టిక్‌టాక్ ఇప్పుడు ఇండియాను ఊపేస్తోంది. దాని మోజులో పడి ఏం చేస్తున్నారో కూడా అర్థం అవడం లేదు. కళ్లు మూసుకుపోయాయి. ఇంకా చెప్పాలంటే ఈ యాప్ మనుషల ప్రాణాల మీదకు తెస్తోంది. ఈ నేపథ్యంలోనే అరుదైన వీడియోలు తీసి ‘టిక్‌టాక్’లో అప్‌లోడ్ చేయాలన్న కుతూహలం ఓ యువకుణ్ని చిక్కుల్లో పడేసింది. ఈ సంఘటనే తిరుపతిలో జరిగింది. పూర్తి వివరాల్లోకెళితే..
కలకడ మండలం, మంగళపల్లెకు చెందిన వి.మురళీకృష్ణ (21) డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. తరచూ వెరైటీ వీడియోలు చిత్రీకరించి ‘టిక్‌టాక్’ యాప్‌లో పోస్ట్ చేస్తుండేవాడు. ఆదివారం మరో వీడియో తీసేందుకు ఉదయం 10 గంటల సమయంలో శ్రీవారిమెట్టు మార్గంలో శేషాచలం అడవిలోకి వెళ్లాడు. అక్కడ ఓ గుట్టపై జాతీయజెండా ఎగురవేసి సెల్యూట్ చేస్తున్న వీడియోను చిత్రీకరించాడు.
తిరిగి వచ్చే క్రమంలో శ్రీవారిమెట్టు రోడ్డు మార్గానికి కాస్త సమీపంలోనే దారి తప్పాడు.. అప్పటికే సమయం రాత్రి 9 గంటలైంది. చిమ్మచికట్లో రాత్రంతా భయంతో గడిపాడు. ఫిట్స్ రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అక్కడ కనీసం తాగడానికి నీళ్లు కూడా లేక అపస్మాకరక స్థితికి చేరువయ్యాడు. చివరికి తోటి విద్యార్థులు, అధ్యాపకుడికి ఫోన్‌లో తన పరిస్థితి వివరించి వాట్సప్ లో అతనున్న లొకేషన్ షేర్ చేశాడు.
వెంటనే వారు పోలీసులకు ఫోన్ చేయడంతో చంద్రగిరి పోలీసులు, ఎస్టీఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. అర్ధరాత్రి అడవి బాట పట్టారు పోలీసులు. రాత్రి పది గంటల నుంచి శేషాచలం అడవుల్లో గాలించి సోమవారం తెల్లవారుజామున అతన్ని గుర్తించగలిగారు. ప్రస్తుతం అతన్ని చికిత్స కోసం రుయా ఆస్పత్రికి తరలించారు.