సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తన లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 10ను ఎట్టకేలకు విడుదల చేసింది. గతంలో ఆండ్రాయిడ్ ఓఎస్‌ల మాదిరిగా దీనికి గూగుల్ ఎటువంటి పేరు పెట్టలేదు. కేవలం వెర్షన్ నంబర్ తోనే దీన్ని విడుదల చేసింది. ఈ వెర్షన్ పిక్సల్, పిక్సల్ ఎక్స్‌ఎల్, పిక్సల్ 2, పిక్స్ 2 ఎక్స్‌ఎల్, పిక్సల్ 3, పిక్సల్ 3 ఎక్స్‌ఎల్, పిక్సల్ 3ఎ, పిక్సల్ 3ఎ ఎక్స్‌ఎల్ వంటి గూగుల్ ఫోన్లకు మాత్రమే ఇప్పుడు అందుబాటులో ఉంది. అన్ని ఫోన్లకు ఈ ఓఎస్ త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఆర్టికల్ లో భాగంగా గూగుల్ ఆండ్రాయిడ్ 10లోని టాప్ ఫీచర్లు ఏంటో తెలుసుకుందాం.
లైవ్ క్యాప్షన్
ఈ ఫీచర్ ద్వారా ఇకపై ఇతర యాప్‌లలో ప్లే చేసే వీడియో, ఆడియోలకు లైవ్ క్యాప్షన్లు నేరుగా ఇచ్చుకోవచ్చు. ఈ ఫీచర్ ఇప్పటికే యూట్యూబ్‌లో అందుబాటులొ ఉంది.
స్మార్ట్ రిప్లై
ఈ ఫీచర్ ద్వారా మీరు ఎం టైప్ చేయాలనుకుంటున్నారో అది ముందుగానే మీకు కనిపిస్తుంది. మీరు ఎలాంటి రిప్లై మెసేజ్‌లను టైప్ చేయాల్సిన అవసరం లేకుండానే మెసేజ్ టైపింగ్ బాక్స్‌లో పలు సజెషన్ మెసేజెస్ చూపించబడతాయి.
సౌండ్ ఆంప్లిఫైర్
మీ చుట్టు పక్కల నుంచి ఉత్పన్నమయ్యే శబ్దాల తీవ్రతను తగ్గిస్తూ మీరు కాల్ మాట్లాడేటప్పుడు అవతలి వారికి స్పష్టంగా వినిపించేలా ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ 10లో తీర్చిదిద్దారు.
గెశ్చర్ నావిగేషన్
ఆండ్రాయిడ్ 10లో గెశ్చర్ నావిగేషన్ మోడ్ ఫీచర్ ద్వారా నావిగేషన్ బార్ ఏరియా పూర్తిగా మాయమవుతుంది. యూజర్లు గెశ్చర్లతో ఫోన్‌ను ఆపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. యూజర్లు ఫుల్ స్క్రీన్‌ను ఎక్స్‌పీరియెన్స్ దీని ద్వారా పొందవచ్చు.
డార్క్ థీమ్
ఆండ్రాయిడ్ 10లో సిస్టమ్ వైడ్ డార్క్ థీమ్‌ను అందిస్తున్నారు. రాత్రి పూట ఈ థీమ్ వల్ల కళ్లపై ఒత్తిడి పడకుండా ఉంటుంది. అలాగే ఫోన్ బ్యాటరీ కూడా సేవ్ అవుతుంది.
ఫాస్టర్ సెక్యూరిటీ అప్‌డేట్స్
ఈ ఫీచర్ ద్వారా ఇకపై నేరుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచే తమ ఫోన్‌కు సెక్యూరిటీ అప్‌డేట్లను పొందవచ్చు.
ఫోకస్ మోడ్
ప్రసుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ 10 బీటా వెర్షన్‌లో ఉంది. త్వరలోనే ఫైనల్ వెర్షన్‌లో ఇవ్వనున్నారు. ఈ ఫీచర్ ద్వారా ఇతర యాప్స్ నుంచి మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. పనిచేస్తున్న యాప్‌పైనే ఫోకస్ పెట్టవచ్చు.
ఫ్యామిలీ లింక్
పిల్లలు ఆండ్రాయిడ్ డివైస్‌ను ఎంత సేపు ఉపయోగించాలి, నెట్‌ను ఎంత వాడుకోవాలి, ఏమేం చూడాలి అన్న అంశాలను ఈ ఫీచర్ ద్వారా తల్లిదండ్రులు కంట్రోల్ చేయవచ్చు.
లొకేషన్ కంట్రోల్స్
ఈ ఫీచర్ ద్వారా యూజర్లు కేవలం నిర్దిష్టమైన యాప్‌ను ఉపయోగించినప్పుడు మాత్రమే లొకేషన్ ఆన్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు. దీంతో ఆ యాప్‌ను యూజర్ ఓపెన్ చేసినప్పడే ఆ యాప్ లొకేషన్‌ను ఉపయోగించుకుంటుంది. యాప్‌ను క్లోజ్ చేయగానే దానికి లొకేషన్ షేరింగ్ ఆగిపోతుంది.
ప్రైవసీ కంట్రోల్
ఆండ్రాయిడ్ 10లో యూజర్లు తమ తమ డివైస్‌లలో ఉండే యాప్స్‌కు ఎలాంటి పర్మిషన్లు ఇవ్వాలో నిర్ణయించుకోవచ్చు. యాప్స్‌కు పర్మిషన్లు ఇవ్వకుండా నియంత్రించవచ్చు. ఈ ఫీచర్ ద్వారా యూజర్లకు మరింత ప్రైవసీ లభిస్తుంది.