• తాజా వార్తలు

మీ మ‌ర‌ణం త‌ర్వాత మీ సోష‌ల్ మీడియా అకౌంట్లు ఏమ‌వుతాయి? రెండవ భాగం

స్మార్ట్‌ఫోన్ ఉన్న అంద‌రికీ సోష‌ల్ మీడియాలో ఏదో అకౌంట్ ఉంటోంది. వీడియోలు, ఫోటోలు చూడ్డానికి చ‌దువుతో ప‌నిలేదు కాబట్టి  ఇండియాలో నిర‌క్ష‌రాస్యులు కూడా వాట్సాప్‌, ఫేస్‌బుక్ అల‌వోక‌గా వాడేస్తున్నారు.  కాస్త ఆస‌క్తి ఉన్న‌వాళ్లు, టెక్నాల‌జీని వంట ప‌ట్టించుకున్న‌వాళ్ల‌యితే వీటితోపాటు ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట‌ర్‌, స్నాప్‌చాట్, పింట్రెస్ట్ లాంటి ఇత‌ర సోష‌ల్ మీడియా అకౌంట్లూ ఓపెన్ చేసుకుని వాడుకుంటున్నారు.  సోష‌ల్ మీడియా అంటే ఊసుపోని క‌బుర్లే కాదు. మ‌న అనుభూతులకు వేదిక‌. జ్ఞాప‌కాల‌కు మంచి స్టోర్ బాక్స్‌. కానీ ఈ అకౌంట్ల‌న్నీ మ‌నం ఉన్నంత వ‌ర‌కూ బాగానే ఉంటాయి. మ‌నం చ‌నిపోయిన త‌ర్వాత ఇవి ఏమ‌వుతాయి? మ‌న అకౌంట్‌లో   డేటా ఏమవుతుంది? దాన్ని మన వారు ఎవరైనా తీసుకోవాలంటే అవకాశం ఉందా?   గూగుల్, మైక్రోసాఫ్ట్  అకౌంట్ల‌కు సంబంధించి ఇలాంటి ప‌రిస్థితుల్లో ఏం చేయాలో నిన్న‌టి ఆర్టిక‌ల్‌లో మ‌నం చెప్పుకున్నాం. ఇప్పుడు సోష‌ల్ మీడియా లైఫ్‌ను మ‌న వారికి అందించడానికి ఏం చేయాలో ఈ ఆర్టికల్ లో చూద్దాం. 

ఫేస్‌బుక్ 
ప్ర‌పంచ‌వ్యాప్తంగా అల్లుకుపోయిన సోష‌ల్ మీడియా స‌ర్వీస్ ఫేస్‌బుక్‌లో ఖాతాదారు చ‌నిపోయిన త‌ర్వాత జ‌రిగే ప్రాసెస్ కొద్దిగా డిఫ‌రెంట్‌గా ఉంటుంది.

* మీ డెత్ గురించి ఫేస్‌బుక్‌కు మీ వారెవ‌రైనా తెలియ‌ప‌రిస్తే ఫేస్‌బుక్ దాన్ని ధ్రువీకరించుకుని మీ అకౌంట్‌ను డిలీట్ చేస్తుంది. లేదా మీ అకౌంట్‌ను మీ ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ వాళ్ల మెమ‌రీలు షేర్ చేసుకునేలా మెమోరియ‌లైజ్డ్ Memorialised గా మార్చుకోవ‌చ్చు. ఫేస్‌బుక్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి Memorialisation Settingsను సెట్ చేసుకోవ‌చ్చు.  

* మీరు ముందుగా ఇలాంటి ఏర్పాటు చేసుకోకుంటే మీ ఫ్యామిలీ మెంబ‌ర్స్ మీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను మెమోరియ‌లైజ్డ్ చేయ‌మ‌ని రిక్వెస్ట్‌ను ఫేస్‌బుక్‌కు పంప‌వ‌చ్చు. దాన్ని ప‌రిశీలించి మీ అకౌంట్‌లో ఉన్న డేటాను మీ వారికి ఇస్తారు.  అయితే ఇక్క‌డ కూడా పాస్‌వ‌ర్డ్ చెప్పరు.  

* మీరు చ‌నిపోయాక మీ అకౌంట్స్ డేటా ఎవ‌రికి ఇవ్వాలో ముందే సెట్ చేసుకోవ‌డానికి లెగ‌సీ కాంటాక్ట్ అనే ఆప్ష‌న్ కూడా ఎఫ్‌బీలో ఉంది.  మ‌రిన్ని వివ‌రాలు కావాలంటే ఫేస్‌బుక్ ఎఫ్ఏక్యూ సెక్ష‌న్‌లో చూడొచ్చు. 

ఇన్‌స్టాగ్రామ్ 
ఫేస్‌బుక్ కంపెనీకి చెందిన ఇన్‌స్టాగ్రామ్ కూడా ఈ విష‌యంలో సేమ్ ఫేస్‌బుక్ పాల‌సీనే ఫాలో అవుతుంది.

* మీరు చ‌నిపోతే ఆ త‌ర్వాత మీ ఇన్‌స్టా అకౌంట్‌ను  మెమోరియ‌లైజ్డ్ చేయొచ్చు.  లేదా మీ ఫ్యామిలీ మెంబ‌ర్ రిక్వెస్ట్ మీద దాన్ని డిలీట్ లేదా మెమోరియ‌లైజ్డ్ చేయొచ్చు.

* అయితే ఫేస్‌బుక్‌లా దీనిలో లెగ‌సీ కాంటాక్ట్‌ను యాడ్ చేసుకునే అవ‌కాశం లేదు.  

ట్విట‌ర్ 
మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట‌ర్లోనూ ప‌రిస్థితి కొద్దిగా భిన్నంగానే ఉంది.  

* అకౌంట్ హోల్డ‌ర్ చ‌నిపోతే అత‌ని ఇమ్మీడియ‌ట్ ఫ్యామిలీ మెంబ‌ర్ అంటే భార్య‌/ భ‌ర్త లేదా కుమారుడు/  కుమార్తె ఇలా ఎవ‌రైనా రిక్వెస్ట్ పెడితే ఆ అకౌంట్‌ను ట్విట‌ర్ తొల‌గిస్తుంది. 

* మీ అకౌంట్లో ఉన్న డేటాను మీకు ఇవ్వ‌దు.

 * మీ త‌ర్వాత మీ ట్విట‌ర్ అకౌంట్‌ను వేరేవారు కొన‌సాగించ‌డానికి ట్విట‌ర్ అనుమ‌తించ‌దు. అలాగే ముందే మీరు మీ అకౌంట్ న‌డ‌ప‌డానికి వేరే వ్య‌క్తిని పెట్టుకోవ‌డానికి కూడా అనుమతి ఇవ్వ‌దు. 

లింక్డిన్ 
లింక్డిన్‌లో కూడా చ‌నిపోయిన వ్య‌క్తి అకౌంట్‌ను తొల‌గించే ఆప్ష‌న్ ఉంది. 
* అకౌంట్‌లోని హెల్ప్ సెక్ష‌న్‌లోకి వెళ్లి రిక్వెస్ట్ పెట్టాలి. అకౌంట్ ఉన్న వ్య‌క్తి చ‌నిపోయిన‌ట్లు డెత్ స‌ర్టిఫికెట్ సబ్మిట్ చేయాలి. 
* అవ‌న్నీ స‌రిగా ఉన్నాయో లేదో వెరిఫై చేసుకున్నాక లింక్డిన్ ఆ అకౌంట్‌ను తొల‌గిస్తుంది. 

పింట్రెస్ట్ 
పింట్రెస్ట్‌లో కూడా అకౌంట్ హోల్డ‌ర్ చ‌నిపోతే ఆ అకౌంట్‌ను తొల‌గించ‌మ‌ని కుటుంబ‌స‌భ్యులు రిక్వెస్ట్ చేయొచ్చు. హెల్ప్ సెంట‌ర్‌ను సంప్ర‌దించి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. వెరిఫై చేసి అకౌంట్ తొల‌గిస్తారు.

స్నాప్‌చాట్ 
స్నాప్‌చాట్‌లో కూడా అకౌంట్ హోల్డ‌ర్ చ‌నిపోతే కుటుంబ‌స‌భ్యులు స్నాప్‌చాట్ స‌పోర్ట్ పేజీలోకి వెళ్లి అకౌంట్ తొల‌గించాల‌ని రిక్వెస్ట్ చేయొచ్చు.  మీరు స‌బ్మిట్ చేసిన డాక్యుమెంట్ల‌న్నీ  వెరిఫికేష‌న్ చేశాక అకౌంట్ తొల‌గిస్తారు. ఇందులో కూడా మీ డేటాను లాగిన్ వివ‌రాల‌ను మీ వారికి ఇవ్వ‌రు.

 యాపిల్ ఐడీ
యాపిల్ యూజ‌ర్‌కు సంబంధించిన యాపిల్ అకౌంట్‌ను కూడా ఇలాగే రిక్వెస్ట్ పెడితే అన్నీ ప‌రిశీలించి తొల‌గిస్తారు. 

అవి మాత్రం ఇవ్వ‌రు
అయితే పై వాటిలో వేటిలోనూ మీ రిక్వెస్ట్ మేర‌కు చ‌నిపోయిన వ్య‌క్తి అకౌంట్‌ను తొల‌గిస్తారు. అంతేత‌ప్ప‌ మీ డేటా, లాగిన్ వివ‌రాల‌ను మీ వారికి ఇవ్వ‌రు. ఎందుకంటే దానివల్ల దుర్వినియోగం జ‌రిగితే లీగ‌ల్‌గా స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది 


 

జన రంజకమైన వార్తలు