ఇండియాలో ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ రోజురోజుకీ పడిపోతున్నాయని రిపోర్టులు బల్ల గుద్ది చెబుతున్నాయి. మెకెన్సీ అనే సంస్థ కొన్నేళ్ల క్రితం స్టడీ చేసి ఇండియాలో ప్రొడ్యూస్ అవుతున్న ఇంజినీర్లలో 25% మందికే ఉద్యోగాలు దొరుకుతున్నాయని చెప్పింది. తర్వాత ఇది 20%కు పడిపోయింది. తాజాగా యాస్పైరింగ్ మైండ్స్ అనే ఎసెస్‌మెంట్ ఫర్మ్ అంచనాల ప్రకారం ఇండియాలోని 95% మంది ఇంజినీర్లు కనీసం కోడ్ కూడా రాయలేరట.
లాస్ట్ ఇయర్ మనదేశంలో 8 లక్షల మంది బీటెక్ స్టూడెంట్స్ పట్టాలు తీసుకుని బయటకు వచ్చారు. ఇందులో సగం మందికి కూడా క్యాంపస్ ఇంటర్వ్యూల్లో జాబ్‌లు రాలేదని ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) చెబుతోంది. ఎన్ఐటీలు, ఐఐటీలు వంటి ప్రీమియర్ ఇంజినీరింగ్ కళాశాలల్లో చదివినవారికి తప్ప మిగిలిన కాలేజ్‌ల్లో చదివినవారిలో అత్యధిక మంది నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారు.
కారణాలేమిటి?
లోక్వాలిటీ ఎడ్యుకేషన్, ఔట్ డేటెడ్ కరిక్యులమ్, ల్యాబ్, లైబ్రరీ, ఫ్యాకల్టీ క్వాలిటీగా లేకపోవడం ప్రధాన కారణాలు. ఎన్ని లక్షల మంది ఇంజినీర్లు ఏటా బయటికి వస్తున్నా తమ అవసరాలకు తగ్గ నైపుణ్యమున్న వాళ్లు దొరకడం లేదని ఓ పక్కన ఇండస్ట్రీలు గోల పెడుతున్నాయి. అయితే 2001లో దేశంలో కొత్తగా 700 ఇంజినీరింగ్ కాలేజీలు స్టార్టయ్యాయి. అక్కడి నుంచి పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన వందల కొద్దీ ఇంజినీరింగ్ కాలేజ్‌లు సరైన ఫ్యాకల్టీ లేకుండానే అడ్మిషన్లు తీసుకున్నాయి. తమకే రాని లెక్చరర్లు స్టూడెంట్స్‌కు ఇంకేం చెబుతారు? ఫలితంగా ఇంజినీరింగ్ పూర్తయినా కూడా కోడ్ రాయలేని ఇంజినీర్లు లక్షల మంది పోగయ్యారు.
ఏం చేయాలి?
దీనిమీద ఇప్పటికే AICTE సీరియస్‌గా దృష్టి పెట్టింది. తమ నామ్స్ ప్రకారం స్టాండర్డ్స్ పాటించని కాలేజీలకు మంగళం పాడేస్తోంది. ఇప్పటికే 150 కాలేజీలు మూతపడ్డాయి. మరో 800 కాలేజీలు ఇదే దారిలో ఉన్నాయి. వరుసగా ఐదేళ్లపాటు 30% సీట్లు కూడా నిండని కాలేజీలను మూసేయాలని 2003లో ఇంజినీరింగ్ కాలేజీల నాణ్యతపై గవర్నమెంట్ నియమించిన యూఆర్ రావ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఇది అమలు చేస్తే ఇంకొన్ని వందల కాలేజీలు మూతపడడం ఖాయం. 2016-17లో దేశంలోని 3,291 ఇంజినీరింగ్ కాలేజ్‌ల్లో 15.5 లక్షల సీట్లలో సగం మాత్రమే నిండాయి. అంటే మిగిలిన కాలేజీల్లో చేరడానికి స్టూడెంట్స్ ఇంటరెస్ట్ చూపించలేదు. AICTE ఫ్యాకల్టీ, లైబ్రరీ, ల్యాబ్ వంటి కీలక విషయాల్లో తన స్టాండర్డ్స్‌ను మెయింటెయిన్ చేసేలా కాలేజీలను ట్యూన్ చేయాలి. కంపెనీలకు కావాల్సినట్లుగా ఇంజినీరింగ్‌లో కొత్త కోర్సులు, సబ్జెక్టులు ప్రవేశపెట్టడమే దీనికి పరిష్కారం