ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్, ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌ల పేర్లు మారనున్నాయి. వీటి మాతృక సంస్థ అయిన ఫేస్‌బుక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాట్సప్, ఇన్‌స్ట్రా గ్రామ్‌లను ఫేస్ బుక్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను ఒకటిగా జోడించడం అనేది ఫేస్‌బుక్‌కు ఒక భారీ మార్పు అవుతుందని అనుకుంటున్నారు. ఈ కంపెనీ ఇప్పటివరకూ ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్ తమ యూజర్లతో స్వతంత్రంగా పని చేసుకునేలా ఉంచింది.
గత ఏడాది కాలంగా ఫేస్‌బుక్ వీటికి ఆ స్వతంత్రతను తగ్గిస్తూ వస్తోంది. ఇప్పుడు ఏకంగా వాటి పేర్లు మార్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ 2012లో ప్రారంభించగా, వాట్సప్ 2014లో వినియోగంలోకి వచ్చింది.ఈ రెండింటికీ సొంత మేనేజర్లు, ఉద్యోగులు, విడివిడి కార్యాలయాలు కూడా ఉన్నాయి.
అయితే గత కొన్నాళ్లుగా ఫేస్‌బుక్ తమ సంస్థలో కొన్ని కొత్త సంస్కరణలు తెచ్చింది. వాటిలో భాగంగా వీటికి స్వతంత్రతను తగ్గించాలని చూస్తోంది. ఇందులో భాగంగానే వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ పేర్లలో కాస్త మార్పులు చేయనున్నట్లు ఈ వారం ప్రకటించింది. ఇకపై వాట్సప్ పేరును ‘వాట్సప్ ఫ్రమ్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ను ‘ఇన్‌స్టాగ్రామ్ ఫ్రమ్ ఫేస్‌బుక్’ అని మార్చనుంది.
ఇక గూగుల్ ప్లేస్టోర్, ఆపిల్ యాప్ స్టోర్‌లో ఈ పేర్లతోనే ఈ రెండు యాప్‌లు కనిపిస్తాయి. లాగిన్ పేజీల్లోనూ ఇదే పేరు కనపడనుంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టా, వాట్సప్‌ను మూడింటినీ ఇక ఫేస్‌బుక్ సంస్థే నిర్వహిస్తుంది.గత ఐదేళ్లకాలంలో వాట్సప్, ఇన్‌స్టాలలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. వినియోగదారులకు సౌలభ్యం కోసం, వారిని ఆకర్షించేందుకు ఎన్నో కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్, ఫేస్‌బుక్ స్టోరీస్, వాట్సప్ స్టేటస్ వంటి ఫీచర్లు ఈ కోవలోకి చెందినవే.
ప్రజల్లో వీటి వినియోగం పెరిగేందుకు..ఈ ఫ్లాట్‌ఫాంలపై ఎక్కువ సమయం గడిపేలా మార్క్ జుకర్ బర్గ్ ఈ మూడింటినీ ఒక్కటి చేయాలని భావిస్తున్నారు. ఫేస్ బుక్‌లో వాట్సప్, ఇన్ స్ట్రా గ్రామ్ ఒక పార్ట్ అని తెలియచేయడానికి తాము పేర్లను మార్చాలని అనుకున్నట్లు ఫేస్ బుక్ ప్రతినిధి వెల్లడించారు. వేరు వేరు ఫ్లాట్ ఫాంపై ఉన్న యూజర్లు అందరినీ ఒక దగ్గరకు తీసుకరావడం వల్ల కంపెనీ మొత్తం యూజర్ల సంఖ్య పెరుగుతుందని కంపెనీ భావిస్తోంది.