కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి లాక్‌డౌన్ వరకు సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయని బాగా గొడవ అవుతోంది. సోషల్ మీడియాలో వచ్చేవాటిలో ఏవి నిజం? ఏవి అబద్ధం? అనే విశ్లేషణలతో పేపర్లలో ఆర్టికల్స్, టీవీ ఛానళ్లలో ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. అయితే సోషల్ మీడియా మొత్తం గబ్బుగానే ఉందా? అంటే కాదని చెప్పొచ్చు. ఏవో కొంతమంది చేసే ఫాల్స్ ప్రాపగాండాతో ఇంత రచ్చవుతుందే తప్ప సోషల్ మీడియా ఈ లాక్‌డౌన్ టైమ్‌లో జనానికి చాలా రిలీఫ్ ఇస్తుంది. చాలా విషయాలను కమ్యూనికేట్ చేస్తోంది.
వాట్సాప్ కింగే
లాక్‌డౌన్ సమయంలో వాట్సాప్‌ను ఎక్కువ మంది పదే పదే చూస్తున్నారు. కరోనా వైరస్ సంబంధిత సమాచారం గ్రూప్‌ల్లోనూ, పర్సనల్‌గానూ వాట్సాప్‌లో షేరవడమే దీనికి ప్రధాన కారణం. బంధుమిత్రుల క్షేమ సమాచారం కూడా వాట్సాప్ ద్వారా పంచుకుంటున్నారు. ఎక్కడో విదేశాల్లో ఉన్న పిల్లల క్షేమ సమాచారాలు ఇక్కడున్న తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు వీడియో కాల్స్ చేస్తూ తెలుసుకుంటున్నారు. మేమున్నామని ధైర్యం చెబుతున్నారు.
* కంపెనీలు తమ ఎంప్లాయిస్‌తో మాట్లాడడానికి వాట్సాప్ గ్రూప్‌లు, వీడియో కాల్స్‌ను ఇంతకు ముందుకంటే ఎక్కువ వాడుతున్నాయి.
* ఐసీఐసీఐ లాంటి కొన్ని బ్యాంకులైతే వాట్సాప్ ద్వారా బ్యాంకింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించాయి.
* తెలంగాణ ప్రభుత్వం వాట్సాప్‌తో కలిసి కరోనా మీద జనానికి అప్‌డేట్స్ ఇస్తోంది.
ఫేస్‌బుక్.. కరోనాపై అప్‌టు డేట్
ఇక సామాజిక మాధ్యమాల్లో లెజండ్‌గా మారిన ఫేస్‌బుక్‌ను అయితే లాక్‌డౌన్‌లో జనం తెగ చూసేస్తున్నారు. కరోనాకు, లాక్డౌన్‌కు సంబంధించి ప్రతి చిన్న అప్‌డేట్ దీనిలో వచ్చేస్తోంది. ఎక్కడో అమెరికాలో ఉన్న ఫేస్‌బుక్ యూజర్ కూడా అనకాపల్లి పక్కనున్న తమ ఊళ్లో పరిస్థితి ఏమిటో చూసుకునేలా ఎక్కడికక్కడ కమ్యూనిటీ గ్రూప్‌లు, ఫ్రెండ్స్ గ్రూప్‌ల్లో ఇన్ఫో షేర్ అయిపోతుంది. కొత్తగా కేసులొచ్చినా, రెడ్‌జోన్ ప్రకటించినా, అలాగే ఫేస్‌బుక్‌ను కూడా ఫేస్‌బుక్ అందరికీ చెప్పేస్తోంది.
జాగ్రత్తలు చెబుతున్నాయి
కరోనా వైరస్ బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సోషల్ మీడియాలో డాక్టర్లు చెబుతున్నారు. కూరగాయలు, కిరాణా సరకులు బయటి నుంచి తెస్తే వాటి ద్వారా వైరస్ సోకకుండా ఏం చేయాలో చెప్పే వీడియోలు, ఫోటోలు, ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో కోకొల్లలు. ఫలానా ఆయుర్వేద మందు వాడండి. ఫలానా ఫ్రూట్స్ తినండి. మీకు ఇమ్యూనిటీ పెరిగి కరోనా రాకుండా కాపాడుకోగలుగుతారు అని ఎడ్యుకేట్ చేస్తున్న పేజీలు, గ్రూప్స్ చాలా ఉన్నాయి.
టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్
ఇంట్లో కూర్చుని బోర్ ఫీలవుతున్న యువతకు టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ ప్రాణం పోస్తున్నాయి. టిక్‌టాక్‌లో అయితే కరోనా వైరస్, లాక్‌డౌన్‌కు సంబంధించిన ప్రతి అప్డేట్ మీద కొత్త కొత్త వీడియోలు గంట గంటకూ అప్‌డేట్ అయిపోతున్నాయి. ఒకరోజు లాక్డౌన్ అని మోడీ అనౌన్స్ చేయగానే ఇన్‌స్టాలో మెమేలు స్టార్ట్ అయ్యాయి. టిక్‌టాక్‌లో అయితే స్పాంటేనియస్‌గా స్పందించేసి వీడియోలు చేసి పెట్టేశారు. ఆ సాయంత్రం అందరూ చప్పట్లు కొట్టి మెడికల్, పోలీసు సిబ్బందికి మద్దతు పలకాన్నదానికీ టిక్‌టాక్‌లో మంచి వీడియోలు షేర్ అయ్యాయి. ఇన్‌స్టా అయితే చప్పట్లు కొట్టే ఫోటోలు, వీడియోలతో ఓవర్ ఫ్లో అయిపోయింది.
* లాక్‌డౌన్‌లో బయటికి వెళ్లొద్దు వెళితే పోలీసులు బడితె పూజ చేస్తారని ఫన్నీగా చెబుతూనే టిక్‌టాక్ వీడియోలు మెసేజ్ ఇస్తున్నాయి.
* అంతెందుకు మొన్న మోడీ దీపాలు వెలిగించమన్న సందర్భాన్నీ టిక్‌టాక్ యూజర్లు ఇట్టే పట్టేశారు. దీపాలు వెలిగించిన వీడియోలకు ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం అనే పాటను జోడించి సందడి చేశారు.
* రమణా దీపాలు వెలిగించాల్రా.. కరోనా పోతది అనే డైలాగ్ అయితే టిక్‌టాక్‌ను షేక్ చేసేసింది.
దాతలు పెరిగారు
గతంలో ఎప్పుడూ చూడనంతగా దాతలు పేదలను ఆదుకుని వాళ్లకు అన్నం పెట్టడమో, సరకులో కూరగాయలో పంచిపెట్టడానికి సోషల్ మీడియా కూడా ఓ ప్రధాన కారణం. అందరికీ ప్రచారం చేసుకోవాలని లేకపోయినా కనీసం కొంతమంది అయినా సోషల్ మీడియాలో లైక్‌లు, షేర్ల కోసం, అబినందనల కోసమో ఇలాంటి పనులు చేస్తున్నారని ఓ సైకాలజీ నిపుణుడు చెప్పారు. వాళ్లు ఎంత ప్రచారమైనా చేసుకోనివ్వండి కనీసం ఆ పోస్టింగ్ వల్ల ఇలాంటి కష్టకాలంలో ఓ పేదోడి కడుపు నిండితే అదే పదివేలు అంటున్నారు నెటిజన్లు.
గవర్నెమెంట్స్‌ను అలర్ట్ చేస్తున్నాయి
సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విటర్‌లాంటి మైక్రో బ్లాగింగ్ సైట్లు గవర్నమెంట్ అధికారులను, మంత్రులు, ముఖ్యమంత్రులను సమస్యల మీద అలర్ట్ చేస్తున్నాయి. ఎవరైనా ట్విటర్లో పెడితే వెంటనే రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా తెలంగాణలో మంత్రి కేటీఆర్ దీనిమీద ఎప్పటికప్పుడు అప్‌డేట్ అయి ప్రాబ్లమ్స్ క్లియర్ చేసేస్తున్నారు. అధికారులూ వెంటనే అప్రమత్తమవుతున్నారు.
ఈ లెక్కలే చెబుతున్నాయి
సోషల్ మీడియా యూజర్ల సంఖ్య ఈ లాక్‌డౌన్ కాలంలో 25% పెరిగింది. వాటిని చూసే సమయం యావరేజ్‌న 19% ఎక్కువైంది. * వాట్సాప్‌ను 27 శాతం ఎక్కువ సమయం చూస్తున్నారని నీల్సన్/ బార్క్ సర్వే చెప్పింది. నెంబర్ ఆఫ్ సెషన్స్ 20% పెరిగాయి.
* టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌ను చూసే సెషన్లు కూడా 20 శాతం పెరిగాయి. అంటే అంతకు ముందు రోజూ నాలుగుసార్లు చూసేవాళ్లు ఐదుసార్లు, పదిసార్లు చూసేవాళ్లు 12సార్లు చూస్తున్నారట.
*ఫేస్‌బుక్ కూడా ఇంచుమించు 18 శాతం ఎక్కువ సెషన్లను రికార్డ్ చేసింది.
కరోనా లాక్డౌన్ టైమ్‌లో సోషల్ మీడియాను జనం ఎంత నమ్ముతున్నారో చెప్పడానికి ఈ లెక్కలు చాలంటున్నారు నిపుణులు. అక్కడక్కడా కావాలని అబద్దాలు ప్రచారం చేసేవారున్నా ఓవరాల్‌గా చూస్తే కరోనా కష్టాల్లో సోషల్ మీడియా ఉపయోగాలు ఎక్కువే మరి.