ఐఫోన్ యూజర్లకు టెక్ దిగ్గజం ఆపిల్ బ్యాడ్ న్యూస్ ను మోసుకొచ్చింది. మీపాత ఐఫోన్ కొత్త వెర్షన్ కు అప్ గ్రేడ్ చేసుకోకుంటే మీరు వాడే ఐఫోన్లలో ఇకపై వాట్సప్ సర్వీసు పూర్తిగా నిలిచిపోనుంది. ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సప్ ఫిబ్రవరి 1, 2020 నుంచి పాత ఐఫోన్లలో తన సర్వీసులను నిలిపివేయనుంది. వాట్సప్ నుంచి కొత్త అప్ డేట్స్ ఆయా వెర్షన్ ఐఫోన్లకు అందుబాటులో ఉండవు అని ఓ రిపోర్టు తెలిపింది. కొత్త వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఐఫోన్లలో మాత్రమే వాట్సాప్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
ప్రస్తుతం ఐఫోన్ iOS 8 డివైజ్ ల్లో వాట్సప్ సర్వీసు యాక్టివ్ గా ఉంది. ఫిబ్రవరి 1, 2020 నుంచి ఈ డివైజ్ ల్లో వాట్సప్ సర్వీసు నిలిచిపోనుందని, సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. వాట్సప్ యాక్సస్ చేసుకోవాలంటే ఐఫోన్లలో iOS 9 లేదా తర్వాతి వెర్షన్లలో మాత్రమే సాధ్యమవుతుంది. iOS 8 ఐఫోన్లలో వాట్సప్ అకౌంట్ ఉంటే 2020 తర్వాత కొత్త అకౌంట్ క్రియేట్ చేయడం లేదా రీవెరిఫై చేసుకోవడం కుదరదు. వాట్సప్ రన్ చేయాలంటే iOS 9 వెర్షన్ లేదా ఆపై వెర్షన్లలో మాత్రమే సాధ్యపడుతుందని సంస్థ తెలియజేసింది. యూజర్లు లేటెస్ట్ iOS వెర్షన్ అప్ డేట్ చేసుకోవడం ద్వారా వాట్సప్ సర్వీసులను నిరంతరాయంగా వినియోగించుకోవచ్చు. కాగా ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ లను మాడిఫై చేసిన డివైజ్ ల్లో కూడా వాట్సప్ సర్వీసులు నిలిపివేయనున్నట్టు వాట్సప్ సంస్థ తెలిపింది.
దీంతో పాటుగా ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా వాట్సప్ అలర్ట్ చేసింది. ఆండ్రాయిడ్ వెర్షన్ 2.3.7 లేదా అంతకంటే పాత ఆండ్రాయిడ్ వెర్షన్ ల్లో కూడా కొత్త వాట్సప్ అకౌంట్ క్రియేట్ చేసుకోలేరని, పాత అకౌంట్లను రీవెరిఫై చేసుకోలేరని స్పష్టం చేసింది. ఈ డివైజ్ లన్నింటికీ ఫిబ్రవరి 1, 2020 వరకు మాత్రమే వాట్సప్ పనిచేస్తుంది.