చైనా దిగ్గజం హువాయి ఈ మధ్య అనేక వివాదాల్లో చిక్కుక్కున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవలే ప్రపంచంలో రెండవ అతిపెద్ద సరఫరాదారుగా పేరు తెచ్చుకున్న హువాయి అమెరికా దెబ్బకు ఒక్కసారిగా కుదేలైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంతో అక్కడి కంపెనీలు వరుసబెట్టి హువాయి కంపెనీతో వ్యాపార సంబంధాలను తెంచుకుంటున్నాయి. టెక్ దిగ్గజం గూగుల్ కూడా ఇందుకు నాంది పలికింది. ఇన్ని బెదిరింపులు ఉన్నా హువాయి మాత్రం వీటిని ఏమీ లెక్క చేయడం లేదు. తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే గూగుల్ కు భారీ స్థాయిలో షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది.
చైనా మొబైల్ మేకర్ హువాయి గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్‌కు పోటీగా సరికొత్త వినూత్నమైన ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందిస్తోందని చైనా మీడియా పేర్కొంటోంది. సొంతం ఆపరేటింగ్ సిస్టమ్ రూపకల్పనతో హువాయి ఒకేసారి గూగుల్, ఆపిల్ కంపెనీలకు ఝలక్ ఇచ్చేందుకు రెడీ అయింది. హువాయి ఓఎస్ పేరు హాంగ్‌మెంగ్ అయ్యి ఉండొచ్చని అక్కడి నివేదికలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉంటే హువాయి 2012 నుంచే సొంత ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తోందని తెలిపాయి. ఈ ఓఎస్ పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయని, త్వరలోనే క్రమంగా తన ఫోన్లలో ఆండ్రాయిడ్ స్థానంలో ఈ ఓఎస్‌ను అందుబాటులోకి తీసుకువస్తుందని నివేదికలు తెలిపాయి.
కాగా అంతర్జాతీయ గూఢచార సంస్థలు, రోబొట్ ఆర్మ్స్‌ల దొంగతనం, నాశనం చేయలేని డైమండ్ కోటెడ్ గ్లాసులు, ఇరాన్‌తో అనుమానాస్పద ఒప్పందాలు తదితర అంశాలకు సంబంధించి ఈ కంపెనీపై అనేక ఆరోపణలు ఉన్నాయి.ఈ ఆరోపణల మధ్య అమెరికా హువాయి కంపెనీని బ్లాక్ లిస్టులో ఉంచింది. గూగుల్ కూడా ఆండ్రాయిడ్ ఓఎస్ నిలిపివేస్తున్నామని తెలిపింది.
గూగుల్ నిర్ణయంతో హువాయి, హానర్ స్మార్ట్‌ఫోన్లకు రానున్న కాలంలో గూగుల్ సర్వీసులు అందుబాటులో ఉండకపోవచ్చు. గూగుల్ మ్యాప్స్, యూట్యూబ్, గూగుల్ ప్లేస్టోర్ వంటి యాప్స్ వినియోగించుకోలేరు. పాత కస్టమర్లకు వచ్చిన నష్టమేమీ లేదు. కొత్త ఫోన్ల పరిస్థితే అర్థంకావడం లేదని పలువురు చెబుతున్నారు.
హువాయికు గూగుల్ ఝలక్ ఇవ్వడంతో ఆ కంపెనీ ప్లాన్ బి అమలు చేయాలని చూస్తోంది. సొంతంగానే ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశముంది. కంపెనీ ఇప్పటికే ప్రత్యేకమైన ఓఎస్‌పై పనిచేస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే భవిష్యత్‌లో గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్‌కు పోటీగా హువాయి హాంగ్‌మెంగ్ రానుందని తెలుస్తోంది.