వైపై... ఇప్పుడు అందరికి కావాల్సిందే! ఇది ఉంటేనే ఇంట్లో నెట్ పనులు నడిచేది. పీసీలు, ల్యాప్‌టాప్‌లే కాదు ట్యాబ్‌లు, స్మార్ట్‌ఫోన్లలో ఒకేసారి నెట్ వాడటానికి వైఫైకి మించింది లేదు. అందుకే ప్రతి ఇంటిలోనూ వైఫై మామూలైపోయింది. ఇళ్లలో మాత్రమే కాదు పబ్లిక్ ప్లేసుల్లో కూడా ఇప్పుడు వైపై అందుబాటులో ఉంటుంది. ప్రైవేటు రంగం సంస్థలే కాదు ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా వైఫై వాడకం ఎక్కువైంది. కానీ ఇక్కడే ఒక చిక్కొచ్చిపడింది. ఇంట్లో వైఫైని ఉపయోగిస్తే మనం పాస్‌వర్డ్ పెట్టుకుంటాం. డేటాను బయట వాళ్లు మన అనుమతి లేకుండా వాడకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ పబ్లిక్ ప్లేసుల్లో ఇది కుదరదు. పాస్‌వర్డ్ అందరికి యునిక్‌గా ఉన్నా మన డివైజ్‌లను వైరస్‌లు సోకే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
దీని వల్ల మన వ్యక్తిగత సమాచారాని ప్రమాదం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో నార్టన్ యాంటీ వైరస్ సంస్థ ఒక సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసింది. వైఫై రక్షణ కోసం యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. నార్టన్ వైఫై ప్రైవసీ పేరుతో ఉన్న ఈ సాఫ్ట్‌వేర్ వల్ల పబ్లిక్ స్థలాల్లో మనం వైఫై వాడినా మన ఫోన్లు, ల్యాప్‌టాప్‌లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. విండోస్, మాక్, ఆండ్రాయిడ్, ఐ ఫోన్, ఐ ప్యాడ్‌లలో ఈ ప్రైవసీ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించుకోవచ్చు. నార్టన్ పరిశోధనల ప్రకారం పబ్లిక్ వైఫైలను 70 శాతం భారతీయులు మెయిల్స్ చెక్ చేసుకోవడానికి, ఏమైనా డాక్యుమెంట్లను పంపుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారట. వీరిలో 59 శాతం మంది తమ ఆర్థిక సంబంధమైన లావాదేవీలకు పబ్లిక్ వైఫైని ఉపయోగించట్లేదట. దీనికి కారణం వైరస్‌ల భయమే.
ఇలాంటి భయాన్ని పారద్రోలడానికి తమ కంపెనీ వైఫై సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ని తీసుకొచ్చిందని.. ఇది మూడంచెల రక్షణ గలదని ఆ సంస్థ తెలిపింది. ఎలాంటి హ్యాకింగ్ భయం ఉండదని చెప్పింది. ఈ కొత్త సాఫ్ట్‌వేర్ ద్వారా పబ్లిక్ వైఫైని కూడా అన్ని పనులకు ఉపయోగించుకోవచ్చట. మన పాస్‌వర్డులు, క్రెడిట్, డెబిట్ కార్డు నెంబర్లు, ఇతర సున్నిత సమాచారాన్ని హ్యాకర్లు తస్కరించకుండా ఈ సాఫ్ట్‌వేర్ అడ్డుకుంటుందట. వైఫైతో పాటు వ్యక్తిగత హాట్‌స్పాట్‌కు కూడా ఈ సాఫ్ట్‌వేర్ రక్షణ కల్పిస్తుందట. మన ఫోన్ నుంచి సమాచారం వేరే వారికి చేరుతుందనే భయం అక్కర్లేదని నార్టన్ చెబుతోంది.