• తాజా వార్తలు

లాక్‌డౌన్‌తో ఫేస్‌బుక్‌, గూగుల్‌కు కూడా చుక్క‌లు కనిపిస్తున్నాయి.. తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్ అన్ని రంగాల‌ను చావుదెబ్బ కొడుతోంది.  ముఖ్యంగా ప్ర‌క‌ట‌న‌ల (యాడ్స్‌) ఆదాయం మీదే ఆధార‌ప‌డి బతుకుతున్న మీడియా రంగమైతే కోలుకోలేని ప‌రిస్థితి వ‌చ్చింది.  సాధార‌ణంగా ఇప్పుడు అంతా ఎడ్యుకేష‌న‌ల్ సీజ‌న్‌. ప్రొక్యూర్‌మెంట్ ఇప్పుడే ఉంటుంది.  కొత్త కోర్సులు, కొత్త సంస్థ‌లు, కొత్త వ్యాపారాలు ప్రారంభ‌మ‌వ‌డానికీ  ఎక్కువ దేశాలు  స‌మ్మ‌ర్‌నే ఎంచుకుంటాయి. కానీ ఇప్పుడున్న విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఉన్న వ్యాపారాల‌కే దిక్కులేదు. ఇక కొత్త‌వి ప్రారంభించ‌డం దేవుడెరుగు. కొత్త‌వి ప్రారంభించ‌క‌పోతే మీడియా సంస్థ‌ల‌కు యాడ్స్ రావు. స్థానిక పత్రిక‌ల నుంచి ఇంట‌ర్నేష‌న‌ల్ మ్యాగ‌జైన్స్ వ‌ర‌కు అన్నీ కూడా ఇప్పుడు ఖ‌ర్చు త‌గ్గించుకునే పనిలోప‌డ్డాయి. లాక్‌డౌన్ దెబ్బ గూగుల్‌, ఫేస్‌బుక్ లాంటి బ‌డా సంస్థ‌ల‌కూ తాకింది. యాడ్స్ రాకఆదాయం లేక అంత‌టి సంస్థ‌ల‌కు కూడా చుక్క‌లు క‌నిపిస్తున్నాయి.

యూఎస్‌లో 70%యాడ్స్  వీరివే
లాక్‌డౌన్‌తో అంద‌రూ ఇళ్ల‌లోనే ఉన్నారు. వ్యాపారాలు మూత‌పడ్డాయి. డిజిట‌ల్ యాడ్స్ రాక ఫేస్‌బుక్‌, గూగుల్ కూడా ఆగ‌మాగం అవుతున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్ల‌లో ఒక‌టైన అమెరికాలో డిజిట‌ల్‌యాడ్స్‌లో 70% ఈ రెండు సంస్థ‌ల‌కే వ‌స్తాయి. ఇప్పుడు అవేమీ రాక అవి గిల‌గిల‌లాడుతున్నాయి.

గూగుల్ కొత్త‌వాళ్ల‌ను తీసుకోవ‌ట్లేదు
గూగుల్ కొత్త ఎంప్లాయిస్‌ను తీసుకోవ‌డం లేదు. దాని మాతృసంస్థ ఆల్పాబెట్ సీఈవో అయిన సుంద‌ర్ పిచాయ్ మాట్లాడుతూ 50% వ‌ర‌కు మార్కెటింగ్ బ‌డ్జెట్ త‌గ్గించుకోవాల్సి ఉంద‌ని ఎంప్లాయిస్‌కు చెప్పేశారు. ఉద్యోగాలు, జీతాల్లో కోత లేకుండాచూడాలంటే ఈ చ‌ర్య‌లు త‌ప్ప‌నిస‌రి అని ఆయ‌న ఇంట‌ర్న‌ల్‌గా ఆదేశాలిచ్చేశారు.

ఫేస్‌బుక్ కూడా అదే దారిలో
సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ఫేస్‌బుక్ కూడా యాడ్ రెవెన్యూ రావ‌డం లేద‌ని క‌ల‌వ‌ర‌పడుతోంది. త‌మ ఫ్లాట్‌ఫామ్‌ను వినియోగించుకునేవారి సంఖ్య విప‌రీతంగా పెరిగిన‌ప్ప‌టికీ యాడ్స్ పరంగా ఎలాంటి వృద్ధీ లేద‌ని ఫేస్‌బుక్ చెబుతోంది. 

ఈ త్రైమాసిక‌మే భవిష్య‌త్తును తేల్చేది
ఏప్రిల్ నుంచి జూన్ వ‌ర‌కు ఉండే ఆర్థిక సంవ‌త్స‌రం తొలి త్రైమాసికంలో యాడ్ రెవెన్యూ పెరిగే అవ‌కాశాలు ఏ మాత్రం క‌నిపించ‌డం లేద‌ని ఈ  రెండు సంస్థ‌లూ చెబుతున్నాయి. ఎందుకంటే చాలా దేశాలు జూన్‌వ‌ర‌కు లాక్‌డౌన్‌లో ఉండే పరిస్థితే క‌నిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో యాడ్ రెవెన్యూ పెరిగే అవ‌కాశాలు దాదాపు లేన‌ట్లేన‌ని స‌మాచారం. 

రిజ‌ర్వ్ నిధుల‌మీదే ఆశ‌లు
ఆల్ఫాబెట్ 120 బిలియ‌న్ డాలర్లు, ఫేస్‌బుక్ 50 బిలియ‌న్ డాల‌ర్లు రిజ‌ర్వ్  ఫండ్‌గా పెట్టుకున్నాయి. వీటిమీదే ఆధార‌ప‌డి ఈ రెండు సంస్థ‌లూ బిజినెస్ రన్ చేయ‌బోతున్నాయి. ఫేస్‌బుక్ ఇప్ప‌టికే ఇండియ‌న్ టెలికం దిగ్గ‌జం జియోలో 42వేల కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డి పెట్ట‌డానికి ఒప్పందం కుదుర్చుకుంది.  జియో మార్ట్ వ్యాపారం ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందోన‌ని ఫేస్‌బుక్ ఎదురుచూస్తోంది.

జన రంజకమైన వార్తలు