సోషల్ మీడియా సరదాకే కాదు.. మనుషుల మధ్య సంబంధాలు కూడా పెంచుతోంది. ఎప్పుడో సంబంధాలు తెగిపోయిన బంధుమిత్రులను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా వేదికలు కలుపుతున్నాయి. ఆపదలో ఉన్నవారిని ఆదుకోమని ఫేస్‌బుక్‌లో పెడితే స్పందించే పెద్దమనసు కలిగిన వాళ్లూ ఉన్నారు. లేటెస్ట్‌గా ఓ టీనేజర్‌ను కిడ్నాప్, రేప్ నుంచి కాపాడింది స్నాప్‌చాట్. అమెరికాలో జరిగిన ఈ సంఘటన గురించి మీరూ తెలుసుకోండి.
ఏం జరిగిందంటే..
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ పద్నాలుగేళ్ల అమ్మాయిని ఆల్బర్ట్ వాస్క్వీజ్ అనే 55 ఏళ్ల వ్యక్తి కిడ్నాప్ చేశాడు. ఆ అమ్మాయిని ఓ వాహనంలో తీసుకెళ్లి సాన్‌జోస్‌లో హోటల్‌లో బంధించాడు. ఆమెపై లైంగికంగా వేధించాడు. అంతేకాదు మరో ఇద్దరు ఫ్రెండ్స్‌ను కూడా పిలిచాడు. వాళ్లు కూడా వచ్చి ఆమెను వేధించడానికి ప్రయత్నించారు. కాసేపటికే వాళ్లు ముగ్గురూ ఆమెను హోటల్ రూమ్‌లో ఉంచి తాళం పెట్టి బయటకు వెళ్లారు.
స్నాప్‌చాట్ ఎలా కాపాడిందంటే..
కిడ్నాపర్లు బయటికి వెళ్లగానే ఆ అమ్మాయి తన ఫోన్‌లోని స్నాప్‌చాట్ యాప్‌తో ఫ్రెండ్స్‌కు తాను ఏ పరిస్థితుల్లో చిక్కుకున్నానో సమాచారం ఇచ్చింది. తాను ఎక్కడున్నానో తెలియడం లేదంటూ లొకేషన్ షేర్ చేసింది. వెంటనే ఆ అమ్మాయి ఫ్రెండ్స్ ఆ వివరాలతో పోలీస్‌లను కాంటాక్ట్ చేశారు. పోలీసులు ఆ లొకేషన్ ట్రేస్ చేసి నేరుగా వెళ్లి ఆల్బర్ట్‌కు, అతని స్నేహితులిద్దరికీ అరదండాలు తగిలించారు. వాళ్లపై కిడ్నాప్, రేప్‌కు ప్రయత్నించడం వంటి పలు కేసులు పెట్టారు.