ఫొటోలు.. కోటి భావాలను పలికిస్తాయంటారు.. ఒక్క ఫొటో చాలు విషయం మొత్తం చెప్పేయడానికి.. అందుకే ఫొటోలు తీయడం చాలామందికి సరదాగా ఉంటుంది. కొంతమందికి హాబీగా ఉంటుంది.. ఇంకొంతమందికి ఇదో వ్యాపకంగా ఉంటుంది.. ఇంకొందరికి ప్రొఫెషన్‌గా ఉంటుంది.. కానీ ఫొటోలు తీయడం కష్టం కాదు.. కానీ ఎలా తీయాలి.. ఎప్పుడు తీయాలి.. ఎవరిని తీయాలి... ఎవరినైనా ఫొటోలు తీసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఇలాంటి విషయాలు ఎప్పుడైనా ఆలోచించారా..!
మీ ఫొటో ఎలాంటిది?
మీరు ఏదైనా ఫొటో తీయాలనుకుంటే అసలు ఆ ఫొటో ఏ యాంగిల్‌లో తీద్దాం అనుకున్నారు. ఏ ఉద్దేశంతో తీస్తున్నారు.. దాని వల్ల ప్రయోజనం ఏమిటి లాంటి విషయాలను బుర్రలో పెట్టుకోవాలి. ఏదో తీశాం అంటే తీశాం అని తీస్తే ఆ ఫొటోలో జీవం ఉండదు. అందుకే మనం ఎవరినైనా ఫొటో తీయాలనుకుంటే ఆ ఫొటోలో పడే వ్యక్తి ఎలా ఉండాలి.. వారి భంగిమ ఎలా ఉండాలి... లాంటి విషయాలు ఆలోచించాలి.
క్యాజువల్, సీరియస్
ఫొటోల్లో రెండు రకాలు ఉంటాయి.. క్యాజువల్, సీరియస్. అంటే ఏదో అలా నేచురల్‌గా తీసే ఫొటోలు వేరు ప్రత్యేకించి సీరియస్‌గా తీసుకునే ఫొటోలు వేరు. ఇలా సీరియస్‌గా తీసే ఫొటోలకు ఒక ప్రయోజనం ఉంటుంది. అయితే మీరు నేచురల్‌గా ఫొటోలు తీయాలనుకుంటే వాళ్లు అపరిచితులు అయితే మాత్రం కచ్చితంగా ఫొటోలు తీసుకునే వాళ్ల దగ్గర నుంచి అనుమతి తీసుకోవాలి. వాళ్లు ఓకే అన్న తర్వాత మాత్రమే ఫొటో తీసుకోవాలి. ఒకే అనకపోయినా ఫొటో తీసుకోవడం నైతికంగా తప్పు
ప్రొహిబిటెట్ ఏరియాల్లో
ఫొటోలు తీయడం అన్ని వేళల్లో అన్ని చోట్లా కుదరదు. కొన్ని ప్రొహిబిటెడ్ ఏరియాలు ఉంటాయి. వాటిలో మనం ఫొటోగ్రఫీ చేయడం కుదరదు. కానీ కొంతమంది అత్సుత్సాహం ప్రదర్శిస్తూ ఫొటోలు తీస్తుంటారు. ఇలా తీయడం వల్ల మనం ప్రమాదం పడతాం. కేవలం కెమెరా లాక్కోవడమే కాదు కేసుల్లోనూ చిక్కుకునే ప్రమాదం ఉంది. అందుకే ఇలాంటి ప్రాంతాల్లోఫొటోలు తీయాలంటే సంబంధిత డిపార్ట్‌మెంట్ అనుమతి తప్పనిసరి. కొంతమంది ఏడుస్తున్నప్పుడు ఫొటోలు తీస్తుంటారు.. లేదా ఏకాంతగా ఉన్నప్పుడు ఫొటోలు తీస్తారు అలా చేయడం చాలా తప్పు.