వారానికి ఐదు రోజుల పని! చాలామందికి ఇష్టమైన దినచర్య ఇది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లో మాత్రమే ఈ కల్చర్ సాధారణంగా ఉంటుంది. కానీ మిగిలిన అన్ని జాబ్స్‌లోనూ ఆరు రోజులు పని చేయాల్సిందే. అయితే వారానికి ఐదు రోజులు కాదు కానీ.. మూడు రోజులే పని చేసే అవకాశం వస్తే! వినడానికే ఇది చాలా బాగుంది..ఆచరణలోకి వస్తేనా! అనే ఆలోచన కలుగుతుంది కదా! కానీ ఇది ఊహ కాదు. త్వరలో నిజం కాబోతోంది. అది కూడా ఒక టెక్నాలజీ విప్లవం ద్వారా ఇది సాధ్యం అవుతుంది. మరి ఏమిటా టెక్నాలజీ! ఇదెలా సాధ్యం...
ఏఐ ఉంటే చాలంట..
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ)... టెక్నాలజీలో విధ్వంసక మార్పుకు శ్రీకారం చుడుతోన్న టెక్ విప్లవం. భారత్‌లో ఏఐ వేగంగా విస్తరిస్తోంది. దాదాపు అన్ని టెక్ కంపెనీలు ఏఐని అడాప్ట్ చేసుకుని పనిని మరింత సులభం చేసుకునే పనిలో పడ్డాయి. ఐటీ జాబ్స్ లాండ్‌స్కేప్‌ను పూర్తిగా మార్చే శక్తి ఏఐకి ఉందని అన్ని కంపెనీలు నమ్ముతున్నాయి. అంటే మానవ శక్తికి రెండు మూడింతలు ఎక్కువగా పని చేసే ఈ టెక్నాలజీ వల్ల ఐటీ రంగం కొత్త పుంతలు తొక్కనుంది. అంటే కలెక్టివ్ హ్యుమన్ ఇంటిలిజెన్స్ డబుల్ కావడానికి 25 ఏళ్లు పడితే.. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కేవలం ఏడాదిలోనే ఈ ప్రక్రియను పూర్తి చేస్తుంది. ఇక బిలియన్స్ ఏఐ బాట్స్ కలిసి పనిచేస్తే దాని శక్తి ఎన్నింతలు ఉంటుందో..అదెంత పని చేసి పెడుతుందో మీరే ఇమేజన్ చేసుకోవచ్చు. రోబోట్ల ద్వారా పని చేయించుకోవడం వల్ల మనుషులతో పని తగ్గిపోతుంది. శ్రమ తగ్గుతుంది. మనీ ఆదా అవుతుంది.
అద్భుతాలే చేయచ్చు
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో కేవలం ఐటీ సెక్టార్ బ్రహ్మాండంగా మారిపోవడమే కాదు.. మనుషుల జీవితాలే మారిపోతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతాలే చేయచ్చు ఈ ఏఐతో. సెల్ఫ్ లెర్నింగ్ సిస్టమ్ డెవలప్ కావడం, ఎవరు టీవీ చూస్తున్నారో వారిని బట్టి ప్రోగ్రామ్స్ మారిపోవడం, మీ ఇంట్లో అవసరాలేంటో ఎప్పటికప్పుడు మీకు తెలిసిపోవడం, మీ ఇంట్లో ఎవరున్నారో ఎవరు లేరో మీ ఇంటికే తెలిసిపోవడం, మీరు ఆఫీసుకు బయల్దేరే కొన్ని సెకన్ల ముందు కారు ఆటోమెటిక్‌గా స్టార్ట్ కావడం లాంటి అద్భుతాలను మీరు భవిష్యత్‌లో చూడొచ్చు. అసలు అద్భుతం అని ఇప్పుడు అంటున్నాం కానీ కొన్ని రోజుల్లో ఇవి మనకు మామూలు విషయాలు అయిపోయే అవకాశాలున్నాయి. ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ మాయే. అయితే ఏఐ సాయంతో మన ఆఫీసులోనూ పని తగ్గిపోవడం ఇక మన పని దినాలు కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. వారానికి మూడు రోజుల పని చేస్తే చాలు. ఎందుకంటే మిగిలిన పనంత ఏఐ చూసుకుంటుంది. దాన్ని మేనేజ్ చేయడమే మీరు చేయాల్సిన పని.