ఆండ్రాయిడ్ యాప్‌లు తమకు అవసరం లేకపోయినా వాడకందారుల సమాచారాన్ని యాక్సెస్ చేయకుండా నిషేధించాలని గూగుల్ ఆశ్చర్యకర నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం అధికశాతం యాప్‌లకు ఇకపై మన కాల్ లాగ్స్, ఎస్సెమ్మెస్‌లతోపాటు మన కీలక సమాచారాన్ని అందిపుచ్చుకునే అవకాశం ఉండదు.
థర్డ్ పార్టీ యాప్స్‌ను కంగు తినిపించిన గూగుల్
ఆండ్రాయిడ్ డెవలపర్స్ బ్లాగ్‌లో గూగుల్ ఇటీవల ఒక పోస్ట్ పెట్టింది. ఆండ్రాయిడ్ డెవలపర్లు ఇకపై వినియోగదారుల కాల్ లాగ్స్, ఎస్సెమ్మెస్ వంటి కీలక సమాచారాన్ని అందిపుచ్చుకునే వీల్లేదన్నది దాని సారాంశం. సదరు యాప్‌ల ‘‘కీలక విధుల’’కు అవసరమైతే తప్ప ఈ సమాచారం పొందడానికి అనుమతించబోమని స్పష్టం చేసింది. ఈ కొత్త అప్‌డేట్ అమలు కోసం ఇప్పటికే ఉన్న యాప్‌లకు 90 రోజుల గడువివ్వగా, ఇకపై రాబోయే కొత్త యాప్‌లకు మాత్రం తొలిరోజునుంచే ఈ నిషేధం వర్తిస్తుందని పేర్కొంది. అంటే... షాపింగ్ యాప్స్ కీలక విధులకు మన ఎస్సెమ్మెస్, కాల్ లాగ్స్ సమాచారంతో పనిలేదుగనుక ఇకమీదట వాటిని అందుకునేందుకు అనుమతి ఉండదన్న మాట.
వినియోగదారులకు మరిన్ని అధికారాలు!
బ్లాగ్‌పోస్ట్‌లో గూగుల్ పేర్కొన్న ప్రకారం... యాప్ పర్మిషన్లు అవసరమైనంత మేరకే తప్ప ఇంతకుముందున్నట్లు సంపూర్ణంగా లభించవు. అంటే... ఒక యాప్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత దాని విభిన్న విధులకు సంబంధించి అనుమతుల కోసం వినియోగదారులకు పలు స్క్రీన్లలో ఆప్షన్లు కనిపిస్తాయి. ఆ మేరకు కాల్ లాగ్స్‌కు అనుమతి విషయంలో స్క్రీన్ భిన్నంగా ఉంటుంది. ఎస్సెమ్మెస్, ఫొటోలు తదితరాలన్నిటికీ భిన్నమైన స్క్రీన్లలో ఒకేఒక అనుమతి ఆప్షన్ మాత్రమే ప్రత్యక్షమవుతూంటుంది. తద్వారా యాప్స్ తమ ఇష్టానుసారం మన సమాచారాన్నంతా ఒడిసిపట్టుకునే వీల్లేకుండా మరిన్ని అధికారాలు మనకు సంక్రమిస్తాయన్న మాట. ఉదాహరణకు యాప్ డెవలపర్ మన ‘‘క్యాలెండర్ ఎంట్రీలతోపాటు డ్రైవ్‌లోని డాక్యుమెంట్ల యాక్సెస్ కోరితే మనం ఏదైనా ఒకదానికే అనుమతి ఇవ్వగల ఆప్షన్’’ మనకుంటుంది. ప్రస్తుతం పర్మిషన్ స్క్రీన్ ఒక్కటి మాత్రమే కనిపిస్తుంది కాబట్టి మనం ప్రతి డేటా యాక్సెస్‌కూ అనుమతి ఇవ్వాల్సి వస్తోంది. ఇకపై ఈ జంఝాటం ఉండదు!
అనుమతి కోల్పోయే యాప్‌లు ఏవి?
మన దేశంలో షాపింగ్ యాప్‌లు... ‘‘ఫ్లిప్‌కార్ట్, అమెజాన్’’ వగైరా; ఆహార సరఫరా యాప్‌లు... ‘‘జొమాటో, స్విగ్గీ’’ తదితరాలు; ట్రావెల్ యాప్‌లు... ‘‘మేక్ మై ట్రిప్, ఓయో’’ వంటివి రీప్రోగ్రామ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ మేరకు ఎస్సెమ్మెస్, కాల్ లాగ్స్ యాక్సెస్‌కు అనుమతి ఆప్షన్‌ను అవి తొలగించాల్సి ఉంటుంది. అవును మరి... మన కాల్ లాగ్స్, ఎస్సెమ్మెస్‌లు వాటి కీలక విధుల్లో భాగం కావు కదా! అదే సమయంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటివాటికీ ఇకపై అనుమతులుండవు. అయితే, వాట్సాప్, ట్రూకాలర్ వంటి యాప్‌ల కీలక విధుల్లో కాల్ లాగ్స్, ఎస్సెమ్మెస్‌లు భాగం కనుక వాటికి మాత్రం యాక్సెస్ ఉంటుంది. అలాగే ‘‘అనుమతించబడిన’’ (వైట్‌లిస్ట్) జాబితాలో పేటీఎంకూ స్థానం కల్పించబడింది. అది యూపీఐ ఆధారిత చెల్లింపులు, నగదు బదిలీలు చేస్తుందిగనుక ఈ అనుమతులు అవసరం.
గూగుల్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది?
గూగుల్ ఇటీవల Google+ను తప్పనిసరి పరిస్థితుల్లో మూసేయాల్సి వచ్చింది. ఇందులోని ‘‘అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్’’ (API)లో బగ్ కారణంగా దాదాపు 5,00,000 మంది వినియోగదారుల సమాచారం ప్రమాదంలో పడిందన్న కథనాలు వెలువడటమే ఇందుకు కారణం. గూగుల్ అకౌంట్‌తో ముడిపడి ఉన్న థర్డ్ పార్టీ యాప్‌లు ఈ బగ్ సాయంతో వినియోగదారుల సమాచారాన్ని చేజిక్కించుకున్నట్లు భోగట్టా. కాబట్టే ఆండ్రాయిడ్ యాప్స్ విషయంలో గూగుల్ ఈ కఠిన వైఖరి అనుసరించి ఉండొచ్చు!