• తాజా వార్తలు

ట్విట్టర్ లో నయా టైం లైన్...

సోషల్ మీడియాలో ఫేస్ బుక్, ట్విట్టర్ లు టాప్ ర్యాంకులో ఉన్నప్పటికీ సింపుల్ ఇంటర్ ఫేస్ తో ఆమాత్రం టచ్ ఉన్నవారికి కూడా చేరువయ్యేలా అత్యంత సులభమైనది మాత్రం ఫేస్ బుక్కే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ కారణంగా ట్విట్టర్ కంటే ఫేస్ బుక్ ఎంతో ముందుంది. చూడగానే ఆకట్టుకునే టైం లైన్... ఈజీ యాక్సెస్ ఉండే టైం లైన్ తో ఫేస్ బుక్ దూసుకెళ్తోంది. కానీ... మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ మాత్రం ఆ స్థాయిలో సామాన్యులకు చేరువ కాలేకపోయింది. ఆ లోపాన్ని అధిగమించి అన్ని వర్గాలకూ అందుబాటులో ఉండేలా ట్విట్టర్ కూడా తన రూపం మార్చుకోవడానికి రెడీ అవుతోంది. త్వరలోనే ట్విట్టర్ తన రూపం మార్చుకోబోతుంది.

ఇటీవల కాలంలో ట్విట్టర్ కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునే ప్రయత్న చేస్తోంది.  ట్వీట్లలో అక్షరాల పరిమితిని ఇప్పటికే పెంచిన ట్విట్టర్ ఇప్పుడు ఫేస్ బుక్ లోని టైమ్ లైన్ మాదిరి అల్గారిథమ్ టైమ్ లైన్ ను ప్రారంభించడానికి సిద్దమైంది. ఈ కొత్త టైమ్  లైన్ ను భారతదేశంతో పాటు మొత్తం 23 దేశాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని  ప్రయత్నాలు మొదలుపెట్టింది. సైన్ ఇన్ చేయకపోయినప్పటికీ ఇంతవరకు అందరికీ వ్యక్తిగత ట్వీట్స్ మాత్రమే కసిపించేవి. ఇప్పుడీ టైమ్ లైన్ ద్వారా చాట్... స్టోరీలు వంటివి కూడా చెక్ చేసుకునే  వీలు ఏర్పడబోతోంది.

అయితే... కొత్త అల్గారథమిక్ టైం లైన్ ను ట్విట్టర్ తప్పనిసరి చేస్తుందా.. లేదా కేవలం ఒక ఆప్షన్ గానే ఉంచుతుందా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. ట్విట్టర్ సీఈఓగా అక్టోబరులో జాక్ డార్సీ పగ్గాలు చేపట్టిన తరువాత ఎన్నో మార్పులను తీసుకొస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు కొత్త రూపం ఇస్తున్నారు. ఫేస్ బుక్ కు పోటీగా ప్రతి ఒక్కరి మొబైల్ లో ట్విట్టర్ యాప్ ఉండాలన్న లక్ష్యంతో దూసుకెళ్తున్నారు. ఆ క్రమంలో ముందుముందు మరిన్ని మార్పులను మనం చూడబోవడం ఖాయం.

 

జన రంజకమైన వార్తలు