దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థ ఆపిల్ కొత్త ఆపరేటింగ్ సిస్టం ఐఓఎస్ 13ని పరిచయం చేసింది. ఆపిల్ వార్షిక డెవలపర్ సదస్సు (డబ్ల్యూడబ్ల్యూడీసీ) 2019లో భాగంగా ఆపిల్ తన నూతన ఓఎస్‌ల గురించి ప్రకటన చేసింది. అలాగే వాటిల్లో అందివ్వనున్న ఫీచర్ల వివరాలను కూడా ఆపిల్ వెల్లడించింది.ఐఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ సెప్టెంబర్ నెలలో ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఇక ఈ ఓఎస్ ఐఫోన్ 6ఎస్ ఆపైన వచ్చిన ఐఫోన్లలో, 7వ జనరేషన్ ఐపాడ్ టచ్ డివైస్‌లో ఇన్‌స్టాల్ అవుతుందని ఆపిల్ తెలిపింది. ఐఓఎస్ 13లో అందివ్వనున్న ముఖ్యమైన ఫీచర్ల వివరాలను ఓ సారి పరిశీలిద్దాం.
1. ఐఓఎస్ 13లో కొత్తగా డార్క్ మోడ్ అనే ఫీచర్‌ను అందివ్వనున్నారు. దీంతో రాత్రి పూట ఫోన్‌లో థీమ్ అంతా నల్లగా మారుతుంది. ఈ క్రమంలో కళ్లపై ఒత్తిడి పడకుండా ఉంటుంది.
2. ఐఓఎస్ 13లో ఫొటోస్ ట్యాబ్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఫొటోలను వాటిని తీసిన రోజులు, నెలలు, సంవత్సరాలను బట్టి సులభంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అలాగే ఫొటోలను స్క్రోల్ చేసే కొద్దీ వాటిలో వచ్చే లైవ్ ఫొటోలు, వీడియోలు మ్యూట్ చేయబడి ఆటోమేటిక్‌గా ప్లే అవుతాయి.
3. ఫొటోలను ఎడిట్ చేసుకునేందుకు మరిన్ని అధునాతన టూల్స్‌ను, ఫీచర్లను అందిస్తున్నారు. దీంతో ఫొటోలను మరింత ఆకర్షణీయంగా ఎడిట్ చేసుకోవచ్చు.
4.కెమెరా ఆప్షన్‌లో పోర్ట్రెయిట్ మోడ్‌లో కొత్త లైటింగ్ ఎఫెక్ట్‌లను అందివ్వనున్నారు.
5. వెబ్‌సైట్లలో ఫేస్‌బుక్, గూగుల్ అకౌంట్లతో సైనిన్ అవ్వాల్సిన పనిలేకుండా యాపిల్ ఐడీతోనూ లాగిన్ అయ్యేలా ఐఓఎస్ 13లో కొత్త సైనిన్ ఫీచర్‌ను అందివ్వనున్నారు.
6. ప్రైవసీ, సెక్యూరిటీ ఫీచర్లను మరింత సమర్థవంతంగా అందివ్వనున్నారు. ఒక యాప్ లొకేషన్ లేదా డేటాను ఏ మేర ఉపయోగించాలో నియంత్రించే కంట్రోల్ ఆప్షన్‌ను అందివ్వనున్నారు.
7 ఆపిల్ మ్యాప్స్, సిరి, మెమోజీ, మెసేజ్‌లు, రిమైండర్స్, కార్ ప్లే, హోమ్ పాడ్, వాయిస్ కంట్రోల్, నోట్స్, టెక్ట్స్ ఎడిటింగ్, ఫైల్స్, హెల్త్ యాప్‌లను మరింత సులభంగా, వేగంగా ఓపెన్ చేసి వాడుకునేలా తీర్చిదిద్దారు.
8. గత ఓఎస్‌ల కన్నా ఐఓఎస్ 13 మరింత వేగంగా, రెస్పాన్సివ్‌గా పనిచేసేలా తీర్చిదిద్దారు. ఇక ఐఓఎస్ 13 ఉన్న డివైస్‌లలో యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే యాప్స్ సైజ్ 50 నుంచి 60 శాతం వరకు తగ్గనుంది. అలాగే యాప్‌లు కూడా వేగంగా ఓపెన్ అయ్యేలా నూతన ఓఎస్‌ను డిజైన్ చేశారు.