ఉద్యోగం కోసం వెతుక్కునేవాళ్లు ఏం చేస్తారు? పత్రికల్లో యాడ్స్ చూస్తారు.. లేదా టెలివిజన్లలో ప్రకటనలు చూసి దరఖాస్తులు చేసుకుంటారు. ఈ కంప్యూటర్ యుగంలో మరో అడుగు ముందుకేసి ఇంటర్నెట్లో వెతుకుతారు. తమకు కావాల్సిన జాబ్స్ పేరుతో వెతికి ఆ లింక్ ద్వారా ముందుకెళతారు. అయితే ఇంటర్నెట్లో ఏం వెతకాలన్నా కచ్చితంగా చూసే సైట్ గూగుల్. ఈ సెర్చ్ ఇంజన్‌లో వెతికితేనా సరైన ఫలితాలు వస్తాయని అందరూ బలంగా నమ్ముతారు కూడా. అయితే ఎన్నో కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టే గూగుల్.. ఉద్యోగుల కోసం ప్రత్యేకించి ఇప్పటిదాకా ఒక ఆప్షన్ పెట్టలేదు. అయితే వారి కోసమే ఈ ఇంటర్నెట్ దిగ్గజం.. గూగుల్ ఫర్ జాబ్స్‌ను తీసుకొస్తోంది.
ఏంటీ గూగుల్ ఫర్ జాబ్స్?
సాధారణంగా ఉద్యోగులు జాబ్స్ కోసం గూగుల్ సెర్చ్‌లో వెతుకుతారు. అయితే అన్ని జాబ్స్ ఒకే చోట ఉండవు. ఎన్నో రకాల వెబ్‌సైట్లు కూడా ఓపెన్ అవుతాయి. దీనిలో ఏది సరైనదో ఏది కాదో.. మంచి సైట్ ఏంటో కూడా చాలామందికి తెలియదు. అలా లింక్స్ క్లిక్ చేసుకుంటూ వెళిపోతారు. చివరికి తాము అనుకున్న సమాచారాన్ని సాధించినా.. దానికి చాలా సమయం పడుతుంది. ఎన్నో సైట్లు చూడాల్సి వస్తుంది. ఈ ఇబ్బందుల్ని తొలగించడానికి, ఉద్యోగులకు, ఎంప్లాయర్స్‌కు మధ్య వారథిగా నిలవడానికి గూగుల్ ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చింది అదే గూగుల్ ఫర్ జాబ్స్. దీనిలో ప్రముఖమైన ఉద్యోగ సైట్లకు సంబంధించిన ప్రకటనలు ఉంటాయి. ఒక జాబ్ ప్రొఫైల్‌కు సంబంధించిన ఉద్యోగ అవకాశాల జాబితా అంతా ఒకే చోట ఉంటుంది. అంటే ఇంజనీర్ జాబ్స్ అని టైప్ చేస్తే ఒకే చోట మీకు కావాల్సిన సమాచారం లభిస్తుంది.
జాబ్ ప్రొఫైల్స్ ఒకే చోట
గూగుల్ ఫర్ జాబ్స్.. నిజంగా యువతకు బాగా ఉపయోగపడే ఫీచర్. సమయాన్ని ఆదా చేసుకోవడానికి, మంచి జాబ్స్ ఆఫర్ చేసే కంపెనీలను వెతకడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. భిన్నమైన సైట్లను నుంచి జాబ్ పోస్టింగ్స్‌ను గూగుల్ కలెక్ట్ చేసి ఒకే చోట ఉంచుతుంది. అంటే మీరు టైప్ చేసిన జాబ్ ప్రొఫైల్‌కు సంబంధించిన సమాచారం అంతా ఒకే చోట దొరుకుతుంది. ఎంప్లాయర్ పేరు, జాబ్ లొకేషన్, జాబ్ పోర్టల్, పోస్టింగ్ డేట్ అన్ని మీకు డిస్‌ప్లే అవుతాయి. పూర్తి వివరాల కోసం మీరు జాబ్ ప్రివ్యూను క్లిక్ చేస్తే చాలు. ఇది ఎంప్లాయర్స్‌కు కూడా బాగా ఉపయోగపడుతుంది. తాము కోరుకున్న ఫ్రొఫైల్ ఉన్న ఉద్యోగుల్ని త్వరగా నియమించేందుకు మంచి ఆప్షన్. వాళ్లు చేయాల్సిందల్లా గూగుల్ ఫర్ జాబ్స్‌లో జాబ్ లిస్టింగ్స్ యాడ్ చేయడమే.
సెర్చ్ ఫలితాల్లో అగ్రస్థానం
అత్యధికంగా వీక్షించిన జాబ్ ప్రొఫైల్ వివరాలను సెర్చ్ ఫలితాల్లో అగ్రస్థానంలో ఉండేటట్లు గూగుల్ చూస్తుంది. అంటే ఆ కంపెనీలకు పరోక్షంగా ఎక్కువ ట్రాఫిక్ ఉండేలా హెల్ప్ చేస్తుంది. లింక్డ్ ఇన్, మానిస్టర్, టైమ్స్ జాబ్స్ లాంటి పెద్ద జాబ్ పోర్టల్స్‌కు ఇది చాలా ఉపయోగకరం. జాబ్ లిస్టింగ్స్ పోస్ట్ చేసిన వెంటనే పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా మీరు ఒక జాబ్ కోసం వెతికితే ఒకటో రెండో సంబంధిత ఫలితాలు వచ్చేవి.. కానీ తాజాగా గూగుల్ ఫర్ జాబ్స్‌తో వీలైనన్ని ఎక్కువ ఫలితాలు వస్తాయని ఇంటర్నెట్ జెయింట్ చెబుతోంది.