అందరూ క్రెడిట్, డెబిట్ కార్డులు వాడుతున్నప్పటికీ వాటి సెక్యూరిటీ విషయంలో నిత్యం ఆందోళన చెందుతూనే ఉంటుంటారు. అయినా... తప్పనిసరి అవసరంగా మారిపోవడంతో వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ కార్డులను వాడుతుంటారు. కార్డులను ఇష్యూ చేసే బ్యాంకులు, సంస్థలు కూడా ఎప్పటికప్పుడు ఎస్సెమ్మెస్, వాయిస్ మెసేజిల రూపంలో అప్రమత్తం చేస్తుంటాయి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి... ఏం చేయాలి... ఏమేం చేయకూడదు వంటివన్నీ వివరంగా చెబుతున్నాయి. బ్యాంకుల వైపు నుంచి కూడా సెక్యూరిటీ పరంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే... ఎన్ని చేసినా కార్డు మోసాలు మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో నాలుగంకెల పిన్ కు తోడుగా లేదంటే దానికి బదులుగా మరింత బలమైన అదనపు భద్రతా ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రఖ్యాత మాస్టర్ కార్డు ఈ విషయంలో ముందడుగు వేసి ఫింగర్ ప్రింట్ సెక్యూరిటీ ఫీచర్ ను క్రెడిట్ కార్డులకు అప్లయ్ చేస్తోంది.
పిన్ కాపీ చేస్తారనే భయం లేదు..
ఇప్పటి వరకు నాలుగంకెల సీక్రెట్ కోడ్‌తో వాడుతున్న క్రెడిట్ కార్డులను ఇక మీదట మరింత భద్రంగా వాడుకోవచ్చు. మీ పిన్‌ని ఎవరైనా కాపీ చేస్తారనే భయం కూడా ఇకపై మీకు ఉండదు. ఎందుకంటే ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లు, సీక్రెట్ లాకర్లకు అందుబాటులో ఉన్న ఫింగర్ ప్రింట్ స్కానర్ భద్రతను క్రెడిట్ కార్డులకు ఎందుకు అన్వయించకూడదనే ఆలోచన మాస్టర్‌కార్డ్ సంస్థకు కలిగింది. అంతే ఈ టెక్నాలజీతో క్రెడిట్ కార్డును రూపొందించింది.
ఫుల్ సెక్యూరిటీ
కార్డుకి కుడివైపు పైన ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను అమర్చారు. ఇది ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న క్రెడిట్ కార్డుల్లానే సన్నగానే ఉంది. డిజైన్‌లో ఎలాంటి మార్పూ లేదు. ఈ కార్డును వాడేటప్పుడు మనకు పిన్‌తో పనిలేదు. స్వైపింగ్ మెషీన్‌లో కార్డును పెట్టినప్పుడు ఫింగర్ ప్రింట్ స్కానర్ వద్ద మీ బొటనవేలును పెడితే సరిపోతుంది. వేరొకరి వేలిముద్రతో ఈ కార్డు పనిచేయదు కాబట్టి కార్డ్ హోల్డర్‌కి మరింత భద్రత ఉన్నట్లే.
ప్రస్తుతానికి సౌత్ ఆఫ్రికాలో
ప్రస్తుతం ఈ క్రెడిట్ కార్డులను దక్షిణ ఆఫ్రికాలో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నట్లు మాస్టర్‌కార్డ్ స్పష్టం చేసింది. జ్వైప్ సంస్థతో కలిసి 2014 నుంచి ఈ ప్రాజెక్టు చేపట్టింది. ఆ ఏడాదే దీన్ని ఆవిష్కరించింది. త్వరలో యూరప్, ఆసియా-పసిఫిక్ దేశాల్లో కూడా ఈ కార్డులను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. తాము రూపొందించిన ఈ కొత్త కార్డులతో వినియోగదారులకు మరింత భద్రతను కల్పిస్తామని మాస్టర్‌కార్డ్ చీఫ్ అజయ్ భల్లా చెబుతున్నారు. స్మార్ట్‌ఫోన్లలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను తీసుకొచ్చిన తరవాత కార్డుల్లో కూడా దీన్ని పెట్టడం చాలా సులభమని తమకు తెలిసిందని చెప్పారు. సెక్యూరిటీ ఎక్స్‌పర్టులు కూడా పిన్ కంటే వేలిముద్ర ఉత్తమమని చెప్పడంతో తాము ఈ కొత్త కార్డును తయారుచేశామన్నారు. అయితే ఈ ఫీచర్ అయినా కార్డులకు 100 పర్సంట్ సెక్యూరిటీ ఇస్తుందా లేదంటే సైబర్ నేరగాళ్లు దీనికి కూడా ఏదో ఒక ఎత్తుగడ వేస్తారా అన్నది చూడాలి. ఏదైనా కానీ ఇప్పటికైతే ఇది మంచి ఫీచర్ గానే కనిపిస్తోంది.