• తాజా వార్తలు

60% ఉద్యోగులు వారి ఉద్యోగం పట్ల అసంతృప్తిగ ఉన్నారు!!

"ఛీ!  వెధవ ఉద్యోగం!, ఈ.ఎం.ఐలు కట్టేందుకు ఈ దరిద్రగొట్టు బాస్ దగ్గర జాబ్ చేయక తప్పడం లేదు కానీ లేక పోతే ఎప్పుడో మానేద్దును" అని మీరెప్పుడైనా అనుకున్నారా? అలా అనుకొనేది మీరొక్కరే కాదుట. పెద్ద కంపెనీల్లో పని చేసే ఉద్యోగులలో చాలామంది అలాగే అనుకుంటున్నారని ఒక శాంపిల్ సర్వే బయటపెట్టింది.

సర్వేలో అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పిన 700మంది ఉద్యోగుల మనోభావాల సారాంశం ఇలా ఉంది.

మొత్తం సర్వేలో పాల్గొన్నవారిలో  చేస్తున్న ఉద్యోగాన్ని ఇష్టపడని వారు 60%. అయితే

ఐటీ సంస్థలలో పని చేస్తున్నవారిలో ఇది 50%గానూ, బిఎఫ్‌యస్‍ఐ ఇండస్ట్రీలో ఇది 53%గానూ, ఐటి ఆధారిత బిఓపీ సంస్థలలో ఇది 70%గానూ ఉంది.

పురుషులలో ఉద్యోగాన్ని ఇష్టపడేవారు30%మాత్రమే ఉండగా  ఇష్టపడని వారు 70% ఉన్నారు. మహిళల్లో ఇష్టపడేవారు46%కాగా, ఇష్టపడనివారు 54%. అంటే మహిళలు తమకు నచ్చని ఉద్యోగాలలో ఎక్కువకాలం కొనసాగడం లేదన్నమాట.

ఉద్యోగాన్ని ఇష్టపడక పోవడానికి కారణం  వ్యక్తులు అంటే బాస్, సహోద్యోగులూ అని 50%మంది, జాబ్ ప్రొఫైల్/రోల్ నచ్చకపోవడం అని 30% మంది,  ప్రయాణసమయం, టైం షెడ్యూలు లో అసౌకర్యాలు లాంటి కారణాలు 20% మందీ చెప్పారు.

వ్యక్తుల కారణంగా ఉద్యోగం నచ్చని వారిలో 60%మంది బాస్ తో సమస్యలే కారణమనీ,   30% మంది సహోద్యోగులతో సమస్యలే కారణమని చెప్పారు.  10%మంది తమ టీంలో కలివిడితనం లేకపోవడమే జాబ్ నచ్చకపోవడానికి కారణమన్నారు.

జాబ్ ప్రొఫైల్/రోల్ నచ్చనివారిలో 50% తమకు అసలు ఆ జాబ్ మీదే ఆసక్తి లేదని చెప్పగా,  25%మంది చేరేసమయంలో చెప్పినదానికీ, చేరిన తర్వాత అప్పగించిన పనికీ తేడా ఉండటమే కారణమన్నారు. 15%మంది ఉద్యోగంలో అభివృద్ధికి అవకాశం లేకపోవడమే తమ అయిష్టానికి కారణమన్నారు. 10%మంది మాత్రం తమ పని ఛాలెంజింగ్ లేదనీ, రొటీన్‌గా బోర్‍గా మారిందనీ చెప్పారు.

రవాణా ఇతర సమస్యల కారణంగా ఉద్యోగాన్ని అసహ్యించుకుంటున్న వారిలో 40%మంది ఉద్యోగంలో ఫ్లెక్సిబిలిటీ లేకపోవడమే కారణమని చెప్పగా,  30%మంది పనికీ జీవితానికీ బాలెన్సు కుదరడం లేదన్నారు. 20%మంది పని గంటలు మరీ ఎక్కువగా ఉన్నాయని చెప్పగా, 10%మంది ప్రయాణం మరీ కష్టంగా ఉందని చెప్పారు.

 

జన రంజకమైన వార్తలు