• తాజా వార్తలు

టిక్‌టాక్‌ మాయలు - 2, మరో ఇద్దరు ఉద్యోగులు సస్పెన్షన్‌

విధుల్లో ఉండగా టిక్‌టాక్‌ రూపొందించి పలువురు తమ ఉద్యోగాలకే ఎసరు తెచ్చుకుంటున్న సంఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.అలాగే టిక్‌టాక్ వీడియోల కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది.  ఇటీవల కరీంనగర్‌లో టిక్‌టాక్‌లో నటించిన ముగ్గురు వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు సస్పెండై వారం రోజులు కూడా గడవకముందే అనంతపురం జిల్లాలో అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. టిక్‌టాక్‌ కారణంగా మరో ఇద్దరు మహిళలు ఉద్యోగం నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు. అనంతపురం జిల్లా కదిరి ప్రాంతీయ వైద్యశాలలో ల్యాబ్‌ టెక్నీషియన్లుగా పనిచేస్తున్న శైలజ, సద్గుణ విధి నిర్వహణ సమయంలో టిక్‌టాక్‌ చేశారు. ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో వైద్యశాల సూపరింటెండెంట్‌ వారిద్దరినీ విధుల నుంచి తొలగించారు.

కాగా ఖమ్మం కార్పోరేషన్‌లో ఉద్యోగుల టిక్‌టాక్ వీడియోల అంశాన్ని ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఔట్‌సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న అనిత, జ్యోతి, రవిలకు ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీచేశారు. వీళ్లంతా బర్త్, డెత్ సర్టిఫికెట్లు, ట్రేడ్ లైసెన్సులు ఇచ్చే కీలక విభాగాల్లో పనిచేస్తున్నారు. ఈ వీడియోల్లో కంప్యూటర్ ఆపరేటర్ ప్రవీణ్, డీబీ సెక్షన్ అసిస్టెంట్ వీరన్న కూడా కనిపించడంతో వారిని కూాడా సంజాయిషీ కోరారు. వారిని సస్పెండ్ కూడా చేసినట్లు తెలుస్తోంది. 

టిక్‌టాక్‌ కోసం బైక్ స్టంట్ చేయబోయి ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. స్టంట్ ఫెయిల్ కావడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రుల్లో చావు బతకుల మధ్య పోరాడుతున్నాడు. అయితే అతని వివరాలు ఇంకా తెలియలేదు. 

తాజాగా కరీంనగర్‌లోని వైద్య ఆరోగ్య శాఖలో మహిళా ఉద్యోగుల టిక్‌టాక్‌ వీడియో వైరల్‌ కావడంతో జూనియర్ అసిస్టెంట్లు సమత, దివ్య మణి, ల్యాబ్ అటెండెంట్ జయలక్ష్మిపై సస్పెన్షన్‌ వేటు పడింది.

మొత్తానికి టిక్‌టాక్‌ వల్ల చాలామంది ఉద్యోగాలు కోల్పోతున్నా మిగతా వారికి కనువిప్పు కలగడం లేదు. విధుల్ని గాలికొదిలేసి టిక్‌టాక్‌లో మునిగిపోతున్న ప్రభుత్వ ఉద్యోగుల తీరుపై జనంలో నిరసన పెల్లుబికుతోంది.

జన రంజకమైన వార్తలు