సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. యువతకు కలల ఉద్యోగం ఇది.. ఎందుకంటే ఐదంకెల జీతం... బోనస్‌లు, ఇంక్రిమెంట్‌లు ఇంకా చాలా చాలా! అందుకే సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి రోజు రోజుకీ విలువ పెరుగుతుందే తప్పా... తగ్గట్లేదు. అయితే సాఫ్ట్‌వేర్ కంపెనీల ఆలోచనలు మాత్రం వేరేలా ఉన్నాయి. ఖర్చు ఎక్కువ అయిపోవడంతో కాస్ట్ కటింగ్‌కు దిగుతున్నాయి. భారీగా శాలరీలు పొందుతున్న ఉద్యోగులే లక్ష్యంగా వారిని తొలగించే పనిలో పడ్డాయి. తాజాగా కాగ్నిజెంట్ ఏడాదికి రూ.80 లక్షలు సంపాదిస్తున్న 350 మంది ఉద్యోగులను తొలగించే పనిలో పడింది. మరి సాఫ్ట్‌వేర్ పరిశ్రమ ఎటు వెళుతోంది!
సీనియర్ ఉద్యోగులే లక్ష్యం
తాజాగా కాగ్నిజెంట్ సీనియర్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుంది. భారీగా జీతాలు చెల్లిస్తున్నవీరిని తొలగించే పని చేపట్టింది. ఏకంగా 350 మంది సీనియర్, మిడ్ లెవల్ ఉద్యోగులను తొలగించాలని కాగ్నిజెంట్ కఠిన నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే వీరికి ఒక్కోక్కరికి ఏడాదికి రూ.80 లక్షల నుంచి రూ.1.2 కోట్లు చెల్లించాల్సి రావడమే కారణం. కాస్ట్ కటింగ్ పాలసీ, న్యూ ఏజ్ డిజిటల్ టెక్నాలజీలను పెంచుకునే పనిలో భాగంగా కాగ్నిజెంట్ ఈ చర్యలు చేపడుతోంది. క్వాలిటీ కంట్రోల్ లాంటి వాటికి దీంతో తెరపడేలా కనిపిస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ 350 మంది ఉద్యోగుల్లో ఎక్కువమంది 50 నుంచి 55 ఏళ్ల లోపు వాళ్లే కావడం విశేషం.
డబ్బుల ఆదా కోసం
లే ఆఫ్స్ చేయడం అనేది కేవలం ఖర్చు తగ్గించే పనిలో భాగమే అనేది స్పష్టం. వీలైనంతమంది ఉద్యోగులను తొలగించి ఉన్నవాళ్లతోనే లాభాలు రాబట్టాలనేది ప్రస్తుత ఐటీ సంస్థల వ్యూహమని నిపుణులు అంటున్నారు. కాగ్నిజెంట్‌తో పాటు పలు సంస్థలు ఈ వ్యూహ్యాన్ని అనుసరిస్తున్నాయని తెలుస్తుంది. ఇప్పటికే కాగ్నిజెంట్ కాస్ట్ కటింగ్‌లో భాగంగా 7 వేలమంది ఉద్యోగులును తొలగించింది. మరి కొంతమంది ఉద్యోగుల మెడపై కత్తి వేలాడుతోంది. అయితే ఈ 350 మంది ఉద్యోగుల్లో ఎక్కువమంది విదేశీయులే ఉన్నారు. కాగ్నిజెంట్‌లో దాదాపు 150000 మంది భారత ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇప్పుడు వీరికి కూడా ఉద్యోగ భద్రతపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. త్వరలో భారత ఉద్యోగులపై కూడా వేటు పడొచ్చని నిపుణులు అంటున్నారు.