స్మార్టు ఫోన్లలో ప్రధాన సమస్య ఛార్జింగ్. స్మార్టుఫోన్ యాక్టివిటీ ఎక్కువగా ఉండడం... పెద్ద డిస్ ప్లే, 4జీ ఇంటర్నెట్ వాడకంతో పాటు ర్యామ్ పెరగడం, యాప్ ల వినియోగం పెరగడం వంటి కారణాలతో స్మార్టు ఫోన్ల బ్యాటరీలు తొందరగా డిశ్చార్జి అవుతుంటాయి. ఇప్పుడొస్తున్న ఫోన్లలో ఎక్కువ సామర్థ్యమున్న బ్యాటరీలు వాడుతున్నప్పటికీ వాటి చార్జింగ్ కు పడుతున్న సమయమూ ఎక్కువగానే ఉంటోంది. దీంతో స్మార్టు ఫోన్ ఉన్నవారంతా అదనంగా పవర్ బ్యాంకులు కూడా వెంట తిప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే... దీనికి పరిష్కారంగా నిత్యం బ్యాటరీ టెక్నాలజీలో మార్పులు తెస్తూనే ఏదో ఒక అడ్వాన్సు మెంట్ చూపిస్తున్నాయి సంస్థలు. అందులో భాగంగానే కొద్దికాలంగా క్విక్ ఛార్జి టెక్నాలజీ వ వాడుతున్నారు. అందులోనూ ఇప్పుడు క్విక్ ఛార్జి 4 ప్లస్ టెక్నాలజీని తీసుకొస్తున్నారు.
అరగంటలో 60 శాతం
క్విక్ చార్జ్ టెక్నాలజీతో బ్యాటరీలు కేవలం 30 నిమిషాల పాటు చార్జింగ్ పెడితే 60 శాతానికి పైగా చార్జింగ్ వెంటనే పూర్తవుతుంది. అయితే ఈ టెక్నాలజీలో కొత్త వెర్షన్ అయిన 'క్విక్ చార్జ్ 4 ప్లస్' తాజాగా విడుదల అయింది. క్వాల్‌కామ్ కంపెనీ దీన్ని విడుదల చేసింది. క్విక్ చార్జ్ 4 ప్లస్ టెక్నాలజీ ద్వారా ఫోన్ బ్యాటరీలు గతంలో కన్నా 15 శాతం వేగంగా చార్జింగ్ అవుతాయి. అంతేకాదు, 30 శాతం బ్యాటరీ ఆదా అవుతుంది.
కూల్ గా ఉంచుతుంది..
మరోవైపు బ్యాటరీ ఖర్చు కావడం కూడా నెమ్మదిస్తుంది. అంటే... చార్జింగ్ ఎక్కువ సమయం నిలుస్తుందన్నమాట. దీంతోపాటు బ్యాటరీ చార్జింగ్ అయ్యే సమయంలో ఫోన్ కూడా అంతగా హీట్ అవదు. కూల్‌గానే ఉంటుంది. సాధారణ ఫోన్లతో పోల్చితే 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్ ఉన్న ఫోన్లలో ప్రస్తుతం ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది.
నూబియా జడ్ 17లో ఉంది..
నూబియా జడ్17లో ఈ టెక్నాలజీ వాడుతున్నారు. దీనివల్ల ఆ ఫోన్ పూర్తిగా చార్జింగ్ లేకుండా ఉన్నప్పుడు కూడా 50 శాతం చార్జింగ్ కావడానికి కేవలం 25 నిమిషాలు మాత్రమే టైమ్ పడుతుంది. ఈ ఏడాది రెండో అర్ధభాగంలో రానున్న ఫోన్లలో ఈ టెక్నాలజీ విరివిగా వాడే అవకాశాలున్నాయి. అలాగే కార్ చార్జర్లు, పవర్ బ్యాంకులు, వాల్ అడాప్టర్లలోనూ ఇది వాడొచ్చు. అంతేకాదు... ఇప్పటికే క్విక్ ఛార్జ్ 3, లేదా 4 టెక్నాలజీతో ఉన్న ఇలాంటి యాక్ససరీస్ కు ఈ కొత్త టెక్నాలజీ ఉన్న అడాప్టర్లు కూడా అందుబాటులోకి రానున్నాయి.