• తాజా వార్తలు

న్యూస్‌పేపర్ పీడీఎఫ్ కాపీలు షేర్ చేస్తున్నారా.. బుక్క‌యిపోతారు జాగ్ర‌త్త 

ఇప్పుడంతా లాక్‌డౌన్ టైమ్‌.  ఇంట్లో ఖాళీగా కూర్చుని వాట్సాప్‌లో, టెలిగ్రామ్‌లో వ‌చ్చిన‌వి వ‌చ్చిన‌ట్లే ఫార్వార్డ్ చేయ‌డం, షేర్ చేయ‌డం చేస్తున్నారు చాలామంది.  అయితే ఇది డిజిటల్ కాలం అంటూ వార్తాపత్రిక‌ల‌ను కూడా  వాటి పీడీఎఫ్‌ల‌ను కాపీ చేసి టెలిగ్రామ్‌, వాట్సాప్ గ్రూప్స్‌లో షేర్ చేస్తున్నారు. అయితే ఇలా న్యూస్‌పేపర్ల పీడీఎఫ్ కాపీలు షేర్ చేయడం చట్టరీత్యా నేర‌మని ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్) హెచ్చరించింది. ఈ-పేపర్లను పీడీఎఫ్‌గా మార్చి వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేసే అడ్మిన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, భారీ జరిమానాలు విధించాలని దినపత్రికల యాజమాన్యాలను కోరింది.

అస‌లే క‌ష్ట‌న‌ష్టాలు
న్యూస్ పేపర్ యాజమాన్యాలు ఇప్పటికే పలు రకాల సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఓప‌క్క పేప‌ర్ త‌యారీ ఖ‌ర్చు పెరిగిపోయింది. లాక్‌డౌన్ దెబ్బ‌కు యాడ్స్ కూడా రావ‌డం లేదు. ఇన్ని క‌ష్ట‌న‌ష్టాల‌కోర్చి ప్రింట్ చేస్తే ఆ పేప‌ర్ల‌ను డిస్ట్రిబ్యూట్ చేయ‌డం చాలా క‌ష్టంగా మారింది. న్యూస్‌పేప‌ర్ల వ‌ల్ల క‌రోనా వ్యాపిస్తుంద‌ని కొంత‌మంది ప‌నిగ‌ట్టుకుని దుష్ప్ర‌చారం చేయ‌డంతో జ‌నం కొన్నాళ్లు పేప‌ర్ తాక‌డానికే భ‌య‌ప‌డిన ప‌రిస్థితి. ఇప్పుడు రీడ‌ర్లు అవగాహ‌న పెంచుకుని మ‌ళ్లీ పత్రిక‌ల‌ను ఆద‌రిస్తున్నారు. కానీ ఈలోగా కొంత‌మంది పేప‌ర్ల పీడీఎఫ్‌ల‌ను కాపీ చేసి సోష‌ల్ మీడియాల్లో, మెసేజింగ్ ఫ్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేయ‌డం పైరసీ, చోరీ కింద‌కే వ‌స్తుంద‌ని ఐఎన్ఎస్ అంటోంది. 

రెండు ర‌కాలుగా న‌ష్టం 
ఇలా ఈపేప‌ర్లు షేర్ చేసేయ‌డం వ‌ల్ల పత్రిక‌ను కొనేవారు త‌గ్గిపోతున్నార‌ని ఐఎన్ఎస్ అంటోంది. అంతేకాకుండా ఈ-పేపర్లు నెట్‌లో చూసేవాళ్ల సంఖ్య కూడా త‌గ్గిపోతుంద‌ని, త‌ద్వారా డిజిట‌ల్ యాడ్స్ రెవెన్యూ కూడా ప‌త్రిక‌లు లాస్ అవుతున్నాయ‌ని చెప్పింది. 

వార్నింగ్ ఇవ్వాల్సిందే
ఈ కాపీ పేస్ట్ చౌర్యాన్ని ఆపాలంటేదినపత్రికలన్నీ తమ యాప్‌లు, వెబ్‌సైట్లలో వీటిపై హెచ్చరికలు జారీ చేయాలని సూచించింది. న్యూస్‌పేపర్ పీడీఎఫ్ కాపీలను సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చేయడం చట్టరీత్యా నేరమని, ఉల్లంఘించిన వారికి కఠిన చర్యలు, భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించాలని ఐఎన్ఎస్ అంటోంది.  పీడీఎఫ్‌లు, ఇమేజ్‌ల డౌన్‌లోడ్లను నియంత్రించేందుకు సీక్రెట్ కోడ్‌ను పెడితే వాటిని షేర్ చేసేవాళ్లెవ‌రో ఈజీగా గుర్తించ‌వ‌చ్చ‌ని చెబుతోంది.  

జన రంజకమైన వార్తలు