• తాజా వార్తలు

క్వాల్‌కామ్ నుంచి స్నాప్‌డ్రాగన్ 845 చిప్‌సెట్, పనితీరుపై ఓ లుక్కేయండి

ప్రముఖ చిప్ తయారీ సంస్థ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 845 మొబైల్ ప్లాట్‌ఫాంను విడుదల చేసింది. ఈ చిప్‌సెట్ కలిగిన మొబైల్ ఫోన్లు 2018 ఆరంభంలో రానున్నాయి. కాగా ఇప్పటికే షియోమి తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఈ ప్రాసెసర్ గతంలో వచ్చిన స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్ కన్నా 25 శాతం వేగంగా పనిచేస్తుందని క్వాల్‌కామ్ వెల్లడించింది.

స్నాప్‌డ్రాగన్ 845 చిప్‌సెట్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ ఎక్స్20 ఎల్‌టీఈ మోడెమ్ మొబైల్ ఫోన్లలో గరిష్టంగా 1.2 జీబీపీఎస్ వరకు ఇంటర్నెట్ స్పీడ్‌ను ఇస్తుంది.

ఈ చిప్‌సెట్ ఉన్న స్మార్ట్‌ఫోన్లలో డ్యుయల్ సిమ్, డ్యుయల్ వీవోఎల్‌టీఈ పనిచేస్తుంది. అంటే వీవోఎల్‌టీఈ కెపాసిటీ ఉన్న రెండు సిమ్ కార్డులను ఒకేసారి స్టాండ్ బైలో ఉంచవచ్చు. ఇప్పటి ఫోన్లలో మాదిరిగా 4జీ వీవోఎల్‌టీఈ కావాలంటే సిమ్‌ను స్విచ్ చేయాల్సిన పనిలేదు.

ఇక ఈ చిప్‌సెట్ లో ఏర్పాటు చేసిన అడ్రినో 630 జీపీయూ గతంలో వచ్చిన చిప్ సెట్స్ కన్నా అద్భుతమైన గ్రాఫిక్స్‌ను మరింత వేగంగా అందిస్తుంది. 4కె అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్ ఉన్న వీడియోలకు ఔట్‌పుట్ సపోర్ట్‌ను ఇస్తుంది.

యూఎస్‌బీ టైప్ సి, హెచ్‌డీఎం, డిస్‌ప్లే పోర్ట్‌ల ద్వారా 4కె అల్ట్రాహెచ్‌డీ రిజల్యూషన్ ఉన్న వీడియోలను ప్లే చేసుకోవచ్చు. అలాగే 16 మెగాపిక్సల్ సామర్థ్యం ఉన్న రెండు కెమెరాలను ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేస్తే వాటితో వేగంగా ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు స్నాప్‌డ్రాగన్ 845 చిప్‌సెట్ పనికొస్తుంది.

బ్లూటూత్ 5.0, క్విక్ చార్జ్ 4.0 టెక్నాలజీలు ఈ చిప్‌సెట్‌లో లభిస్తున్నాయి. క్విక్ చార్జ్ 4.0 వల్ల ఫోన్ చార్జింగ్ కేవలం 15 నిమిషాల్లోనే 60 శాతం వరకు పూర్తవుతుంది.దీంతోపాటు ఫోన్ బ్యాటరీ కెపాసిటీ కూడా పెరుగుతుంది.

ఈ చిప్‌సెట్ ఉన్న ఫోన్లలో ఫింగర్‌ప్రింట్, ఐరిస్, వాయిస్, ఫేస్‌లాక్స్ అమోఘంగా పనిచేస్తాయి. చాలా వేగంగా డివైస్‌లను అన్‌లాక్ చేయవచ్చు. ఇవే కాకుండా మరెన్నో అడ్వాన్స్‌డ్ ఫీచర్లు స్నాప్‌డ్రాగన్ 845 చిప్‌సెట్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి.
 

జన రంజకమైన వార్తలు