సెల్ఫీ... నేటి తరానికి ఇదేమిటో చెప్పాల్సిన పనిలేదు. అయితే, రకరకాల మరణ కారణాల్లో సెల్ఫీ కూడా ఒకటిగా మారిన ఈ కాలంలో మనందరం తెలుసుకోవాల్సిన వాస్తవాలు కొన్ని ఉన్నాయి... అసలు సెల్ఫీ పుట్టింది ఎప్పుడో... ప్రపంచంలో ఆ ప్రయోగం చేసిన వ్యక్తి ఎవరో తెలుసా? తొలి సెల్ఫీ రూపుదాల్చింది 1839లో కాగా, దీనికి జీవం పోసింది ఔత్సాహిక ఫొటోగ్రాఫర్, అమెచ్యూర్ కెమిస్ట్ రాబర్ట్ కార్నీలియస్. తమ కుటుంబ దుకాణం వెనుక కెమెరాను ఓ స్టాండ్‌పై అమర్చి, లెన్స్ క్యాప్‌ను చటుక్కున తీసి, పరుగుపరుగున దాని ముందుకొచ్చి ఒక నిమిషంపాటు కూర్చుని సెల్ఫీ తీసుకున్నాడట ఆ మహాశయుడు. తదనంతరం 2004లో డిజిటల్ కెమెరాల యుగం ప్రారంభమయ్యాక సెల్ఫీ మోజు ప్రపంచం మొత్తాన్నీ గుప్పిట పట్టింది. అటుపైన స్మార్ట్ ఫోన్ల ప్రవేశంతో- ముఖ్యంగా 2010లో ఐఫోన్4 ఫ్రంట్ కెమెరాతో విడుదలయ్యాక ‘సెల్ఫీ’ విశ్వవాప్తమైపోయింది. అదెంతగా అల్లుకుపోయిందంటే- ప్రసిద్ధ ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ ‘సెల్ఫీ’ని ఏకంగా 2013 సంవత్సరపు వినూత్న పదంగా ప్రకటించింది! కానీ, ‘అమెరికా నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్’ నిర్వహించిన తాజా (2018) అంతర్జాతీయ అధ్యయనం దానికి మరో కొత్త కోణాన్ని జోడించింది. అదే... ‘‘సెల్ఫీ మరణాలు.’’ ప్రపంచవ్యాప్తంగా 2011 అక్టోబరు నుంచి 2017 నవంబరు మధ్య సంభవించిన 137 సెల్ఫీ దుర్ఘటనలలో 259 మంది ప్రాణాలు కోల్పోయారని సదరు అధ్యయనం తేల్చింది. అందులో వెల్లడైన కొన్ని చేదు నిజాలను ఇప్పుడు తెలుసుకుందాం:
1. సెల్ఫీలు చంపేస్తాయి!
మొట్టమొదటి సెల్ఫీ మరణం ఎప్పుడు చోటుచేసుకుందోగానీ, 2011లో ముగ్గురు వ్యక్తులు సెల్ఫీ సంబంధ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. అటుపైన 2013లో ఇద్దరు, 2014 నాటికి 13 మంది, 2015కల్లా 50 మంది, 2016లో 98 మంది, 2017లో 93 మంది సెల్ఫీలకు బలైపోయారని అధ్యయనం వెల్లడించింది. ఈ సంఖ్య ఇలా ఏటికేడు పెరిగిపోతూ వచ్చినా, కొన్ని సందర్భాల్లో ఇలాంటివాటిని ప్రమాదాలుగా పరిగణించడం వల్ల వాస్తవ సెల్ఫీ మరణాల సంఖ్య తక్కువగానే నమోదైనట్లు అంచనా.
2. తొలి సెల్ఫీ మరణంపై శోధన
సెల్ఫీ మరణం గురించి ఇంటర్నెట్ శోధక దిగ్గజం గూగుల్‌లో 2014 జనవరిలో రిక్వెస్ట్ నమోదైంది. సెల్ఫీ పోజు తీసుకున్న కొన్ని క్షణాలకే ఓ లెబనీస్ పౌరుడు కారు బాంబు పేలుడులో దుర్మరణం పాలైన సందర్భంలో నెటిజన్ ఒకరు ‘సెల్ఫీ డెత్స్’ పేరిట సెర్చ్ ప్రారంభించారు.
3. రిస్కీ, నాన్-రిస్కీ సెల్ఫీ మరణాలు
సెల్ఫీ మరణాలను రిస్కీ, నాన్-రిస్కీ బిహేవియర్ కేటగిరీలుగా అధ్యయనం వర్గీకరించింది. ‘రిస్కీ’ అంటే... సెల్ఫీ తీసుకోవడం కోసం దుస్సాహసానికి సిద్ధపడటంగా నిర్వచించింది. ఉదాహరణకు జారుడుగా ఉన్న కొండకొన మీదినుంచి పడిపోయి మరణించడాన్ని ఈ కేటగిరీలో చేర్చింది. అలాగే ‘నాన్ రిస్కీ’ అంటే... ప్రశాంతంగా కనిపిస్తున్న సముద్రతీరంలో సెల్ఫీ తీసుకోబోతుండగా అనుకోకుండా దూసుకొచ్చిన అలకు బలైపోవడంలాంటిది. ఈ రెండింటిలో సహజంగానే రిస్కీ బిహేవియర్ వల్ల సంభవించిన సెల్ఫీ మరణాలే అధికం.
4. మహిళలకన్నా పురుషుల సంఖ్యే ఎక్కువ
సెల్ఫీలు తీసుకోవడంలో అగ్రస్థానం మహిళలదే అయినా, ఈ సరదా తీర్చుకునే క్రమంలో అత్యధికంగా మరణిస్తున్నది పురుషులేనని అధ్యయనం పేర్కొంది. ఆ మేరకు మొత్తం సెల్ఫీలకు బలైనవారిలో సుమారు 72 శాతం పురుషులే ఉన్నారు. మహిళలతో పోలిస్తే పురుషుల్లో రిస్కీ బిహేవియర్ ఎక్కువ కాబట్టి ఈ పరిణామం సహజమని అధ్యయనం వివరించింది.
5. మరణ కారణాలు?
నీట మునగడం: బీచ్‌లో సెల్ఫీ తీసుకుంటుండగా రాకాసి అలలు దూసుకొచ్చి కబళించడం. జల విహారం చేస్తూ సెల్ఫీ తీసుకునేటపుడు పడవలు బోల్తాపడటం, ఈత తెలియకపోయినా హెచ్చరికలను పెడచెవినబెట్టి సముద్రంలోకి దిగడం.
రవాణా సాధనాలు: దూసుకొచ్చే రైలుకు ఎదురుగా లేదా పక్కన నిలబడి సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో ప్రమాదం.
కొండ కొననుంచి జారిపడటం: ఏదైనా కొండ లేదా పర్వతం పైకెక్కి అక్కడ నిల్చుని సెల్ఫీ తీసుకోబోతూ జారిపడిపోవడం. అంత ఎత్తునుంచి ప్రపంచం చాలా విశాలంగా, సుందరంగా కనిపించే మాట వాస్తవమేగానీ, దానికన్నా మన జీవితం చాలా విలువైనది, అందమైనదన్న వాస్తవాన్ని విస్మరించడమే మరణ కారణం. ఇక నిప్పుతో చెలగాటం, విద్యుదాఘాతం, తుపాకుల వంటి మారణాయుధాలతో సెల్ఫీ ప్రయత్నాలు వికటించడం మరికొన్ని కారణాలు.
6. అగ్రస్థానం మనదే!
సెల్ఫీ సంబంధిత మరణాలలో భారత్ వాటాయే అధికమని ఈ అంతర్జాతీయ సర్వే తేల్చింది. పైగా ప్రపంచంలో యువజనం (30 ఏళ్లలోపు) అధికంగా ఉన్న దేశం కావడమే ఇందుకు కారణమని కూడా వెల్లడించింది. అందుకే సెల్ఫీ సరదాకు బలైనవారిలో ఈ వయసులోపు యువతే ఎక్కువని తెలిపింది.
7. సెల్ఫీ మరణాల నివారణ చర్యలు
భారతదేశంలోని ముంబై, గోవా బీచ్‌లలో అధికార యంత్రాంగం ‘‘నో సెల్ఫీ జోన్’’లు ఏర్పాటు చేయడాన్ని బట్టి సెల్ఫీల సరదా ఎంత ప్రమాదకరంగా పరిణమిస్తున్నదీ స్పష్టమవుతోంది. అంతేకాకుండా ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ‘‘సేఫ్ సెల్ఫీ స్పాట్స్’’ను మార్క్ చేయడం చూస్తే ప్రభుత్వాలు సెల్ఫీ మరణాల నివారణకు చేస్తున్న ప్రయత్నాలూ అవగతమవుతాయి. ఇండోనేసియాలో మౌంట్ మెరపీని సెల్ఫీ ప్రమాద జోన్‌గా ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా రష్యా కూడా కొన్ని ప్రాంతాలలో సెల్ఫీలు తీసుకోరాదనే హెచ్చరికలతోపాటు నినాదాలు రాసిన బోర్డులు కనిపిస్తాయి. ఇదంతా అలా ఉంచితే అమెరికా అధ్యయనంలోని గణాంకాల ఆధారంగా ప్రపంచంలోని ప్రమాదకర ప్రదేశాలను గుర్తించి, అలాంటి చోట్ల సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించేవారిని పసిగట్టి హెచ్చరించే యాప్ రూపకల్పనకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. అంటే... మానవ సహజ విచక్షణను, కృత్రిమ మేధస్సు నియంత్రించడం అన్నమాట!