అమెరికా ధాటికి హువాయికు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ట్రంప్ సర్కారు ఇప్పటికే ఆ సంస్థపై ఆంక్షలు విధించగా, ఆ తర్వాత గూగుల్ పెద్ద దెబ్బ కొట్టింది. తాజాగా, ఫేస్‌బుక్ కూడా గూగుల్ బాటలోనే నడిచేందుకు రెడీ అయింది. ఆ సంస్థకు హార్ట్‌వేర్, సాఫ్ట్‌వేర్ సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించి షాకిచ్చింది. రష్యాతో 5జీ ఒప్పందం కుదుర్చుకోగానే ఈ నిర్ణయం వెలువడటంతో హువాయి దిక్కుతోచని స్థితిలోకి వెళ్లింది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తీసుకున్న సంచలన నిర్ణయంతో హువాయి ఫోన్ మార్కెట్ మరింతగా కిందకు జారే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
హువాయి ఫోన్లలో ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి యాప్‌లను ప్రి-ఇన్‌స్టాల్‌గా అందించబోమని తేల్చి చెప్పింది. అయితే, ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఫోన్లకు మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదని పేర్కొంది. కొత్త ఫోన్లలో మాత్రం వీటిని ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది.మార్కెట్లోకి రానున్న హువాయి స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులు వీటిని తప్పక డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందే. అయితే ఇప్పటికే హువావే ఫోన్లు వినియోగిస్తున్న వారికి అన్ని అప్‌డేట్స్ ఇస్తామని ఫేస్‌బుక్ తెలిపింది. ఫేస్‌బుక్ నిర్ణయంపై ట్విటర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే తాజా పరిణామంపై స్పందించేందుకు హువాయి నిరాకరించింది.
హుహాయిపై అమెరికా ఆంక్షల కొరడా ఝుళిపిస్తున్న సంగతి తెలిసిందే. హువాయికు ఎలాంటి సాయం చేయొద్దని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించిన నేపథ్యంలో గూగుల్ సహా పలు టెక్ కంపెనీలు భవిష్యత్‌లో తమ సేవలను అందించబోమని ఇప్పటికే ప్రకటించింది. ఇటీవల గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం 90 రోజుల తర్వాత హువాయి కొత్త ఫోన్లకు గూగుల్ సేవలు ఏవీ అందుబాటులో ఉండవు. దీంతో గూగుల్ ప్లే స్టోర్ నుంచి వారు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కానీ, 90రోజుల తర్వాత గూగుల్ ప్లేస్టోర్ యాక్సెస్‌ను కూడా హువాయి కొత్త ఫోన్లకు ఉండదు.
కాగా సాధారణంగా ఫేస్‌బుక్, ట్విటర్‌లాంటి సోషల్ మీడియా యాప్‌లు ప్రీ-ఇన్‌స్టాల్‌గా ప్రస్తుత స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి వస్తాయి. ఇందుకు కంపెనీలు ముందుగానే ఒప్పందం చేసుకుంటాయి. సోషల్ మీడియాకు చిన్నా పెద్ద దాసోహం అంటున్న ప్రస్తుత తరుణంలో ఈ యాప్‌లు లేని స్మార్ట్‌ఫోన్లపై కొనుగోలు దారుల ఆసక్తి ఏ మేరకు ఉంటుందనేది ఊహించుకోవచ్చు. ఈ నేపథ్యంలో హువాయి స్మార్ట్‌ఫోన్ విక్రయాలు భారీగా ప్రభావితం అయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు అమెరికా ఆంక్షల ఎత్తుగడలను ధీటుగా ఎదుర్కొనే సత్తా తమ వద్ద ఉందని హువాయి ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.
రష్యాతో 5జీపై కీలక ఒప్పందం
ఇదిలా ఉంటే హువాయి రష్యాతో 5జీపై కీలక ఒప్పందాన్ని చేసుకుంది. రష్యాలో 5జీ సేవలను అభివృద్ధి చేసేందుకు గాను రష్యా టెలికాం సంస్థ ఎంటీఎస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఒకవైపు అమెరికా చైనా ట్రేడ్‌వార్‌లో భాగంగా అమెరికాలో ఇబ్బందులు కొనసాగుతుండగా మరోవైపు రష్యాలో 5జీ సేవలను అభివృద్ధి చేసేందుకు ఈ కీలక డీల్‌ను కుదుర్చుకుంది. 2019-20 నాటికి 5జీ టెక్నాలజీకోసం రష్యా టెలికాం సంస్థ ఎంటీఎస్‌తో ఈ ఒప్పందం కుదుర్చుకుంది.
2019 లేదా 2020లో
రష్యాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా మాస్కోలో సమావేశమైన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమక్షంలో రెండుకంపెనీలు ప్రతినిధులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. వచ్చే ఏడాది నాటికి ఈ కంపెనీలు రష్యాలో 5జీ టెక్నాలజీ అభివృద్ధి చేస్తాయి. దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్టును 2019 లేదా 2020లో కానీ ప్రారంభిస్తారని ఎంటీఎస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ఒప్పందంతో రష్యా చైనా దేశాల వ్యూహాత్మక బంధం మరింత బలపడిందంటూ హువాయి అధినేత గువోపింగ్ సంతోషం వ్యక్తం చేశారు.