'ట్వీట్2 క్విట్' వాడి స్మోకింగ్ మానేసిన వారు 40 శాతం సోషల్ మీడియా సామాజిక బాధ్యత నెరవేర్చడంలోనూ క్రియాశీల పాత్ర పోషిస్తోంది. తాజాగా మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ ప్రజల్లో చాలామందికి ఉన్న సిగరెట్ అలవాటును మాన్పించడానికి కృషి చేస్తోంది. దీనికోసం మీకు ఓ ట్విటర్ ఖాతా ఉంటే చాలు. పని ఇక సులభమైపోయినట్టే. ట్విట్టర్ లో ‘ట్వీట్ టూ క్విట్’ను ఫాలో అయితే చాలు దమ్ము కొట్టాలన్న ఆలోచన దరి చేరదంటున్నారు కాలిఫోర్నియా యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు. దీనికి నిదర్శనంగా తాజాగా తాము చేపట్టిన అధ్యయనం ఫలితా లను వారు చూపుతున్నారు. పొగ మాన్పించడంలో అవలంబించే సంప్రదాయ పద్ధతుల కన్నా కూడా ట్వీట్ టూ క్విట్ మెరుగైన ఫలితాలు ఇస్తోందని అధ్యయనం చేపట్టిన పరిశోధక బృందంలో ఒకరైన కొర్నెలియా పెచ్‌మెన్ తెలిపారు. సోషల్ మీడియా పట్ల అంతర్జాతీయంగా పెరుగుతున్న ఆదరణను వారు ప్రధానంగా ప్రస్తావించారు. పొగతాగే అలవాటును మానుకోవడం అంత సులభం కాదు. వ్యసనాలకు ఉండే స్వభావమే అంత. అయితే, ట్విట్టర్ 'ట్వీట్2 క్విట్' పొగమాన్పించడంలో మెరుగైన ఫలితాలు ఇస్తోందంటున్నారు ఈ పరిశోధకులు. ధూమపానం నిషేధానికి ఉద్దేశించిన ట్వీట్ టూ క్విట్ పొగతాగే అలవాటును మానుకోవాలనుకునే ట్విటర్ ఖాతాదారులకు రోజుకు నిర్దేశిత సమయాల్లో కనీసంగా రెండుసార్లు సందేశాలు పంపిస్తుంది. సాధారణంగా ధూమపానప్రియులు పొగతాగడానికి ఎంచుకునే సమయాల్లో కూడా సందేశాలు పంపిస్తుంది. ఆ క్రమంలో కాలిఫో ర్నియా యూనివర్శిటీ పరిశోధకులు వారి అధ్యయనంలో భాగంగా ఎంచుకున్న వారిలో కొందరికి ట్వీట్ టూ క్విట్ సందేశాలు వచ్చే ఏర్పాటు చేశారు. ఇతరులకు సంప్రదాయ పద్ధతుల్లో ధూమపానం మాన్పించే ప్రక్రియకు గురిచేశారు. ఇలా 60 రోజులు అధ్యయనం చేశారు. ట్వీట్ టూ క్విట్ సందేశాలు అందుకున్నవారు దాదా పు 40 శాతం దాకా పొగతాగాలనే ఆలోచనను దూరం చేసుకున్నామని చెప్పగా, ఇతరులకు ఆ ఆలోచన 20 శాతం మాత్రమే వచ్చిందని అధ్యయనంలో తేలింది. పొగ మాన్పించడంలో అవలంబించే సంప్రదాయ పద్ధతుల కన్నా కూడా 'ట్వీట్2 క్విట్' మెరుగైన ఫలితాలు ఇస్తోందని పరిశోధకుడు కొర్నెలియా పెచ్‌మెన్ తెలిపారు. సోషల్ మీడియా ద్వారా 'లో కాస్ట్ ట్రీట్ మెంట్' లా ధూమపానం నిషేధానికి ఉద్దేశించిన 'ట్వీట్2 క్విట్' పనిచేస్తోందని చెబుతున్నారు. బాగుంది కదా ఈ టెక్నిక్ .. మీరు ధూమపానంతో ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటుంటే 'ట్వీట్2 క్విట్'లో చేరిపోండి. మీ ఆరోగ్యాన్ని పూర్వస్థితికి తెచ్చుకోండి.. లేదా ఆరోగ్యం దుస్థితికి చేరకుండా కాపాడుకోండి. లేదంటే ఎంతో కొంత పూడ్చలేని నష్టాన్ని భరించక తప్పదు. నష్టాన్ని వీలైనంత వరకూ తగ్గించుకోవడానికి ప్రయత్నం ప్రారంభించండి. మిగతావారితో పోలిస్తే పొగరాయుళ్లు పదేళ్ల ముందే మరణిస్తారని, రోజుకో పెట్టె కాల్చేసే వారికి ఈ ముప్పు నాలుగు నుంచి ఐదు రెట్లు ఎక్కువని ఇటీవలే పరిశోధకులు హెచ్చరించారు. ఈ శతాబ్ది అంతానికి మొత్తం వంద కోట్ల మంది పొగ తాగిన కారణంగా మరణించవచ్చని వైద్యులు ఈ మధ్యే ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో ట్విట్టర్ సహాయంతో సిగరెట్ మానేసే ఛాన్సు రావడం శుభపరిణామమే. |