ఫేస్ బుక్ ఛాటింగ్ కు ఈజీ మెథడ్ రోజంతా పుస్తకం ముట్టని విద్యార్థులు ఉంటారేమో కానీ పదినిమిషాలకోసారి ఫేస్ బుక్ చూడని స్టూడెంట్లు మాత్రం ఉండరు. అంతగా పాపులర్ అయింది ఫేస్ బుక్. కనురెప్పలు బరువెక్కి కళ్లు మూతలు పడి దానంతట అదే నిద్రొచ్చే వరకు కూడా ఫేస్ బుక్ కే కళ్లప్పగించేసేవారు కోకొల్లలుగా ఉన్నారు. వందకోట్లకు పైగా వినియోగదారులతో ప్రజల జీవితాలతో పెనవేసుకుపోయిన ఫేస్ బుక్ చిన్నాపెద్దా తేడాలేకుండా ఆధునిక జీవితంలో అంతర్భాగమైపోయింది. అయితే... ఫేస్ బుక్ ను విస్తారంగా వాళ్లలోనూ చాలామందికి తెలియని విషయం ఒకటుంది. ఫేస్ బుక్ కే చెందిన ఇంకో వెబ్ సైట్ కూడా ఫేస్ బుక్ అందించే సేవల్లో కొన్ని అందిస్తుంది. దీనికి లాగిన్ గా కూడా ఫేస్ బుక్ లాగిన్ నే ఉపయోగించవచ్చు. Messenger.com అనే ఈ వెబ్ సైట్ ను ఫేస్ బుక్ మెసేంజర్ సైట్ గా పరిగణిస్తారు. ఇందులో ఛాటింగ్ ఫేస్ బుక్ కంటే మెరుగ్గా ఉంటుందని చెబుతారు. ఫేస్ బుక్ లో అయితే.. ఫొటోలు, వీడియోలు, ఇతర భారీ పోస్టింగులతో లోడ్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు... వార్తలు, గ్రూపలు... లైకులు, షేర్లు... ఇలా పదుల సంఖ్యలో ఆప్షన్లతో స్క్రీనంతా నిండిపోతుంది. మెసేజింగ్ పార్టు చాలా తక్కువగా ఉంటుంది. అందుకే దానికి ప్రత్యామ్నాయంగా మెసేంజర్.కామ్ ఉపయోగించుకోవచ్చు. డెస్కుటాప్ పైనైనా... స్మార్ట్ ఫోన్లలోనైనా కూడా దీన్ని ఉపయోగించడం తేలిక. ఫేస్ బుక్ తో పనికి చేటని భావించి ఎన్నో కార్యాలయాల్లో ఫేస్ బుక్ ను నిషేధిస్తున్నారు. అలాంటి చోట కూడా మెసేంజర్. కామ్ చక్కగా వాడుకోవచ్చు. ఈ సైట్ ఫేస్ బుక్ లా కనిపించదు. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఇది ఉన్నా ఇప్పటికీ చాలామందికి మాత్రం తెలియదు. సోషల్ నెట్ వర్క్ లో ఉండే గజిబిజిలు అన్నీ లేకుండా ఓన్లీ ఛాటింగ్ ఆప్షన్ తో వచ్చిన ఈ ఫేస్ బుక్ కే చెందిన వెబ్ సైట్, యాప్ లోడ్ చేసుకుంటే చాటింగ్ ప్రియులకు ఇక ఇబ్బందులే ఉండవు. |