈ ఓఎస్‌కు తమ కొత్త ఫీచర్లు జోడించి.. సరికొత్త రూపంలో ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందిస్తుంది. శామ్సంగ్ సంస్థ.. టచ్‌విజ్ అనే స్కిన్‌ను, షియామీ ఎంఐయూఐ స్కిన్‌ను ఇలానే తయారు చేసుకున్నాయి. తమ సంస్థకు చెందిన బ్లోట్‌వేర్(మొబైల్‌తో వచ్చే ప్రీ ఇన్స్టాల్డ్ యాప్‌లు. వీటిని అన్ ఇన్స్టాల్ చేయలేం)ను యాడ్ చేసుకుంటాయి. ఇవి కొత్త రూపంలో ఉన్నా.. అంతర్లీనంగా అతి తక్కువ స్థాయిలో గూగుల్ ఫీచర్లను కలిగి ఉంటాయి. ఇలాంటి వాటినే స్టాక్ ఆండ్రాయిడ్‌గా వ్యవహరిస్తారు. ఈ ఫోన్లలో గూగుల్ యాప్స్ అతి తక్కువగా ఉంటాయి. ఈ స్టాక్ ఆండ్రాయిడ్ వల్ల.. సెక్యూరిటీ ప్యాచెస్, ఓఎస్ అప్డేట్లు వంటివి త్వరగా ఫోన్లకు వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల స్మార్ట్‌ఫోన్ చాలా ఫాస్ట్‌గా పనిచేస్తుంది.
Android One
ఇది గూగుల్ రూపొందించిన ఒరిజినల్ ఆండ్రాయిడ్ ఓఎస్. భారత్ వంటి దక్షిణాసియా దేశాల్లోని మార్కెట్‌ను ఆధారంగా చేసుకుని రూపొందించిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ రూపమే ఈ ఆండ్రాయిడ్ వన్. ముందుగా తక్కువ రేంజ్ స్మార్ట్ఫోన్లకే పరిమితం చేయాలని భావించినా.. తర్వాత మోటో ఎక్స్4 మంది మిడ్ టైర్ ఫ్లాగ్షిప్ ఫోన్లలోనూ వినియోగించేలా మార్పులు చేశారు. సాఫ్ట్‌వేర్‌లో అనేక మార్పులు చేయకుండా.. మంచి హార్డ్‌వేర్ ఫోన్లను రూపొందించే మాన్ఫ్యాక్చరర్లకు మాత్రమే గూగుల్ ఈ ఆండ్రాయిడ్ వన్ను అందజేస్తుంది. స్టాక్ ఆండ్రాయిడ్లానే.. ఈ ఆండ్రాయిడ్ వన్‌తో పనిచేసే స్మార్ట్ఫోన్లలోనూ లేటెస్ట్ ఓఎస్ అప్డేట్లు చాలా ముందుగా వస్తుంటాయి. ప్రస్తుతం షియామీ ఎంఐ ఏ2 ఫోన్.. ఈ ఆండ్రాయిడ్ వన్ మీదే రన్ అవుతుంది.
Android Go
ఇది అన్ని రకాల ఫోన్లలోనూ అందుబాటులో ఉంటుంది. తక్కువ ర్యామ్ ఉన్న బడ్జెట్ ఫోన్లు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులువుగా పనిచేసేందుకు ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించారు. ప్రస్తుతం 512 ఎంబీ కంటే ర్యామ్ తక్కువ ఉన్న ఫోన్లలోనూ ఈ సరికొత్త ఓఎస్ పనిచేస్తుందని గూగుల్ ప్రకటించింది. ఆండ్రాయిడ్ ఓరియో(8.0)లో అంతర్భాగంగా ఈ ఆండ్రాయిడ్ గో ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ నౌగట్ కంటే అతి తక్కువ స్పేస్‌ను ఉపయోగించుకుంటుంది. యూట్యూబ్ గో, జీమెయిల్గో, ఫైల్స్గో వంటి తక్కువ ఎంబీ గల లైట్ వెర్షన్లను సపోర్ట్ చేస్తుంది. 8 జీబీ కంటే తక్కువ ఉన్న ఫోన్లలో ర్యామ్ మేనేజ్మెంట్ సవాలే. ఫోన్ కొన్నిసార్లు ఆగిపోతూ.. కొద్ది సేపు పనిచేయడం నిలిచిపోతుంది. కానీ ఈ ఆండ్రాయిడ్ గోలో.. ఇలాంటి ఇబ్బందులేమీ లేకుండా ఫోన్ పనిచేస్తుంది. ఈ ఓఎస్‌తో విడుదలైన స్మార్ట్ ఫోన్.. నోకియా 1.