మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా టెక్నాలజీలోమార్పు చేర్పులు చేయడంలో కంప్యూటర్ దిగ్గజం గూగుల్ ముందంజలో ఉంటుంది. ఈ నేపథ్యంలోనే గూగుల్ కంపెనీ గతంలో ఎన్నో సాఫ్ట్‌వేర్‌లు, యాప్‌లను రూపొందించింది. ఈ కోవకు చెందిందే ఆండ్రాయిడ్ గో. అయితే ఆండ్రాయిడ్ గో ఆండ్రాయిడ్‌లో కొత్త వెర్షనా లేక ఆపరేటింగ్ సిస్టమా లేక కొత్త యాప్‌నా అనేది తెలియని విషయం. ఇటీవల మౌంటెన్‌వ్యూలో జరిగిన గూగుల్ డెవలపర్స్ కాన్ఫరేన్స్‌లో ఆండ్రాయిడ్ గోను ప్రవేశపెట్టింది ఆ సంస్థ. ఈ కొత్త ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాక అందరిలోనూ సందేహాలు తలెత్తాయి. ఆండ్రాయిడ్ గో ద్వారా ఆండ్రాయిడ్ యాప్‌లన్నీ రన్ అవుతాయా అనే ప్రశ్నలు కూడా రేకెత్తాయి. లేకపోతే యాప్‌లను ఆప్టిమైజ్ చేయడానికి గూగుల్ ఈ కొత్త సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తెచ్చిందా అన్న సందేహం కూడా ఉంది.
.
మంచి పెర్ఫార్‌మెన్స్ కోసం
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో యాప్‌లు మంచి ఫెర్ఫార్‌మెన్స్ కోసం గూగుల్ ఈ కొత్త ఆండ్రాయిడ్ గో యాప్‌ను రంగంలోకి తీసుకొచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఆండ్రాయిడ్ గో ఉపయోగించే యాప్‌ల విషయంలో ఎలాంటి పరిమితులు లేవని చెబుతున్నారు. ఆండ్రాయిడ్ గో ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్ వాడే వినియోగదారులకు కొత్త అనుభూతిని ఇచ్చేందుకు గూగుల్ కొత్త టెక్నాలజీని వాడుతున్నట్లు సమాచారం. ఈ కొత్త టెక్నాలజీపై గూగుల్ ఇప్పటికప్పుడు ఎలాంటి సమాధానం చెప్పకపోయినా ఆచరణలోనే చూపించాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. గూగుల్ వెబ్‌సైట్లో కూడా దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు.
కొత్త వెర్షన్ కాదు
గూగుల్ ఆండ్రాయిడ్‌లో ఎన్నో వెర్షన్లు వస్తుంటాయి. కానీ ఆండ్రాయిడ్ గో మాత్రం అలాంటి కొత్త వెర్షన్ కాదు అంటున్నారు ఈ కొత్త సాంకేతికతను పరిచయం చేసిన సమీర్ సమత్ చెప్పారు. గూగుల్ ప్లే స్టోర్‌లో గూగుల్ యాప్‌లు మేనేజ్ చేయడానికి ఆండ్రాయిడ్ గో ఉపయోగపడుతుందనేది సమత్ మాటల సారాంశం. మన ఆండ్రాయిడ్ ఫోన్లో కొన్ని ఓఎస్ సెట్టింగ్స్‌ను మార్చుకోవడం ద్వారా ఈ కొత్త సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ఆండ్రాయిడ్ గో మూడు విషయాల్లో సాయం చేస్తుందని అంటున్నారు. ఆండ్రాయిడ్ సిస్టమ్‌ను ఆప్టిమైజ్ చేసి ఉంచడానికి, ఎలాంటి ఇబ్బంది లేకుండా డివైజ్ రన్ కావడానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాదు మన డివైజ్‌లలో డౌన్‌లోడ్ అవుతున్న యాప్‌లు కూడా ఆప్టిమైజ్ చేయడానికి ఇది సహకరిస్తుంది. కేవలం యాప్‌లు మాత్రమే కాక... ఆప్టిమైజ్ అయిన యాప్‌లను ప్లేస్టోర్‌లో హైలైట్ చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.