శాలరీలు పెద్దగా పెరగకపోయినా, 20, 30 వేల స్టార్టింగ్ జీతానికే పెద్ద కంపెనీలు కూడా తీసుకుంటున్నా, బెంచ్ మీద కూర్చోబెట్టి పని ఇస్తారో లేదో తెలియకపోయినా, ఉన్న జాబ్‌లోంచి తీసేసి ఎప్పుడు పింక్ స్లిప్ ఇస్తారో తెలియకపోయినా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ జాబ్ అంటే మాత్రం మన యూత్‌లో ఇప్పటికీ అదే క్రేజ్. డొక్కు బైక్ మీద తిరిగే పక్కింటి పిల్లాడు పిల్లాడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయ్యాక షికాగోలోనో, కాలిఫోర్నియాలోనో మంచి లావిష్ కార్ ముందు నిలబడి ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పెడతాడు. నిన్నటి దాకా మనల్ని చూడగానే అన్నా అని గౌరవించే కుర్రాడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయి విదేశాలకెళ్లగానే ఫేస్‌బుక్‌లోనో, ట్విట్టర్‌లోనో వాట్ బ్రో అని ప్రశ్నిస్తాడు. అంత సీన్ ఉంది కాబట్టే ఆ కొలువుకు అంత క్రేజ్.అయితే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కావాలనుకునేవాళ్లు ఈ ఏడు విషయాలను మరిచిపోకూడదు అంటున్నారు నిపుణులు.
1. ఇన్నోవేషన్
సృజనాత్మకంగా ఆలోచించడం ఈ వృత్తిలో ఎదగడానికి అత్యంత కీలకం. కొత్త ప్రోగ్రామ్స్ డెవలప్ చేసినా, ప్రోగ్రామ్స్ టెస్టింగ్, డెవలప్ చేసినా, కస్టమర్స్‌తో డైరెక్ట్‌గా ఇంటరాక్ట్ అయ్యే పని అయినా ఏదైనా సరే ఇన్నోవేటివ్‌గా ఆలోచించండి. మీ ఐడియా ప్రస్తుతం మీ ఫీల్డ్‌లో లేదా సమాజంలో సమస్యలను తీర్చగలిగేది అయ్యేలా ఉన్నా, మీ కస్టమర్స్ సమస్యలను రెక్టిఫై చేయగలిగినా మీరు అడుగు ముందుకేసినట్లే.
2. డైవర్స్ జాబ్ ఓపెనింగ్స్
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ఒక్క రంగంలోనే జాబ్ ఆఫర్లు పరిమితం కాదు. హెల్త్ కేర్ ఫెసిలిటీస్, రెస్టారెట్స్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లు, ట్రాన్స్‌పోర్ట్ ప్రొవైడర్లు, విద్యాసంస్థలకు కస్టమైజ్డ్ సాఫ్ట్‌వేర్లు అవసరమవుతాయి. వాటిని నడిపించడానికి ఉద్యోగులు అవసరమవుతారు. కాబట్టి ఇప్పుడున్న దానికంటే భవిష్యత్తులో మరిన్ని రంగాల్లో జాబ్ ఓపెనింగ్స్ వచ్చేఅవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
3. దేశ, విదేశాల్లో కొలువు
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కొలువులో ఉన్న ప్రధాన ఆకర్షణ ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్లి పనిచేయడం. మీరు జాబ్‌లో స్కిల్స్ పెంచుకుని డెవలప్ అయ్యే కొద్దీ విదేశాల్లో కూడా జాబ్ చేసే అవకాశాలు మీ తలుపు తడతాయి. అంతేకాదు ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లో కూర్చుని వర్క్ ఫ్రం హోం చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇంట్లో నుంచే ప్రపంచంలో ఏ కంపెనీకైనా మీరు ప్రాజెక్టులుచేయొచ్చు.
4. క్రియేటివ్ ప్రాబ్లం సాల్వింగ్
మీకు చిన్నప్పటి నుంచి పజిల్స్ సాల్వ్ చేయడం, లాజికల్ ప్రాబ్లమ్స్‌కు సొల్యూషన్స్ వెతకడం వస్తే ఈ ఫీల్డ్‌లో మీకు బోల్డంత స్పేస్ ఉంది.ఇలా క్రియేటివ్ థింకర్స్‌కి సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ రెడ్‌కార్పెట్ పరుస్తుంది.
5. టీమ్‌వర్క్
ఒంటరిగా మీరెంత పనిమంతుడైనా ఒక టీంతో కలిసి పనిచేయడంలో మీకు స్కిల్స్ ఉంటే అది మీకు సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో బాగా ఉపయోగపడుతుంది. టీమ్‌తో కలిసిపోయి మంచి రిజల్ట్ చూపించగలిగితే రేపటి టీమ్ లీడర్ మీరే.
6. మంచి అవకాశాలు
అన్ని రంగాల్లోనూ సాఫ్ట్‌వేర్లు వచ్చేస్తున్నాయి. అందువల్ల తాత్కాలికంగా ఇండస్ట్రీలో కొంత స్లంప్ కనిపించినా భవిష్యత్తు బాగుంటుందంటున్నారు నిపుణులు. అందుకే తక్కువ జీతం, చిన్న కంపెనీ అయినా ముందు జాయినవ్వాలి లేదంటే ఓపెనింగ్స్ రాక టైం వేస్టయిపోతుంది. ఏదో ఒక జాబ్‌లో చేరితే ఎక్స్‌పీరియన్స్‌తోపాటు కొత్త అవకాశాలకు దారులు కూడా అవే కనపడతాయి.
7. ఆకర్షణీయమైన వేతనం
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగం అంటే అందరూ ఆసక్తి చూపడానికి ప్రధాన కారణం ఆకర్షణీయమైన వేతనం. పెద్దగా పెరుగుదల లేదని ఇప్పటికే ఉన్నవాళ్లు చెబుతున్నప్పటికీ ఈ రంగంలో దక్కుతున్న జీతాలు మిగతా రంగాలతో పోల్చితే చాలా ఎక్కువే.